Srinivas gavireddy
-
సుశాంత్‌తో త్వరలో కొత్త చిత్రం
వర్ధమాన దర్శకుడు శ్రీనివాస్ గవిరెడ్డి మాకవరపాలెం: వైవిద్య కథాంశంతో కొత్త చిత్రం ప్రారంభించనున్నట్టు వర్ధమాన సినీ దర్శకుడు శ్రీనివాస్ గవిరెడ్డి తెలిపారు. దసరాకు స్వగ్రామం బయ్యవరం వచ్చిన ఆయన, నర్సీపట్నంలో ఓ కార్యక్రమానికి వచ్చిన హాస్యనటుడు రా కింగ్ రాకేష్‌తో కలిసి ‘సాక్షి’ విలేకరితో కాసేపు మాట్లాడారు. అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్ హీరోగా నటించే ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్టు తెలిపారు. డిసెంబర్లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభిస్తామని, కన్నడ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నామని, ఇందులో సీనియర్ న టుడు రాజేంద్రప్రసాద్ ఓ కీలక పాత్ర పోషిస్తారన్నారని శ్రీనివాస్ చెప్పారు.ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్తో కథ ఉంటుందని, వచ్చే ఏడాది మే లేదా జూన్ నెలలో చిత్రం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వివరించారు. తన మొదటి చిత్రం ‘సీతమ్మ అందాలు.. రామయ్య చిత్రాలు’ సినిమాను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారని గుర్తుచేశారు. హాస్యనటుడు రాజబాబు ఆదర్శంగా..: హాస్యనటుడు రాజబాబు ఆదర్శంగా కమెడియన్ అయ్యా నని రాకింగ్ రాకేష్ చెప్పారు. కమెడియన్‌గా, మిమిక్రీ ఆర్టిస్టుగా గుర్తింపురావడం ఆనందంగా ఉందన్నారు. నిత్యం బిజీగా ఉండే తాను ఇలా పల్లెటూరుకు రావడం కూడా సంతోషంగా ఉందన్నారు. బుల్లితెరపైనే కాకుండా సినిమాల్లో కూడా నటిస్తున్నానన్నారు. ప్రస్తుతం లక్ష్మీబాంబు, పెళ్లికిముందు ప్రేమకథ, శరభతోపాటు మరో రెండు సినిమాల్లో నటిస్తున్నానన్నారు. శరభ తెలుగు, తమిళంలో కూడా తానే కమెడియన్‌గా చేస్తున్నానని తెలిపారు. ఓ మంచి హాస్య నటుడిగా పేరుతెచ్చుకోవడమే లక్ష్యమన్నారు. -
సీతమ్మ ప్రేమ... రామయ్య క్రికెట్
చిత్రం: ‘సీతమ్మ అందాలు - రామయ్య సిత్రాలు’ తారాగణం: రాజ్‌తరుణ్, అర్తన, రాజా రవీంద్ర, సురేఖావాణి, శ్రీలక్ష్మి కెమేరా: విశ్వ డి.బి ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్ సంగీతం: గోపీ సుందర్ నిర్మాతలు: ఎస్. శైలేంద్రబాబు, కె.వి. శ్రీధర్‌రెడ్డి, హరీశ్ దుగ్గిశెట్టి రచన - దర్శకత్వం: శ్రీనివాస్ గవిరెడ్డి ప్రేమించిన అమ్మాయి కోసం ఆ అమ్మాయి కుటుంబాన్ని హీరో ఎదిరించడం, ఆ అమ్మా యిని పెళ్ళి చేసుకోవడం కోసం ఒక పందెంలో నిలవడం, అష్టకష్టాలూ పడి ఆఖరుకు గెలవడం - ఈ స్కీమ్ ఆఫ్ ఈవెంట్స్, సీన్లు సినిమాకు కొత్త కావు. ఆ పందెం ఏదో క్రికెట్, కబడ్డీ లాంటి ఆటల చుట్టూ తిరిగితే? అప్పుడెప్పుడో హిందీ ‘లగాన్’ వచ్చినప్పటి నుంచి ఆటల్నీ, ఇలా ప్రేమనీ ముడిపెట్టడం పెరిగింది. జగపతిబాబు ‘కబడ్డీ కబడ్డీ’ లాంటివన్నీ ఆ తాను ముక్కలు. ఆ ఛాయలతోనే ఇప్పుడు వరుస హిట్స్‌లో ఉన్న యువ హీరో రాజ్ తరుణ్‌తో వచ్చింది ‘సీతమ్మ అందాలు - రామయ్య సిత్రాలు’. అనగనగా ఒక ఊరు... రామచంద్రాపురం. ఆ ఊళ్ళో రామ్ (రాజ్ తరుణ్), ఊరి ప్రెసిడెంట్ (రాజా రవీంద్ర) వాళ్ళమ్మాయి సీతామాలక్ష్మి (నూతన పరిచయం అర్తన) చిన్నప్పటి ఫ్రెండ్స్. చిన్నప్పుడే సీత కోసం చదివే స్కూల్ మారిన రకం రామ్. పెద్దయ్యాక అది అతనిలో పిచ్చి ప్రేమగా మారుతుంది. చిన్నప్పుడే చదువు కోసం సిటీ వెళ్ళిపోయి, ఎం.బి.బి.ఎస్. చేస్తున్న సీత పెద్దయ్యాక ఊరికి వస్తుంది. ఇంటర్ కూడా పాస్ కాక, డింకీలు కొడుతూ, ఫ్రెండ్స్‌తో సిగరెట్టు, మందుతో కాలం గడిపే హీరో ఇక హీరోయిన్‌కు తన ఇష్టం వ్యక్తం చేసి, ఆమెను ప్రేమలో పడేసే పనిలో పడతాడు. అంతా ఓకే అవుతోందనుకున్న టైమ్‌లో ఎంతసేపూ ప్రేమని పండించుకొనే పనిలో పడతాడు. మామూలు సినిమాల్లో అయితే, అమ్మాయి సరేనంటుంది. కానీ, ఇక్కడ హీరోయిన్ ఛీ కొడుతుంది. ట్విస్ట్. ఇక సెకండాఫ్‌లోకి వచ్చేసరికి కాసింత కథా తెరపై చూపించాల్సి వచ్చేస్తుంది. దాంతో, సినిమా తప్పక వేగం పుంజుకుంటుంది. గుడిలో పల్లకీ మోసి, నిప్పులగుండంపై నడిచిన హీరోపై ఆటోమేటిగ్గా ప్రేమ పుడుతుంది. తీరా అదే టైవ్ుకి హీరోయిన్‌కి మరో అబ్బాయితో పెళ్ళి ఫిక్స్ చేస్తాడు తండ్రి. హీరోలు, క్రికెటర్ల దగ్గరే డబ్బంతా ఉంటుంది కాబట్టి, ఒక క్రికెటర్‌కి అమ్మాయినిచ్చి చేయాలనుకుంటాడు. ఇంకేం.. హీరో వెళ్ళి ఆ క్రికెటర్‌తో ఢీ అంటాడు. క్రికెట్లో తమపై గెలిచి, ప్రేమను గెలుచుకోమని అతను హీరోకి సవాలు విసురుతాడు. చిన్నప్పుడెప్పుడో తన వల్ల హీరోయిన్ ముఖానికి బంతి తగిలిం దని క్రికెట్‌నే వదిలేసిన హీరో- మళ్ళీ ఈ పందెం కోసం బ్యాట్ పడతాడు. ఊళ్ళోని మిత్ర బృందం తోడవుతుంది. అక్కడ నుంచి క్రికెట్ మైదానంలో జరిగే పందెం కథ ఏమిటో ఊహించుకోవచ్చు. రాజ్‌తరుణ్ ఎప్పటిలానే అలవాటైన నటన చూపారు. అతనిలోని నటుడికి ఛాలెంజింగ్ అనిపించే సీన్ల కోసం స్క్రిప్ట్‌లో వెతకకూడదు. హీరోయిన్గా అర్తన తన నిజ జీవిత వయసుకు తగ్గట్లే చిన్న పిల్లలా ఉన్నారు. కొత్తమ్మాయి కాబట్టి, అతిగా అభినయం ఆశించడం తప్పు! హీరో మిత్ర బృందంలోని నటులు, ముఖ్యంగా అంజి పాత్రలో ‘షకలక’ శంకర్ కొన్నిచోట్ల నవ్విస్తారు. గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబిం బించే ఆ వినోదాత్మక దృశ్యాలు, మాటలు చూసేసినవే అయినా ప్రత్యేక ప్రేక్షక వర్గం ఉంటుంది. హీరో తల్లితండ్రులుగా దర్శకుడు ఎన్. శంకర్, సురేఖావాణి కనిపిస్తారు. గోపీ సుందర్ బాణీల్లో సెకండాఫ్ మాంటేజ్ పాటలు వినడానికీ, చూడడానికీ కూడా బాగున్నాయి. తొలి చిత్ర దర్శకుడైన శ్రీనివాస్ గవిరెడ్డి ప్రేక్షకులకు అలవాటైపోయిన కథనే ఎంచుకు న్నారు కాబట్టి, ఇక కథనం మీదే దృష్టి అంతా! దానికి తగ్గట్లు ఆయన వీలైనన్ని ఎక్కువ సీన్లు రాసుకున్నారు. కాకపోతే, సీన్ వెంట సీన్లోనూ అవే పాత్రలు, పాత్రధారులు. దాంతో ఫస్టాఫ్‌లో కథ అంగుళాల చొప్పున ముందుకు నడుస్తుంది. వినోదం మీద దృష్టి పెట్టారు. ఉన్న కాసింత కథలో కీలక ఘట్టం అంతా సెకండాఫ్‌లోనే! అక్కడా ఆఖరి పావుగంట క్రికెట్మ్యాచ్, రన్నింగ్ కామెంటరీ. హాలులోకి బదులు స్టేడియమ్లోకి వచ్చామేమోనని అనుమానం వస్తుంది. రెండు గంటల మీద కాసేపు నిడివే కాబట్టి, సినిమాలో పాత్రల ప్రవర్తనలో, సన్నివేశాల్లో కార్యకారణ సంబంధం ఆలోచించే వేళ కల్లా సినిమానే అయి పోతుంది. వెరసి, క్రికెట్ గెలిపించిన మరో వెండి తెర ప్రేమకథగా ఈ సినిమా లెక్కల్లో మిగిలిపోతుంది. - రెంటాల జయదేవ -
బన్నీతో పరిచయం అవకాశం తెచ్చింది
- యువ కథా రచయిత, దర్శకుడు శ్రీనివాస్ విశాఖ జిల్లా కుర్రాడు వెండితెరపై మెరుపు మెరిపించనున్నాడు. నర్శీపట్నం దగ్గర బయ్యవరానికి చెందిన శ్రీనివాస్ గవిరెడ్డి ఓ వైపు రచయితగా, మరో వైపు దర్శకునిగా తనని తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. బన్నీతో పరిచయం తనకు అవకాశాలు తెచ్చిపెట్టిందని అతను అంటున్నాడు. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న శ్రీనివాస్ సిటీప్లస్‌తో తన సినిమా అనుభవాలను పంచుకున్నాడు. నేను ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లవుతోంది విద్యార్థిగా ఉన్నప్పుడే సినిమాల మీద విపరీతమైన పిచ్చి. కాలేజీ కంటే సినిమా థియేటర్స్‌లో స్పెండ్ చేసిన రోజులే ఎక్కువ. ఆ పిచ్చితోనే హైదరాబాద్‌లో ఏదో సాధించాలని ఇంట్లో తల్లిదండ్రులు వద్దన్నా వినకుండా ప్రయాణం అయ్యాను. అక్కడికి వెళ్లిన తర్వాత అందరిలాగే నా సినిమా కష్టాలు మొదలయ్యాయి. ఏదో సాధించాలని సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత సాధించకుంటే ఏదోలా ఉంటుంది. అందుకే కష్టమైన ప్రయత్నాలు చేస్తూ డైరక్టర్ మదన్ దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేశాను. ప్రోత్సహిస్తున్న అల్లు అర్జున్ హీరో అల్లు అర్జున్‌తో పరిచయం ప్రస్తుతం అవకాశం రావడానికి కారణమయిందని మాత్రం కచ్చితంగా చెప్పగలను. అతను అందించిన ప్రోత్సాహం నాకు చాలా ఉపయోగపడింది. ప్రతి అడుగులో ప్రోత్సహిస్తూ, ఎలాంటి కథలు సిద్ధం చేయాలో సూచనలు అందించడంతోపాటు పరిచయాలు కూడా పెరగడానికి దోహదం అయ్యారు. ఒకేసారి రెండు పాత్రల్లో.. నాకు తెలిసి ఇండస్ట్రీలో చాలా తక్కువమందికి ఇలాంటి అవకాశం వస్తుందేమో.. ఒక సినిమాతో రచయితగా, మరో సినిమాతో దర్శకుడిగా నన్ను నేను నిరూపించుకోవడానికి ఈ ఏడాది సిద్ధమవుతున్నా. అందులో ఆది హీరోగా మదన్ దర్శకత్వంలో గరమ్ చిత్రం కథ, మాటలు అందించాను. రాజ్‌తరుణ్ (ఉయ్యాల..జంపాల ఫేమ్) హీరోగా నా దర్శకత్వంలో ఓ చిత్రం రెడీ అవుతుంది. ఇలా రెండు సినిమాలు ఒకే ఏడాదిలో రావడం అంటే నిజంగా నేను చాలా లక్కీగా ఫీలవుతున్నా. ఇందులో ఆదికి అందించిన కథ పూర్తి మాస్ ఎలిమెంట్స్‌తో ఉన్నదైతే. నేను దర్శకత్వం వహిస్తున్న చిత్రం పల్లెటూరి నేపథ్యంతో పూర్తి ఫ్యామిలీ చిత్రంగా రూపుదిద్దుకుంటుంది. థాంక్స్ టూ మై ఫ్రెండ్స్ నేను ఈ రోజు దర్శకుడిగా సినిమా స్టార్ట్ చేయగలిగానంటే అందులో బన్ని సహకారం ఉంటే మా ఫ్రెండ్స్ సపోర్ట్ ఉందని చెప్పాలి. ఇన్ని సంవత్సరాలుగా కృష్ణానగర్‌లో ఉంటూ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వేళ నా ఫ్రెండ్స్ ఆర్థికంగా, మానసికంగా నాకు అందించిన ప్రోత్సాహం మాత్రం చాలా ఎక్కువ. అందుకే నా సినిమా రిలీజ్ అయిన వెంటనే నేను ఫస్ట్‌గా థాంక్స్ చెప్పుకోవాల్సింది. మా ఫ్రెండ్స్‌కే. వైజాగ్‌లో అన్నీ ఉన్నాయి భవిష్యత్తులో సినిమా అంటే ప్రతి ఒక్కరు వైజాగ్‌నే ఊహించుకోవచ్చు. ఎందుకంటే సినిమాను వేరొక చోటకు వెళ్లకుండా పూర్తి చేయడానికి కావాల్సిన అన్ని రకాల వనరులు, లొకేషన్స్ వైజాగ్‌లో ఉన్నాయి. మరేచోట ఇలాంటి పరిస్థితి కనిపించదు. వైజాగ్ అంటే అదో వండర్. కచ్చితంగా భవిష్యత్తులో వైజాగ్ ఓ మూవీ హబ్‌గా మరడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. -
ముచ్చటగా మూడో చిత్రం
‘ఉయ్యాల జంపాల’ ఫేం రాజ్ తరుణ్ మూడో చిత్రానికి రంగం సిద్ధమైంది. శ్రీనివాస్ గవిరెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ అధినేత శైలేంద్రబాబు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మార్చి మూడో వారంలో చిత్రీకరణ మొదలుపెడతామని నిర్మాత తెలిపారు. వైవిధ్యభరితమైన వినోదాత్మక చిత్రం ఇదని దర్శకుడు చెప్పారు.