రమ్మన్నారు.. పొమ్మన్నారు!
హుబ్లీ/న్యూఢిల్లీ: పబ్‌లో మహిళలపై దాడి కేసులో అరెస్టయిన వివాదాస్పద శ్రీరామ్‌సేన సంస్థ అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ (51) వ్యవహారంలో బీజేపీ నాలుక్కరుచుకుంది. ఆయనను ఆదివారం పార్టీలో చేర్చుకున్న కమలనాథులు.. విపక్షంతోపాటు, స్వపక్షం నుంచీ విమర్శలు రావడంతో గంటల వ్యవధిలోనే నిర్ణయం మార్చుకుని బయటకు పంపేశారు. ముతాలిక్ బీజేపీ కర్ణాటక చీఫ్ ప్రహ్లాద్ జోషి తదితరుల సమక్షంలో హుబ్లీలో తొలుత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీనిపై కాంగ్రెస్ నేత అంబికాసోనీ స్పందిస్తూ.. మహిళల హక్కులపై బీజేపీ వైఖరేమిటో ముతాలిక్ చేర్చుకోవడంతో బట్టబయలైందన్నారు.
మహిళలపై దాడికి నేతృత్వం వహించిన ముతాలిక్ నేరస్తుడని సీపీఎం నేత బృందా కారత్ విమర్శించారు. ముతాలిక్‌ను చేర్చుకోవడంపై బీజేపీ నేత, గోవా సీఎం మనోహర్ పారికర్ అభ్యంతరం తెలిపారు. దీంతో ముతాలిక్ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ బీజేపీ చీఫ్ రాజ్‌నాథ్ సింగ్ రాష్ట్ర బీజేపీ చీఫ్ ప్రహ్లాద్ జోషీని ఆదేశించారు. ముతాలిక్‌ను చేర్చుకోవడంపై రాష్ట్ర కమిటీ కేంద్ర నాయకత్వాన్ని సంప్రదించలేదు కనుక నిర్ణయాన్ని ఆమోదించలేదని బీజేపీ నేత నిర్మలా సీతారామన్ చెప్పారు. 2009లో మంగళూరులోని ఓ పబ్‌లో మహిళలపై శ్రీరామ్‌సేన దాడి చేయడంతో ముతాలిక్ వార్తల్లోకెక్కారు.