హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రకటించిన తొలి జాబితాలో తనకు హుజూర్‌నగర్ టికెట్ దక్కకుండా జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి అడ్డుకున్నారని కాసోజు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఆరోపించారు. తనకు హుజూర్‌నగర్ టికెట్ దక్కకుంటే మంత్రిపై సూసైడ్ నోటు రాసుకుని ఎల్బీ నగర్ రింగ్‌రోడ్డులో ప్రాణ త్యాగానికి పాల్పడతానని స్పష్టం చేశారు. శుక్రవారం ఎల్బీ నగర్‌లోని శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేసి ఆమె నివాళులర్పించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ హుజూర్‌నగర్ టికెట్ తనకు కేటాయించేందుకు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు అనుకూలంగా ఉన్నారని, అయితే, మంత్రి జగదీశ్‌రెడ్డి వారి వద్ద అసత్యాలు చెప్పి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. బీసీ మహిళైన తాను హుజూర్‌నగర్‌లో పోటీ చేయడం మంత్రికి ఇష్టం లేదని, కార్యకర్తల బలం లేదని అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారన్నారు. ఉద్యమంలో తన కుమారుడు శ్రీకాంతాచారి అమరుడై ఉద్యమానికి జీవం పోశాడని, అమరుల కుటుంబాలపక్షాన హుజూర్‌నగర్ సీటును కేటాయించాలని కోరారు. మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రవర్తనతో తాను విసిగిపోయానని కంటతడి పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment