sri rama lingeswara swamy
-
16 నుంచి భద్రాద్రిలో నూతన ఆర్జిత సేవలు
భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈనెల 16 నుంచి నూతన ఆర్జిత సేవలు ప్రారంభించనున్నట్లు ఈఓ రమాదేవి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సేవలకు సంబంధించిన వివరాలను గతంలో వెల్లడించిన ఆలయ అధికారులు.. భక్తులు అభ్యంతరాలు, సలహాలు, సూచనలు అందజేయాలని కోరారు. ఈ ఏడాది జనవరి నుంచే నూతన సేవలను అందుబాటులోకి తీసుకురావాల్సి ఉన్నప్పటికీ పలు కారణాలతో జాప్యం జరిగింది. సేవల వివరాలు ఇవీ.. వేదాశీర్వచనం: స్వామివారి దర్శనానంతరం బేడా మండపంలో (ఒక్కొక్కరికి లేదా దంపతులు) రూ.500 టికెట్‌తో ఉదయం 9.30, 10, 10.30, 11 గంటల స్లాట్స్‌లలో ఆశీర్వాదాలు అందజేస్తారు. ఇందులో పాల్గొన్న భక్తులకు కండువా, జాకెట్పీసు, 100 గ్రామల లడ్డూ అందజేస్తారు. స్వామివారికి తులసీమాల అలంకరణ (ప్రతి శనివారం) రూ.1,000 టికెట్‌తో దంపతులు లేదా ఒకరికి ఉదయం 7 గంటలకు ఉభయదాత శిరస్సుపై తులసీమాల ఉంచి ఆలయ ప్రదక్షిణ చేయిస్తారు. ఆ తర్వాత అంతరాలయంలో భక్తుల సమక్షంలో ధ్రువమూర్తులకు అలంకరణ చేస్తారు. ఇందులో పాల్గొన్న వారికి కండువా, జాకెట్ పీసు, 100 గ్రాముల లడ్డూలు రెండు, అంతరాలయ అర్చనతో రామకోటి పుస్తకాన్ని బహూకరిస్తారు. స్వామివారి నిత్య సర్వ కైంకర్య సేవ రూ.5 వేల టికెట్‌తో ప్రతి రోజూ జరిగే అన్ని సేవలలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దంపతులు పాల్గొనే అవకాశం ఉంటుంది. ఆదివారం భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ఆ రోజు 10 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఇందులో పాల్గొనే భక్తులకు సుప్రభాతం, అభిõషేకం, అంతరాలయ అర్చన, శ్రీలక్ష్మీ అమ్మవారి అర్చన, శ్రీ ఆంజనేయ స్వామి వారి అర్చన, నిత్యకల్యాణం, వేదాశీర్వచనం, సచిత్ర రామాయణ పుస్తకం, ముత్యాల తలంబ్రాల ప్యాకెట్, అదనంగా ఐదుగురికి అన్నప్రసాదం, దర్బారు సేవ, పవళింపు(ఏకాంత) సేవలో పాల్గొనే అవకాశం ఉంటుంది. శ్రీరామనవమి ముత్యాల తలంబ్రాల సమర్పణ రూ.10 వేల టికెట్‌తో శ్రీరామనవమి కల్యాణ టికెట్ సెక్టార్ – 2లో రెండు సంవత్సరాలకు టికెట్లు (ఉభయం), కల్యాణ వ్రస్తాలు, ప్రసాదాలు, 108 ముత్యాలతో కూడిన తలంబ్రాలు అందజేస్తారు. నిత్య పూల అలంకరణ సేవ రూ. 5 వేల టికెట్‌తో సోమవారం నుంచి శనివారం వరకు జరిగే పూజల్లో స్వామి వారికి, ఉపాలయాల్లో అవసరమైన పూల దండల సమర్పణ. ఇందులో పాల్గొనే వారికి కండువా, జాకెట్ పీసు, రెండు చిన్న లడ్డూలు, నలుగురికి అన్నప్రసాదం అందజేస్తారు. తులాభారం రూ.100 టికెట్ ధరతో ప్రతి రోజూ తులాభారం (భక్తులు మొక్కుకున్న చిల్లర నాణేలు, లేదా బియ్యం.. తదితర వస్తువులు) ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు, మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 గంటల వరకు అందించవచ్చు. -
రామలింగేశ్వరునికి కార్తీక శోభ
మల్లాపూర్(కోరుట్ల): కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే ఏకైక హరిహరక్షేత్రంగా శ్రీరామలింగేశ్వర ఆలయం కీర్తించబడుతుంది. మండలంలోని వాల్గొండ గ్రామంలో గోదావరి నది తీరాన ఉన్న ఆలయంలో కార్తీక మాస పంచాహ్నిక మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈనెల 19 నుంచి 23న కార్తీక పౌర్ణమి వరకు శివముష్టి, చందనోత్సవ, తులసీ వివాహా, అష్టోత్తర కళశ స్నపన, లక్ష కుంకుమార్చన, పుష్పయాగములతో పాటు..పౌర్ణమి రోజున లక్ష దీపాలంకరణ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించనున్నారు. లక్ష దీపాలంకరణోత్సవాలకు ముఖ్య అతిథులుగా నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమ పాల్గొంటారని ఆలయ కమిటీ చైర్మన్ సాంబారి శంకర్, వైస్ చైర్మన్ చిలివేరి లక్ష్మి, ఎంపీటీసీ ఇస్లావత్ లక్ష్మీబలరాంనాయక్, మాజీ సర్పంచులు చిలివేరి రమేశ్, ఎండీ.జమాల్, మాజీ ఉపసర్పంచ్ దండిగ రాజం తెలిపారు. విచ్చేయనున్న సాధుపుంగవులు.. కార్తీక పౌర్ణమి రోజున లక్ష దీపాలంకరణోత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి సాధుపుంగవులు ముఖ్య ఆథితులుగా విచ్చేయనున్నారు. మనోరబాద్ నుంచి శ్రీ శివానందభారతిస్వామి, శకణాగిరి నుంచి శ్రీకేశవనాథ్స్వామి, ఆదిలాబాద్ నుంచి శ్రీ ఆదినాథ్స్వామి, వాల్గొండ చంద్రయ్యస్వామి, వేంపేట నుంచి భవవద్గీత పారా యణ భక్తులు, కొలిప్యాక నుంచి శ్రీగంగాధర్స్వామి, కోరుట్ల నుంచి శ్రీ ఆత్మనందస్వామి, గంభీర్పూర్ నుంచి గిరిజామాతస్వామి, కోరుట్ల నుంచి శ్రీజగదీశ్వరస్వామి, కోరుట్ల నుంచి హరిప్రియమాత, పిప్రి నుంచి శ్రీయోగేశ్వరస్వామి, శ్రీ నర్సింగరెడ్డిస్వామి లక్షదీపోత్సవానికి విచ్చేయనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ తెలిపారు. -
ఓం రుద్రాయ స్వాహా!
కీసర, న్యూస్‌లైన్ : శ్రీరామలింగేశ్వరస్వామి కొలువుదీరిన కీసరగుట్ట క్షేత్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధవారం రుద్ర స్వాహాకారంతో ప్రతిధ్వనించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేద పారాయణంతో మార్మోగింది. ప్రత్యేక పూజా కార్యక్రమాలు కన్నులపండువగా జరిగాయి. వైదిక కార్యక్రమాల సంధానకర్త పుల్లేటికుర్తి గణపతిశర్మ ఆధ్వర్యంలో యాగశాలలో మహా వైభవంగా రుద్రస్వాహాకార హోమం నిర్వహించారు. టీటీడీ వేదపాఠశాల విద్యార్థులు నమకచమక సహితంగా హవిస్సులు సమర్పించారు. మరోవైపు ఆలయంలో అర్చకులు బిల్వార్చన చేసి హారతి, మంత్రపుష్పం నివేదించి భక్తులకు తీర్థప్రసాద వినియోగం చేశారు. కీసర గ్రామానికి మంగళవారం సాయంత్రమే విచ్చేసిన శ్రీస్వామివారి ఉత్సవమూర్తిని పురవీధుల్లో ఊరేగించి కల్యాణం కోసం కీసరగుట్టకు తీసుకెళ్లారు. కళకళలాడిన పోచమ్మ అంగడి మహాశివరాత్రికి ముందు రోజు ప్రతి యేట కీసరలో సంప్రదాయంగా నిర్వహించే పోచమ్మ అంగడి బుధవారం భక్తుల ఆనందోత్సాహాల మధ్య వేడుకగా జరిగింది. కాప్రా, యాప్రాల్, నగరం నలుమూలల నుంచి ముఖ్యంగా తమిళులు వివిధ వాహనాల్లో కీసరకు చేరుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. కొందరు తమ సంప్రదాయాన్ని పాటిస్తూ ఎండ్లబండ్లపై కీసరకు చేరుకొని పోచమ్మ గుడిలో పూజలు నిర్వహించి కీసరగుట్టకు చే రుకున్నారు. కాగా, బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కీసరగుట్టలో పోలీసులు నిఘా పటిష్టం చేశారు. డాగ్‌స్క్వాడ్, బాంబుస్క్వాడ్‌లతో తనిఖీలు చేశారు. విద్యుత్ కాంతుల్లో ఆలయం బ్రహోత్సవాల సందర్భంగా శ్రీరామలింగేశ్వరస్వామి వారి ఆలయానికి విద్యుత్ దీపాలతో కొత్త అందాలను తీసుకువచ్చారు. ఆలయంతో పాటు ఆలయ ప్రాంగణంలో రంగురంగుల విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి కీసరగుట్టను శోభాయమానం చేశారు. నేత్రపర్వంగా శ్రీస్వామివారి కల్యాణం బ్రహ్మోత్సవాల్లో ముఖ్యఘట్టమైన శ్రీ భవానీ, శివదుర్గాసమేత శ్రీరామలింగేశ్వరస్వామి వారి కల్యాణం బుధవారం రాత్రి భక్తుల పారవశ్యం మధ్య శోభాయమానంగా జరిగింది. అంతకు ముందు రోజే కీసరలో శ్రీస్వామివారికి మేళతాళాలతో వేదపండితులు ఎదుర్కోలు ఉత్సవం జరిపారు. నంది వాహనసేవ తర్వాత కల్యాణ వేడుకలకు వేద పండితులు శ్రీకారం చుట్టారు. ఒక్కో ఘట్టాన్ని వివరిస్తూ కల్యాణం ఆద్యంతం ఆసక్తిగా నిర్వహించారు. పరమశివుడు.. అన్నపూర్ణ అయిన అమ్మవారిని వివాహం చేసుకోవాలన్న ఉత్సుకతో సమయానికి ముందే వచ్చి తొందర పెడుతున్నారని, వెంటనే కల్యాణ మండపానికి రావాల్సిందిగా కన్యాదాతలైన ఆలయ చైర్మన్ తటాకం రమేష్ శర్మ దంపతులను వేద పండితులు పురమాయించారు. కాళ్లు కడిగి ఆహ్వానించడానికి స్వామివారు లాంఛనాలు అడిగారంటూ చెప్పి... ప్రపంచమంతా తనదే అయినప్పుడు ఇంకా లాంఛనాలు ఎందుకని అమ్మవారు అనునయించినట్లు పండితులు వివరించారు. చివరకు అమ్మవారు ఇచ్చిన సలహా ప్రకారం భక్తిని లాంఛనంగా స్వీకరించిన స్వామివారు... జగన్మాతను పరిణయమాడారని మాంగల్యధారణ గావించారు. రాత్రి పదిగంటల తరువాత కల్యాణ వేడుకలు ప్రారంభం కాగా భక్తులు పెద్ద సంఖ్యలో తిలకించి ఆనంద డోలికల్లో ఓలలాలాడారు. కార్యక్రమంలో ఫౌండర్ ఫ్యామిలీ సభ్యులు తటాకం నారాయణ శర్మ, వెంకటేష్, ఉమాపతి, నాగలింగం, శ్రీనివాస్ శర్మ, ఈఓ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.