
విమర్శలు ఎక్కుపెట్టినవారితోనే శభాష్ అనిపించుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun). గంగోత్రి నుంచి పుష్ప 2 వరకు.. అతడి ప్రయాణం చూసిన ఎవరైనా ఔరా అనాల్సిందే! ఈసారి పాన్ ఇండియాను కాకుండా పాన్ వరల్డ్ బాక్సాఫీస్‌కే ఎక్కుపెట్టాడు బన్నీ. అట్లీతో సినిమా.. దీనికి హాలీవుడ్ టెక్నీషియన్స్ వీఎఫ్‌ఎక్స్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
గడిచిన ఏడాది కష్టంగా..
సాదాసీదా హీరో నుంచి ఐకాన్ స్టార్ వరకు సాగిన ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు బన్నీ. అయితే ఆయన సంతోషాన్నే కాకుండా కష్టాన్ని కూడా ఇష్టంగా పంచుకుంది భార్య అల్లు స్నేహా రెడ్డి (Allu Sneha Reddy). గడిచిన ఏడాది బన్నీ పుష్ప 2 హిట్‌తో భారీ విజయం అందుకున్నాడు. కానీ అతడు సంధ్య థియేటర్‌లో పుష్ప 2 ప్రీమియర్‌కు వెళ్లినప్పుడు అక్కడ తొక్కిసలాట జరిగి ఓ అభిమాని మృతి చెందడం.. ఆ కేసు తన మెడకు చుట్టుకోవడంతో ఆ సంతోషమే లేకుండా పోయింది. ఈ కేసులో అల్లు అర్జున్ అరెస్టయి ఒక రాత్రి జైలులో గడపడం అతడి జీవితంలోనే మాయని మచ్చగా మిగిలిపోయింది.

43వ బర్త్‌డే
అతడు జైలు నుంచి తిరిగి ఇంటికి చేరుకోగానే స్నేహ చంటిపిల్లలా అతడిని హత్తుకుంది. ఆ సమయంలో కుటుంబాన్ని తనే జాగ్రత్తగా చూసుకుంది. తాజాగా ఆమె అల్లు అర్జున్‌కు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. నా జీవితంలో ప్రేమను పంచిన నీకు 43వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఏడాదంతా నువ్వు సంతోషంగా, ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ జీవితంలో నీతో కలిసి నడుస్తున్నందుకు నాకెంతో గర్వంగా ఉంది. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అంటూ ఓ వీడియో షేర్ చేసింది. అందులో ఫ్యామిలీ సంతోషంగా ఉన్న వీడియో క్లిప్పింగ్స్‌ను పొందుపరిచింది. అలాగే బన్నీతో కలిసి దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి. ఇది చూసిన అభిమానులు బన్నీకి మీరే బలం అని కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: పాపకు, నాకు డీఎన్‌ఏ టెస్టు చేయాలన్నారు: కీర్తి భావోద్వేగం