ఓం రుద్రాయ స్వాహా! | Shivaratri Brownie from today | Sakshi
Sakshi News home page

ఓం రుద్రాయ స్వాహా!

Published Thu, Feb 27 2014 12:13 AM | Last Updated on Mon, Oct 8 2018 4:35 PM

Shivaratri Brownie from today

కీసర, న్యూస్‌లైన్ : శ్రీరామలింగేశ్వరస్వామి కొలువుదీరిన కీసరగుట్ట క్షేత్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధవారం రుద్ర స్వాహాకారంతో ప్రతిధ్వనించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేద పారాయణంతో మార్మోగింది. ప్రత్యేక పూజా కార్యక్రమాలు కన్నులపండువగా జరిగాయి. వైదిక కార్యక్రమాల సంధానకర్త పుల్లేటికుర్తి గణపతిశర్మ ఆధ్వర్యంలో యాగశాలలో మహా వైభవంగా రుద్రస్వాహాకార హోమం నిర్వహించారు.

 టీటీడీ వేదపాఠశాల విద్యార్థులు నమకచమక సహితంగా హవిస్సులు సమర్పించారు. మరోవైపు ఆలయంలో అర్చకులు బిల్వార్చన చేసి హారతి, మంత్రపుష్పం నివేదించి భక్తులకు తీర్థప్రసాద వినియోగం చేశారు. కీసర గ్రామానికి మంగళవారం సాయంత్రమే విచ్చేసిన శ్రీస్వామివారి ఉత్సవమూర్తిని పురవీధుల్లో ఊరేగించి కల్యాణం కోసం కీసరగుట్టకు తీసుకెళ్లారు.

  కళకళలాడిన పోచమ్మ అంగడి
 మహాశివరాత్రికి ముందు రోజు ప్రతి యేట కీసరలో సంప్రదాయంగా నిర్వహించే పోచమ్మ అంగడి బుధవారం భక్తుల ఆనందోత్సాహాల మధ్య వేడుకగా జరిగింది. కాప్రా, యాప్రాల్, నగరం నలుమూలల నుంచి ముఖ్యంగా తమిళులు వివిధ వాహనాల్లో కీసరకు చేరుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. కొందరు తమ సంప్రదాయాన్ని పాటిస్తూ ఎండ్లబండ్లపై కీసరకు చేరుకొని పోచమ్మ గుడిలో పూజలు నిర్వహించి కీసరగుట్టకు చే రుకున్నారు. కాగా, బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కీసరగుట్టలో పోలీసులు నిఘా పటిష్టం చేశారు. డాగ్‌స్క్వాడ్,  బాంబుస్క్వాడ్‌లతో  తనిఖీలు చేశారు.

 విద్యుత్ కాంతుల్లో ఆలయం
 బ్రహోత్సవాల సందర్భంగా శ్రీరామలింగేశ్వరస్వామి వారి ఆలయానికి విద్యుత్ దీపాలతో కొత్త అందాలను తీసుకువచ్చారు. ఆలయంతో పాటు ఆలయ ప్రాంగణంలో రంగురంగుల విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి కీసరగుట్టను శోభాయమానం చేశారు.

 నేత్రపర్వంగా శ్రీస్వామివారి కల్యాణం
 బ్రహ్మోత్సవాల్లో ముఖ్యఘట్టమైన శ్రీ భవానీ, శివదుర్గాసమేత శ్రీరామలింగేశ్వరస్వామి వారి కల్యాణం బుధవారం రాత్రి భక్తుల పారవశ్యం మధ్య శోభాయమానంగా జరిగింది. అంతకు ముందు రోజే కీసరలో శ్రీస్వామివారికి మేళతాళాలతో వేదపండితులు ఎదుర్కోలు ఉత్సవం జరిపారు. నంది వాహనసేవ  తర్వాత కల్యాణ వేడుకలకు వేద పండితులు శ్రీకారం చుట్టారు. ఒక్కో ఘట్టాన్ని వివరిస్తూ కల్యాణం ఆద్యంతం ఆసక్తిగా నిర్వహించారు. పరమశివుడు.. అన్నపూర్ణ అయిన అమ్మవారిని వివాహం చేసుకోవాలన్న ఉత్సుకతో సమయానికి ముందే వచ్చి తొందర పెడుతున్నారని, వెంటనే కల్యాణ మండపానికి రావాల్సిందిగా కన్యాదాతలైన ఆలయ చైర్మన్ తటాకం రమేష్ శర్మ దంపతులను వేద పండితులు పురమాయించారు.

కాళ్లు కడిగి ఆహ్వానించడానికి స్వామివారు లాంఛనాలు అడిగారంటూ చెప్పి... ప్రపంచమంతా తనదే అయినప్పుడు ఇంకా లాంఛనాలు ఎందుకని అమ్మవారు అనునయించినట్లు పండితులు వివరించారు. చివరకు అమ్మవారు ఇచ్చిన సలహా ప్రకారం భక్తిని లాంఛనంగా స్వీకరించిన స్వామివారు... జగన్మాతను పరిణయమాడారని మాంగల్యధారణ గావించారు. రాత్రి పదిగంటల తరువాత కల్యాణ వేడుకలు ప్రారంభం కాగా భక్తులు పెద్ద సంఖ్యలో తిలకించి ఆనంద డోలికల్లో ఓలలాలాడారు. కార్యక్రమంలో ఫౌండర్ ఫ్యామిలీ సభ్యులు తటాకం నారాయణ శర్మ, వెంకటేష్, ఉమాపతి, నాగలింగం, శ్రీనివాస్ శర్మ, ఈఓ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement