srikanthachari
-
టికెట్ దక్కకుంటే ప్రాణ త్యాగం
హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రకటించిన తొలి జాబితాలో తనకు హుజూర్నగర్ టికెట్ దక్కకుండా జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి అడ్డుకున్నారని కాసోజు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఆరోపించారు. తనకు హుజూర్నగర్ టికెట్ దక్కకుంటే మంత్రిపై సూసైడ్ నోటు రాసుకుని ఎల్బీ నగర్ రింగ్‌రోడ్డులో ప్రాణ త్యాగానికి పాల్పడతానని స్పష్టం చేశారు. శుక్రవారం ఎల్బీ నగర్‌లోని శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేసి ఆమె నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ హుజూర్నగర్ టికెట్ తనకు కేటాయించేందుకు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు అనుకూలంగా ఉన్నారని, అయితే, మంత్రి జగదీశ్‌రెడ్డి వారి వద్ద అసత్యాలు చెప్పి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. బీసీ మహిళైన తాను హుజూర్‌నగర్‌లో పోటీ చేయడం మంత్రికి ఇష్టం లేదని, కార్యకర్తల బలం లేదని అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారన్నారు. ఉద్యమంలో తన కుమారుడు శ్రీకాంతాచారి అమరుడై ఉద్యమానికి జీవం పోశాడని, అమరుల కుటుంబాలపక్షాన హుజూర్నగర్ సీటును కేటాయించాలని కోరారు. మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రవర్తనతో తాను విసిగిపోయానని కంటతడి పెట్టారు. -
టికెట్ ఇవ్వకపోతే ప్రాణ త్యాగానికైనా సిద్ధం!
హుజూర్నగర్: హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి తనకు టికెట్ ఇవ్వకపోతే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ హెచ్చరించారు. ఆదివారం హుజూర్‌నగర్‌లోని ఆర్అండ్బీ అతిథి గృహంలో జరిగిన ఓటర్ జాబితా సవరణ సమావేశంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. 2014లో కేసీఆర్ తనకు పార్టీ టికెట్ ఇస్తే 47 వేల ఓట్లు పొందానన్నారు. నాటి నుంచి నియోజకవర్గంలోనే ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నానన్నారు. అమరుల కుటుంబాలకు కేసీఆర్ న్యాయం చేస్తారని భరోసా ఉన్నప్పటికీ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డి తనకు టికెట్ రాకుం డా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. హుజూర్నగర్ నియోజకవర్గ టికెట్ తప్ప రాష్ట్రంలో ఎక్కడ ఇచ్చినా తాను అంగీకరించబోనన్నారు. -
శ్రీకాంతాచారి త్యాగాన్ని అవమానిస్తున్నారు
సాక్షి, యాదాద్రి: తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఆగ్రహించారు. తన కుమారుడు శ్రీకాంతాచారి త్యాగాన్ని యాదాద్రి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు తక్కువ చేస్తున్నారని మండిపడ్డారు. ‘అమరవీరులను స్మరించకుండానే సమావేశాన్ని నిర్వహిస్తారా? సన్మానం కోసం నన్ను చివరగా పిల్చి అవమానిస్తారా?’ అంటూ స్టేజీపై నుంచి దిగిపోతుంటే ఎంపీ బూర నర్సయ్యగౌడ్, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ కొలుపుల అమరేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ పంతులు నాయక్ వెళ్లి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆమె తన ఆవేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరోసారి తప్పు జరగకుండా చూస్తామని చెప్పి ప్రభుత్వ విప్ గొంగిడి సునీత.. శాలువా, పూలదండతో ఆమెను సన్మానించారు. కాగా, శంకరమ్మ స్టేజీపైనే శాలువాను వదిలేసి ఆగ్రహంతో వెళ్లిపోయారు. తర్వాత అక్కడ ఉన్న విలేకరులతో ఆమె మాట్లాడుతూ ‘నల్ల గొండ జిల్లాకు ఏ మంత్రి వచ్చినా, ఏ సమావేశం నిర్వహించినా శ్రీకాంతాచారి పేరు జిల్లాలో ఎక్కడా ఎత్తడం లేదు. నా బిడ్డ త్యాగం మట్టిలో కలిసిందా.. 4 కోట్ల ప్రజలకు తన మాంసాన్ని నూనె చేసిండు.. నరాన్ని ఒత్తి చేసిండు.. ప్రజల్లో ఉద్యమం లేపింది శ్రీకాంతాచారి’అని పేర్కొన్నారు. తమకు లక్షలు, కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదని, అమరుల కుటుంబాలను గౌరవించినప్పుడే వారి ఆత్మకు శాంతి ఉంటుందని అన్నారు. ‘గతేడాది నేను భువనగిరికి రాను అన్న.. అయినా రమ్మన్నారు. వస్తే చివరగా పిలిచి సన్మానం చేశారు. ఈ సారి కూడా నేను రాను అనుకున్నా. కచ్చితంగా రావాలని పిలిస్తే వచ్చాను. అందర్నీ పిలిచిన తర్వాత ఆఖరున శ్రీకాంతాచారి తల్లి అని పిలిచారు. శ్రీకాంతాచారి నడిరోడ్డుపై పెట్రోల్ పోసుకొని అమ్మా.. నాన్నా అనకుండా జై తెలంగాణ నినాదాలు ఇచ్చాడు. ఇవాళ బిడ్డ చావుకు అర్థం లేకుండా పోతుంది. అమరవీరుడి తల్లిని ఇలా అవమాన పరుస్తారా’అని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ తన బిడ్డ వర్ధంతిని ఘనంగా నిర్వహించారని వివరించారు. అలాగే పొడిచేడులో మంత్రి హరీశ్‌రావు శ్రీకాంతాచారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారని,. శ్రీకాంతాచారి గౌరవం సీఎం కేసీఆర్‌కు, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులకు తెలుసని, కానీ కింది స్థాయిలో ఉన్న జిల్లా నాయకులకు తెలియడం లేదని అన్నారు. -
కేటీఆర్ నేను గుర్తులేకపోయినా..
సాక్షి, మహబూబ్‌నగర్ : తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం రేవంత్ రెడ్డి ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ‘రేవంత్ రెడ్డి ఎవరని కేటీఆర్ అడుగుతున్నారు. నేను గుర్తు లేకపోయినా కనీసం...శ్రీకాంతాచారి, కోదండరాంను గుర్తుంచుకో. ఇక డాక్టర్ కోర్స్‌ను మంత్రి లక్ష్మారెడ్డి ఎక్కడ చదివారో చెప్పాలి. ఇద్దరి సత్తాను జడ్చర్లలో తేల్చుకుందాం.’ అని సవాల్ విసిరారు. కాగా మంత్రి కేటీఆర్ నిన్న (గురువారం) ట్వీట్టర్లో నెటిజన్లతో సంభాషించారు. రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయాలు, వ్యక్తిగత అభిరుచులు, పవన్ కల్యాణ్, రేవత్ రెడ్డి.. ఇలా చాలా అంశాలపై నెటిజన్లు సంధించిన ప్రశ్నలకు ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ రేవంత్ రెడ్డి ప్రస్తావన తీసుకువచ్చాడు. రేవంత్ రెడ్డి గురించి రెండు మాటల్లో చెప్పండంటూ ట్విట్ చేయగా...హూ ఈజ్ దట్ అంటూ కేటీఆర్ రిప్లయ్ ఇచ్చిన విషయం తెలిసిందే. -
శ్రీకాంతాచారికి ఘన నివాళి
మోత్కూర్: తెలంగాణ ఉద్యమంలో అశువులుబాసిన శ్రీకాంతాచారికి నల్లగొండ జిల్లాలో గురువారం ఘనంగా నివాళ్పురించారు. శ్రీకాంతాచారి ఆరో వర్థంతి సందర్భంగా మోత్కూర్‌లో మంత్రి జగదీశ్వరరెడ్డి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీకాంతాచారి తల్లిదంద్రులు శంకరమ్మ, వెంకటాచారి మాట్లాడుతూ... తమ కుమారుని జయంతి, వర్థంతులను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కిషోర్‌తో స్థానిక నాయకులు పాల్గొన్నారు.