Sri Ram Sene
-
న్యాయం గుడ్డిదేగానీ మరీ ఇంతగా......
-
న్యాయం గుడ్డిదేగానీ మరీ ఇంతా......
సాక్షి, బెంగళూరు: మంగళూరులోని ఓ పబ్‌లో ఓ యువకుల బృందం దౌర్జన్యంగా యువతుల జుట్టు పట్టుకొని కొట్టడం, వారు కింద పడిపోవడం, పారిపోయేందుకు ప్రయత్నించడం లాంటి దశ్యాలు 2009, జనవరి 24వ తేదీన దేశవ్యాప్తంగా టీవీ ఛానళ్లలో విస్తృతంగా ప్రసారం అయ్యాయి. దెబ్బలు తిన్న మహిళలు పబ్‌కు మద్యం సేవించేందుకు వచ్చిన వినియోగదారులని, దౌర్జన్యంగా దెబ్బలు కొట్టిన వారంతా కర్ణాటకలో హిందూ సంస్థగా పేరుపొందిన ‘శ్రీరామ్ సేన’ సభ్యులని పోలీసులతోపాటు సమాజమూ గుర్తించింది. మహిళలు పబ్‌లకు వెళ్లడమంటే సంస్కృతిపై దాడి చేయడమేనని, అందుకనే వారికి తగిన శాస్తి జరిగిందంటూ శ్రీరామ్ సేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్ నాడు సంఘటనను సమర్థిస్తూ వ్యాఖ్యానించారు. ఈ దాడికి పాల్పడిందీ తామేనంటూ ఇటు శ్రీరామ్ సేన, అంటూ భజరంగ్ దళ్ సంస్థలు పోటా పోటీగా ప్రకటించుకున్నాయి. తమ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని, ఇందులో భజరంగ్ దళ్‌కు ఎలాంటి సంబంధం లేదంటూ శ్రీరామ్ సేన జిల్లా కన్వీనర్ కుమార్ మాలేమర్ బహిరంగ ప్రకటన చేశారు. ఈ సంఘటనను జాతీయ మహిళా కమిషన్‌కు కూడా తీవ్రంగా పరిగణించడంతో పోలీసులు కేసు నమోదు చేసి 30 మంది నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో ప్రమోద్ ముతాలిక్ కూడా ఉన్నారు. ఆయన 2014 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీలో చేరారు. క్రిమినల్ కేసు పెండింగ్‌లో ఉన్నప్పుడు ఆయన్ని పార్టీలోకి ఎలా తీసుకుంటారని బీజేపీ జాతీయ నాయకత్వం ప్రశ్నించడంతో బీజేపీ కర్ణాటక శాఖ వెంటనే ఆయన్ని పార్టీ నుంచి తొలగించింది. దాదాపు 9 ఏళ్ల అనంతరం ఈ సంఘటనపై మంగళూరులోని ఫస్ట్‌క్లాస్ కోర్టుకు చెందిన థర్డ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ (12.03.18) సోమవారం నాడు తీర్పు చెప్పారు. నిందితులు నిర్దోషులంటూ 30 పేజీల తీర్పును చదివారు. ‘ఈ కేసులో నిందితుల నేరాన్ని రుజువు చేసేందుకు దర్యాప్తు అధికారులు మహిళా వినియోగదారులను కోర్టు ముందు ప్రవేశపెట్టలేక పోయారు. చార్జిషీటులో వారిని సాక్షులుగా చూపలేదు. ఈ కేసులో మహిళా వినియోగదారులే బాధితులు. వారే మంచి సాక్షులు కూడా అవుతారు. వారిని దర్యాప్తు అధికారులు విచారించి ఉంటే నిజం బయటకు వచ్చేది. ఈ కేసులో ఫొటోలు, వీడియోలు చాలా ముఖ్యమైన సాక్ష్యాధారాలు. వాటిని దర్యాప్తు అధికారులు సేకరించి కోర్టులో ప్రవేశపెట్టలేక పోయారు. ఇలాంటి సాక్ష్యాధారలు చూపక పోవడం ఈ కేసుకు ప్రాణాంతకంగా మారింది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంలో చాలా జాప్యం జరిగింది. జాప్యానికి కారణాలు కూడా వివరించలేదు. ఓ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన ఓ జడ్జిమెంట్ ప్రకారం ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంలో జరిగే జాప్యం కూడా కేసు మరణానికి కారణం అవుతుంది. నేరం రుజువు కానందున ఈ కేసులో నిందితులంతా నిర్ధోషులే’ అంటూ కోర్టు తీర్పు చెప్పింది. ‘మమ్మల్ని వ్యతిరేకించిన వారికి, మమ్మల్ని గూండాలని దూషించిన వారికి ఈ తీర్పు ఓ సమాధానం’ అని తీర్పు పట్ల ప్రమాద్ ముతాలిక్ వ్యాఖ్యానించగా, న్యాయం గుడ్డిదని తెలుసుకానీ, మరింత గుడ్డిదని తెలియదని కొందర సామాజిక కార్యకర్తలు వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పు పాఠం చదివితే చాలు, ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేకుండానే న్యాయం ఏమిటో పాఠకులకు బోధపడుతుంది. దర్యాప్తులో ఘోరంగా విఫలమైన దర్యాప్తు అధికారులను దోషిగా ఎందుకు ప్రకటించలేదో ఎందరికి అర్థం అవుతుంది? -
‘మేమేం రేప్‌లు, మర్డర్లు చేయలేదు’
సాక్షి, మంగళూరు : దాదాపు 9 ఏళ్ల వాదనల తర్వాత మంగళూర్ పబ్ దాడి కేసులో నిందితులను కోర్టు నిర్దోషులుగా తేల్చింది. సరైన సాక్ష్యాలు లేనందున వారిని విడుదల చేస్తున్నట్లు సోమవారం జేఎంఎఫ్‌సీ కోర్టు తీర్పు వెలువరించింది. దీంతో శ్రీ రామ్ సేన అధినేత ప్రమోద్ ముథాలిక్, కార్యకర్తలకు ఉపశమనం కలిగింది. తీర్పు అనంతరం బయటకు వచ్చిన ప్రమోద్ మీడియాతో మాట్లాడుతూ.. ఇది చాలా చిన్న విషయమని తెలిపారు. ‘మేమేం రేప్‌లు, మర్డర్లు చేయలేదు. ఇది చాలా చిన్న విషయం. అనవసరంగా కొందరు భూతద్దంలో పెట్టి ప్రపంచానికి చూపాలనుకున్నారు. జమ్ము కశ్మీర్ పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయంటూ అసందర్భ ప్రేలాపనలు చేశారు. పెద్ద పెద్ద నేరాలు చేస్తున్న వాళ్లే బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు. మేం ఏ తప్పు చెయ్యలేదు. చివరకు ధర్మం గెలిచింది’ అంటూ ప్రమోద్ వ్యాఖ్యానించారు. కాగా, మహిళలని కూడా చూడకుండా పబ్ నుంచి బయటకు లాకొచ్చి మరీ నిర్దాక్షిణ్యంగా దాడి చేశారన్నది వీరందరిపై నమోదైన ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారంలో ప్రమోద్‌తోపాటు 30 మంది శ్రీ రామ్ సేన కార్యకర్తలపై కేసు నమోదు అయ్యింది. తొమిదేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఇప్పుడు వారందరినీ నిర్దోషులుగా కోర్టు తేల్చింది. ఈ వ్యవహారంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీపై పరువు నష్టం దావా వేయనున్నట్లు ముథాలిక్ తెలిపారు. మంగళూర్ పబ్ దాడి కేసు... 2009, జనవరి 24వ తేదీన మంగళూర్‌లోని అమ్నేషియా పబ్‌లో పార్టీ చేసుకుంటున్న యువతపై శ్రీ రామ్ సేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాలను పక్కదోవ పట్టిస్తూ పాశ్చాత్య సంస్కృతిని అవలంభిస్తున్నారంటూ వారిపై దాడికి పాల్పడ్డారు. పబ్‌లో ఉన్న వాళ్లందరినీ బయటకు లాక్కొచ్చి మరీ తరిమి కొట్టారు. అయితే మహిళలను కూడా జుట్టు పట్టుకుని విసిరేస్తూ దాడులు చేయటం.. ఆ వీడియోలు వైరల్ కావటంతో దేశ్యాప్తంగా ఘటన చర్చనీయాంశంగా మారింది. జాతీయ మహిళా కమిషన్ జోక్యంతో కేసు దాఖలు కాగా.. శ్రీ రామ్ సేన అధినేత ప్రమోద్ ముథాలిక్, ఆయన అనుచరుల మీద కేసు నమోదు అయ్యింది. 30 మందిలో 25 మంది నిందితులుగా కోర్టు విచారణను ఎదుర్కోగా.. ముగ్గురు విదేశాలకు పారిపోయారు. మరో ఇద్దరు కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే ప్రాణాలు విడిచారు. -
తోక లేని రామ సైనికుడితో తలనొప్పి
నిన్నటి దాకా నరేంద్ర మోడీని ప్రధాని చేయడమే తన లక్ష్యం అని ప్రకటించిన శ్రీరామ సేన అధినేత ప్రమోద్ ముతాలిక్ ఇప్పుడు మోడీని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించడమే తన ధ్యేయం అంటున్నాడు. 'రా రమ్మని' తలుపులు తీసి, ఆ వెంటనే 'పో పొమ్మని' తలుపులు మూసిన బిజెపికి గుణపాఠం చెబుతానంటున్నాడు ఈ రామ సైనికుడు. ఇప్పుడు ముతాలిక్ ధార్వాడ్, బెంగుళూరు సౌత్ నుంచి లోకసభకు పోటీ చేయబోతున్నారు. ధార్వాడ్ లో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషీ, బెంగుళూరు సౌత్ లో అనంత కుమార్ లు బిజెపి అభ్యర్థులు. వారిద్దరి వల్లే తనకు పార్టీలో చోటు దక్కలేదని, అందుకే వారిద్దరినీ ఓడిస్తానని ముతాలిక్ చెబుతున్నారు. బెంగుళూరులో పెద్దగా పట్టులేకపోయినా, ముతాలిక్ ధార్వాడ్ లో బిజెపిని డామేజీ చేసే అవకాశాలున్నాయి. ధార్వాడ్ లో అతివాద హిందూ ఓట్లు గణనీయంగా ఉన్నాయి. అవి ముతాలిక్ ఖాతాలోకి వెళ్తే బిజెపి ఓడిపోయే ప్రమాదం ఉంది. 'ఎరక్కపోయి కెలుక్కున్నాము బాబోయ్ ఈ తోకలేని రామసైనికుడిని' అని బిజెపి నేతలు తలలు పట్టుకుంటున్నారు. -
'జస్వంత్ ను కాదని.. గుండాలకు బీజేపీ రెడ్ కార్పెట్'
జమ్మూ: బీజేపీ, జస్వంత్ సింగ్ వివాదంలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా తలదూర్చారు. సీనియర్ నేత జస్వంత్ సింగ్ కు టికెట్ నిరాకరించడంపై ఓమర్ అబ్దుల్లా తీవ్ర ధ్వజమెత్తారు. జస్వంత్ తోపాటు మరికొంత మంది జంటిల్మన్ నేతలకు టికెట్లు నిరాకరించి పార్టీలో గుండాలకు పెద్ద పీట వేస్తున్నారని ఓమర్ ఆరోపించారు. రాజీకీయాల్లో సంభవిస్తున్న ఇలాంటి సంఘటనల పట్ల భారతీయులందరూ జాగ్రత్తగా ఉండాలని.. లేకపోతే తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. జంటిల్మన్ లాంటి జస్వంత్ కు టికెట్ నిరాకరించి.. గుండాలాంటి ప్రమోద్ ముతాలిక్ కు రెడ్ కార్పెట్ వేశారు. బీజేపీ నిర్ణయాలు ప్రమాదకరంగా ఉన్నాయి అని ఓమర్ ట్విటర్ లో పోస్ట్ చేశారు. పార్టీలోకి చేరిన వెంటనే శ్రీరామ్ సేన చీఫ్ ముతాలిక్ సభ్యత్వాన్ని బీజేపీ రద్దు చేసిన సంగతి తెలిసిందే. జస్వంత్ సింగ్ కు బీజేపీ టికెట్ నిరాకరించడంపై సొంత పార్టీ నుంచే అనేక విమర్శలు వెల్లువెత్తున్న సంగతి తెలిసిందే. బర్మార్ లోకసభ నియోజకవర్గం నుంచి జస్వంత్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. -
రమ్మన్నారు.. పొమ్మన్నారు!
హుబ్లీ/న్యూఢిల్లీ: పబ్‌లో మహిళలపై దాడి కేసులో అరెస్టయిన వివాదాస్పద శ్రీరామ్‌సేన సంస్థ అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ (51) వ్యవహారంలో బీజేపీ నాలుక్కరుచుకుంది. ఆయనను ఆదివారం పార్టీలో చేర్చుకున్న కమలనాథులు.. విపక్షంతోపాటు, స్వపక్షం నుంచీ విమర్శలు రావడంతో గంటల వ్యవధిలోనే నిర్ణయం మార్చుకుని బయటకు పంపేశారు. ముతాలిక్ బీజేపీ కర్ణాటక చీఫ్ ప్రహ్లాద్ జోషి తదితరుల సమక్షంలో హుబ్లీలో తొలుత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీనిపై కాంగ్రెస్ నేత అంబికాసోనీ స్పందిస్తూ.. మహిళల హక్కులపై బీజేపీ వైఖరేమిటో ముతాలిక్ చేర్చుకోవడంతో బట్టబయలైందన్నారు. మహిళలపై దాడికి నేతృత్వం వహించిన ముతాలిక్ నేరస్తుడని సీపీఎం నేత బృందా కారత్ విమర్శించారు. ముతాలిక్ను చేర్చుకోవడంపై బీజేపీ నేత, గోవా సీఎం మనోహర్ పారికర్ అభ్యంతరం తెలిపారు. దీంతో ముతాలిక్ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ బీజేపీ చీఫ్ రాజ్‌నాథ్ సింగ్ రాష్ట్ర బీజేపీ చీఫ్ ప్రహ్లాద్ జోషీని ఆదేశించారు. ముతాలిక్ను చేర్చుకోవడంపై రాష్ట్ర కమిటీ కేంద్ర నాయకత్వాన్ని సంప్రదించలేదు కనుక నిర్ణయాన్ని ఆమోదించలేదని బీజేపీ నేత నిర్మలా సీతారామన్ చెప్పారు. 2009లో మంగళూరులోని ఓ పబ్‌లో మహిళలపై శ్రీరామ్‌సేన దాడి చేయడంతో ముతాలిక్ వార్తల్లోకెక్కారు.