మిస్సింగ్ కథ సుఖాంతం!
►అదృశ్యమైన ఇంజినీరింగ్ విద్యార్థిని తిరిగొచ్చిన వైనం
►ముగ్గురు సీనియర్ల సస్పెన్షన్
►ర్యాగింగ్‌కు తెరపడేనా?
శ్రీకాకుళం క్రైం : సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్ కారణంగా తాను ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తున్నానంటూ డైరీలో పేర్కొని అదృశ్యమైన విద్యార్థిని తిరిగి తల్లి చెంతకు చేరింది. ఎచ్చెర్ల శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని తన సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్‌ను తట్టుకోలేక బుధవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోవడం, రాత్రి ఆమె తణుకులో ఉన్నట్టు సమాచారం అందిన విషయం పాఠకులకు విదితమే. గురువారం ఉదయం తణుకు నుంచి ఆ విద్యార్థిని వచ్చి తల్లి చెంతకు చేరింది. దీంతో మహిళా పోలీసు స్టేషన్లో ఆమెపై నమోదైన మిస్సింగ్ కథ సుఖాంతమయ్యింది.
తిరిగి వచ్చిన విద్యార్థిని మీడియాతో మాట్లాడుతూ సీనియర్ల ర్యాగింగ్ కారణంగానే తాను చనిపోవాలనుకున్నానని తెలిపింది. తణుకు వరకు వెళ్లిన తనను ఒకతను అనుమానంతో ఆపి కౌన్సిలింగ్ చేసి పంపారని చెప్పింది. దీనిపై డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు మాట్లాడుతూ మిస్సింగ్ కేసు ఛేదించి, కేసు తొలగించామని తెలిపారు. అమ్మాయిని సీనియర్లు ర్యాగింగ్ చేశారన్నదానిపై విచారణ చేపడుతున్నామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తమ కళాశాలలో ర్యాగింగ్ లేదని శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ గోవిందరాజులు మీడియాకు తెలిపారు. అయితే విద్యార్థినిని వేరే కారణాలతో వేధిస్తున్నట్టు కూడా ఇంత వరకు తమ దృష్టికి రాలేదని, ఇప్పుడు రావటంతో వెంటనే సీనియర్ విద్యార్థులైన పవన్, నగేష్, గణపతిలను కళాశాల నుంచి సస్పెండ్ చేశామని చెప్పారు.