
బన్నీతో పరిచయం అవకాశం తెచ్చింది
- యువ కథా రచయిత, దర్శకుడు శ్రీనివాస్
విశాఖ జిల్లా కుర్రాడు వెండితెరపై మెరుపు మెరిపించనున్నాడు. నర్శీపట్నం దగ్గర బయ్యవరానికి చెందిన శ్రీనివాస్ గవిరెడ్డి ఓ వైపు రచయితగా, మరో వైపు దర్శకునిగా తనని తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. బన్నీతో పరిచయం తనకు అవకాశాలు తెచ్చిపెట్టిందని అతను అంటున్నాడు. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న శ్రీనివాస్ సిటీప్లస్‌తో తన సినిమా అనుభవాలను పంచుకున్నాడు.
నేను ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లవుతోంది విద్యార్థిగా ఉన్నప్పుడే సినిమాల మీద విపరీతమైన పిచ్చి. కాలేజీ కంటే సినిమా థియేటర్స్‌లో స్పెండ్ చేసిన రోజులే ఎక్కువ. ఆ పిచ్చితోనే హైదరాబాద్‌లో ఏదో సాధించాలని ఇంట్లో తల్లిదండ్రులు వద్దన్నా వినకుండా ప్రయాణం అయ్యాను. అక్కడికి వెళ్లిన తర్వాత అందరిలాగే నా సినిమా కష్టాలు మొదలయ్యాయి. ఏదో సాధించాలని సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత సాధించకుంటే ఏదోలా ఉంటుంది. అందుకే కష్టమైన ప్రయత్నాలు చేస్తూ డైరక్టర్ మదన్ దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేశాను.
ప్రోత్సహిస్తున్న అల్లు అర్జున్
హీరో అల్లు అర్జున్‌తో పరిచయం ప్రస్తుతం అవకాశం రావడానికి కారణమయిందని మాత్రం కచ్చితంగా చెప్పగలను. అతను అందించిన ప్రోత్సాహం నాకు చాలా ఉపయోగపడింది. ప్రతి అడుగులో ప్రోత్సహిస్తూ, ఎలాంటి కథలు సిద్ధం చేయాలో సూచనలు అందించడంతోపాటు పరిచయాలు కూడా పెరగడానికి దోహదం అయ్యారు.
ఒకేసారి రెండు పాత్రల్లో..
నాకు తెలిసి ఇండస్ట్రీలో చాలా తక్కువమందికి ఇలాంటి అవకాశం వస్తుందేమో.. ఒక సినిమాతో రచయితగా, మరో సినిమాతో దర్శకుడిగా నన్ను నేను నిరూపించుకోవడానికి ఈ ఏడాది సిద్ధమవుతున్నా. అందులో ఆది హీరోగా మదన్ దర్శకత్వంలో గరమ్ చిత్రం కథ, మాటలు అందించాను. రాజ్‌తరుణ్ (ఉయ్యాల..జంపాల ఫేమ్) హీరోగా నా దర్శకత్వంలో ఓ చిత్రం రెడీ అవుతుంది.
ఇలా రెండు సినిమాలు ఒకే ఏడాదిలో రావడం అంటే నిజంగా నేను చాలా లక్కీగా ఫీలవుతున్నా. ఇందులో ఆదికి అందించిన కథ పూర్తి మాస్ ఎలిమెంట్స్‌తో ఉన్నదైతే. నేను దర్శకత్వం వహిస్తున్న చిత్రం పల్లెటూరి నేపథ్యంతో పూర్తి ఫ్యామిలీ చిత్రంగా రూపుదిద్దుకుంటుంది.
థాంక్స్ టూ మై ఫ్రెండ్స్
నేను ఈ రోజు దర్శకుడిగా సినిమా స్టార్ట్ చేయగలిగానంటే అందులో బన్ని సహకారం ఉంటే మా ఫ్రెండ్స్ సపోర్ట్ ఉందని చెప్పాలి. ఇన్ని సంవత్సరాలుగా కృష్ణానగర్‌లో ఉంటూ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వేళ నా ఫ్రెండ్స్ ఆర్థికంగా, మానసికంగా నాకు అందించిన ప్రోత్సాహం మాత్రం చాలా ఎక్కువ. అందుకే నా సినిమా రిలీజ్ అయిన వెంటనే నేను ఫస్ట్‌గా థాంక్స్ చెప్పుకోవాల్సింది. మా ఫ్రెండ్స్‌కే.
వైజాగ్‌లో అన్నీ ఉన్నాయి
భవిష్యత్తులో సినిమా అంటే ప్రతి ఒక్కరు వైజాగ్‌నే ఊహించుకోవచ్చు. ఎందుకంటే సినిమాను వేరొక చోటకు వెళ్లకుండా పూర్తి చేయడానికి కావాల్సిన అన్ని రకాల వనరులు, లొకేషన్స్ వైజాగ్‌లో ఉన్నాయి. మరేచోట ఇలాంటి పరిస్థితి కనిపించదు. వైజాగ్ అంటే అదో వండర్. కచ్చితంగా భవిష్యత్తులో వైజాగ్ ఓ మూవీ హబ్‌గా మరడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.