‘శ్రీకృష్ణ’ నివేదికపై చర్చించకనే.. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తారా?
పీలేరు, న్యూస్‌లైన్ : శ్రీకృష్ణ కమిటీ నివేదికపై ఎటువంటి చర్చ లేకుండానే రాష్ట్రాన్ని ఎలా ముక్కలు చేస్తారని పీలేరు సమైక్యాంధ్ర జేఏసీ నేతలు, పలువురు ఉద్యమకారులు ప్రశ్నించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా గురువారం పీలేరు జేఏసీ ఆధ్వర్యంలో వేలాదిమంది విద్యార్థులచే నిరసన ప్రదర్శన, మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఓట్లు, సీట్ల రాజకీయం కోసం సోనియా రాష్ట్రాన్ని ముక్కలు చేస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని విభజిస్తే రాయలసీమ ఎడారిగా మారిపోతుందని ఆందోళన వ్యక్తంచేశారు.
రాష్ట్రమంతా పర్యటించి శ్రీకృష్ణకమిటీ తయారు చేసిన సిఫార్సులపై ఎటువంటి చర్చ జరుపకుండా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నియంతలా వ్యవహరించి ఏకపక్ష నిర్ణయం తీసుకుందని దుయ్యబట్టారు. సీడబ్ల్యూసీ కేవలం పది సీట్ల కోసం ఆరు కోట్ల సీమాంధ్రుల జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. సాగునీటి సమస్యలకు పరిష్కార మార్గాలు చూపకనే రాష్ట్రాన్ని విభజిస్తే వ్యవసాయ రంగం చిన్నాభిన్నమవుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఏపీ ఎన్జీవోల సమ్మెతో సీమాంధ్రలోని 13 జిల్లాలో ప్రభుత్వ పాలన పూర్తిగా స్తంభించిపోయిందన్నారు. పీలేరు ట్యాక్సీ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో వాహనాల ర్యాలీ నిర్వహించి సమైక్యాంధ్రకు మద్దతు పలికారు. వేలాది మంది విద్యార్థులతో క్రాస్ రోడ్ కూడలిలో మానవహారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పీలేరు సమైక్య జేఏసీ నాయకులతోపాటు టీటీడీ బోర్డు సభ్యుడు జీవీ శ్రీనాథరెడ్డి, మండల విద్యాశాఖాధికారి ఏటీ రమణారెడ్డి, వివిధ ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలు, కళాశాలల కరస్పాండెంట్లు, యాజమాన్యం, అధ్యాపక బృందం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కార్మికులు, ప్రజలు పాల్గొన్నారు. అనంతరం సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఆవశ్యకతను వివరిస్తూ విద్యార్థులకు వక్తృత్వ, వేషధారణ పోటీలు నిర్వహించారు.