'అది ఆస్పత్రి కాదు.. ఓ వధశాల'
గోరఖ్పూర్: సాధారణంగా వైద్యాలయం(ఆస్పత్రి) అంటే దేవాలయంతో సమానంగా భావిస్తారు.. అక్కడికి వెళ్లిన వారు తిరిగి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగొస్తారని, కొన ప్రాణంతో వెళ్లినా సరే ప్రాణంతో వస్తారని. అలాంటి ఆస్పత్రిని ఇప్పుడు తమ కన్నబిడ్డలను కోల్పోయిన ఉత్తరప్రదేశ్ బాధితులు ఏమంటున్నారో తెలుసా.. 'అది ఆస్పత్రి కాదు.. వధశాల'. వధశాల అంటే మృత్యువుండే చోటు. కేవలం ప్రాణం తీయడానికి అక్కడికి తీసుకెళతారు. ఇప్పుడు తమ బిడ్డల పరిస్థితి కూడా ఆస్పత్రికి కాకుండా ఓ వధశాలకు తీసుకెళ్లినట్లే అయిందని వారంతా కన్నీరుమున్నీరవతున్నారు.
ఉత్తరప్రదేశ్లోని సీఎం యోగి ఆదిత్యనాథ్ బాధ్యత వహించిన ఎంపీ నియోజకవర్గం గోరఖ్పూర్లోగల బాబా రాఘవ్ దాస్ మెడికల్ కాలేజీలో ఆక్సిజన్ అందకపోవడంతో దాదాపు 60మందికి పైగా చిన్నారులు చనిపోయిన విషయం తెలిసిందే. ఇది పెద్ద సంచనలంగా మారింది. బాధిత కుటుంబాలను ఆయా మీడియాలు సంప్రదిస్తుండగా వారి ఆవేదనను పై విధంగా వెళ్లగక్కారు. బాధితుల్లో ఒకరైన శ్రీ కిషన్ గుప్తా అనే వ్యక్తి మాట్లాడుతూ..
'నాలుగు రోజుల నా బిడ్డ అనారోగ్యంగా ఉందని గురువారం ఉదయం పెద్ద ఆస్పత్రి కదా అని చేర్పించాను. వైద్యులు అత్యవసర విభాగంలో చేర్చారు. అయితే, తన కుమారుడికి అవసరమైన వెంటలేటర్ సౌకర్యం అక్కడ లేదు. నాలుగైదు గంటలు నేనే శ్రమపడ్డాను. ఆక్సిజన్ లేని కారణంగా వెంటిలేటర్ అందించలేమని వైద్యులు చెప్పారు. చివరికి నా బిడ్డ చనిపోయాడు. అది అసలు ఆస్పత్రి కాదు.. అంతకుమించిన వధశాల. నా బిడ్డ మాత్రమే చనిపోవడం కాదు.. నా పక్కనే చనిపోయిన ఇద్దరు బిడ్డలను వారి తల్లిదండ్రులు రోధిస్తూ తీసుకెళుతుంటే ఈ కళ్లతో చూసి తట్టుకోలేకపోయాను' అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశాడు.