సమావేశంలో మాట్లాడుతున్న జాజుల
మునుగోడు: త్వరలో జరగనున్న మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వకపోతే రానున్న 2023 ఎన్నికల ముందు బీసీల పార్టీ పెడతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా మునుగోడులో నిర్వహించిన బీసీల ఆత్మీయ అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
మునుగోడు నియోజకవర్గంలో 67 శాతం బీసీ ఓటర్లు, మరో 30 శాతం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలున్నారని, అందువల్ల బడుగు బలహీన వర్గాలకు టికెట్ కేటాయించాలని సీఎం కేసీఆర్‌తో పాటు రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌లకు లేఖలు రాశానని తెలిపారు. కానీ టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు బీసీలకు టికెట్ ఇస్తే గెలవరని చెబుతున్నారని, మంత్రి పదవులు చేసిన అభ్యర్థులను ఓడించిన చరిత్ర బీసీలకు ఉందని జాజుల గుర్తుచేశారు.
కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆంధ్రాకు చెందిన నెల్లూరు ఆడబిడ్డకు ఎలా ఇస్తారని, దీంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే పడవలా తయారైందని హెచ్చరించారు. రానున్న రోజుల్లో బీసీల పార్టీ పెట్టి తాను మునుగోడు నుంచి బరిలో నిలిచి తమ సత్తా చాటుతామని చెప్పారు. తన గొంతులో ప్రాణం ఉన్నంతవరకు బీసీల హక్కుల సాధన కోసం, ఆత్మగౌరం కోసం పోరాడుతానని జాజుల వెల్లడించారు. అందుకు ప్రతి ఒక్కరి సహాయ, సహకారాలు కావాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment