
హీరో అల్లు అర్జున్ , దర్శకుడు అట్లీ కాంబోలో కొత్త సినిమా ప్రకటన వచ్చింది. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించనుంది. కాగా మంగళవారం (ఏప్రిల్ 8) అల్లు అర్జున్ బర్త్ డే. ఈ సందర్భంగా ఓ వీడియోతో ఈ మూవీని ప్రకటించారు. అల్లు అర్జున్ కెరీర్‌లో ఇది 22వ సినిమా కాగా, అట్లీ కెరీర్‌లో 6వ చిత్రం. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా చిత్రీకరణనుప్రారంభించనున్నామని, నటీనటులు– సాంకేతిక నిపుణులు, విడుదల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని మేకర్స్ వెల్లడించారు. ‘‘మ్యాజిక్ విత్ మాస్. ఊహలకు అందని ప్రపంచం.
సన్ పిక్చర్స్ సపోర్ట్‌తో అట్లీగారితో సినిమా చేయనుండటం నిజంగా అద్భుతం’’ అని ‘ఎక్స్’లో పేర్కొన్నారు అల్లు అర్జున్ . ‘‘అల్లుఅర్జున్ సార్‌కి జన్మదిన శుభాకాంక్షలు. నా కలను నిజం చేస్తున్న కళానిధిమారన్ సార్‌కి, సన్ పిక్చర్స్‌కు థ్యాంక్స్’’ అని అట్లీ పేర్కొన్నారు. మరోవైపు అల్లు అర్జున్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ మైథలాజికల్ ఫిల్మ్ రానుంది. అల్లు రామలింగయ్య, మమత సమర్పణలో హారిక అండ్ హాసినీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకాలపై ఎస్. రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ మూవీ చిత్రీకరణను త్వరలోనేప్రారంభించనున్నట్లు పేర్కొని, అల్లు అర్జున్ కు బర్త్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.