బ్రాహ్మణుల్ని ప్రభుత్వం మోసం చేస్తోంది
విప్రోత్సవం సదస్సులో శ్రీస్వరూపానందేంద్ర సరస్వతి
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్రాహ్మణుల్ని మోసం చేస్తోందని, బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టి రూ.500 కోట్లు ఇస్తామని చెప్పి, కేవలం రూ.100 కోట్లు మాత్రమే ఇచ్చిందని విశాఖ శారదా పీఠాధిపతి శ్రీస్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఆ నిధులు కూడా పేదలు, గ్రామాల్లో నివసించేవారికి అందడం లేదని, అధికార పక్ష కార్యకర్తలకే అందిస్తున్నారని విమర్శించారు. ఏపీలో బ్రాహ్మణ జాతిపై దాడి జరుగుతోందని, దీనిపై ప్రశ్నిస్తే ప్రభుత్వానికి ఈ స్వామి వ్యతిరేకమని ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం విజయవాడ ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత కళాశాల ఆవరణలో ‘విప్రోత్సవం’ జరిగింది.
స్వరూపానందేంద్ర మాట్లాడుతూ అర్చకులకు రూ.10వేలు ఇవ్వాలని ప్రభుత్వం ఇచ్చిన ఉత్వర్వులు జిల్లాస్థాయిల్లో అమలుకావడం లేదన్నారు. దీనిపై త్వరలోనే విజయవాడలో ఒక సభను నిర్వహిస్తామని చెప్పారు. బ్రాహ్మణులు సోమరులు, బద్ధకస్తులని కొంతమంది దాడిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీవీ నరసింహారావు చేసిన సంస్కరణల వల్లే నేడు అన్ని రంగాలకు ఉద్యోగాలు వస్తున్నాయన్నారు. విశాఖ శారదా పీఠం ఆధ్వర్యాన డిసెంబరు లేదా జనవరిలో అమరావతిలో 5 లక్షల మంది బ్రాహ్మణులతో సభ నిర్వహిస్తామన్నారు. అఖిల భారత బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షుడు, రాజస్థాన్ ఎమ్మెల్యే పండిట్ భవర్లాల్ శర్మ మాట్లాడుతూ బ్రాహ్మణుల్ని విస్మరిస్తే ఏమీ జరుగుతుందో ఢిల్లీలో చూశారని గుర్తుచేశారు. సమాఖ్య ముఖ్య సలహాదారు శ్రీ కోటా శంకరశర్మ మాట్లాడుతూ ఉమ్మడి ఏపీలో 28 మంది బ్రాహ్మణ ఎమ్మెల్యేలుంటే ప్రస్తుతం నవ్యాంధ్రలో కేవలం వైఎస్సార్సీపీ నుంచి కోన రఘపతి ఒక్కరే ఉన్నారని, తెలంగాణాలో ఇద్దరు ఉన్నారని గుర్తు చేశారు.