SRSC
-
ఎస్సారెస్పీకి అరుదైన గుర్తింపు
సాక్షి,నిజామాబాద్: కనువిందు చేసే కృష్ణజింకలు, ఫ్లెమింగో, ఫెలికాన్ వంటి విదేశీ పక్షుల కిలకిలలతో శ్రీరాంసాగర్ బ్యాక్‌వాటర్ ప్రాంతం ఇకపై వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా మారనుంది. స్థానిక ప్రజల భాగస్వామ్యంతో ఈ ప్రాంతాన్ని ‘కమ్యూనిటీ రిజర్వు’గా ఏర్పాటు చేయాలని అటవీశాఖ నిర్ణయించింది. ఈ మేరకు అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు (పీసీసీఎఫ్) కార్యాలయం నుంచి అందిన ఆదేశాల మేరకు జిల్లా అటవీశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ప్రతిపాదిత ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని పీసీసీఎఫ్ శోభ శుక్రవారం పరిశీలించారు. కృష్ణజింకల గంతులు నిజామాబాద్, నిర్మల్ జిల్లాల సరిహద్దుల్లో శ్రీరాంసాగర్ జలాశయం బ్యాక్‌వాటర్ ప్రాంతం సుమారు నాలుగు వేల ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గినప్పుడు ఈ ప్రాంతమంతా పచ్చిక బయళ్లుగా మారుతుంది. కనుచూపు మేర పచ్చదనం పరుచుకుంటోంది. ఆహారం కోసం గుంపులు గుంపులుగా సంచరించే కృష్ణజింకలు కనువిందు చేస్తుంటాయి. ప్రతిరోజు సూర్యోదయం అవుతుంటే చాలు సమీపంలోని గుట్టల చాటు నుంచి బయటకు వస్తున్నాయి. రాజస్తాన్, కర్నూల్ జిల్లాలో ఉన్న వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాల్లో మాత్రమే కనిపించే ఈ జింకలు ఇక్కడ సుమారు 30 వేల వరకు ఉంటాయని అటవీశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ప్రజల భాగస్వామ్యంతో.. నూతనంగా ఏర్పాటు చేయనున్న కమ్యూనిటీ రిజర్వును ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించనున్నారు. నందిపేట్ మండలం జీజీ నడుకుడ గ్రామంతో పాటు సమీప గ్రామాల ప్రజలతో ప్రత్యేకంగా ఓ కమిటీని నియమిస్తారు. సంరక్షణ కేంద్రం నిర్వహణ బాధ్యతలను కమిటీకి అప్పగిస్తారు. అలాగే.. పర్యాటకుల సౌకర్యం కోసం వ్యూ పాయింట్ వంటివి ఏర్పాటు చేస్తారు. కమ్యూనిటీ రిజర్వు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని జిల్లా అటవీశాఖ అధికారి సునీల్ హీరేమత్ ‘సాక్షి’కి తెలిపారు. -
ఎస్సారెస్పీ కాల్వలకు మరో 750 కోట్లు
♦ నీటి పారుదల అధికారులతో సమీక్షలో మంత్రి హరీశ్‌రావు ♦ చిట్టచివరి ఆయకట్టు వరకు నీరందేలా చర్యలు సాక్షి, హైదరాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) కాల్వల ఆధునీకరణ పనులకు మరో రూ.750 కోట్లు మంజూరు చేయనున్నట్టు నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. దీనిపై రెండు రోజుల్లో సమగ్ర అంచనాలతో ప్రతిపాదనలు పంపాలని ప్రాజె క్టు అధికారులను ఆదేశించారు. గురువారం ఎస్సారెస్పీ ప్రాజెక్టు అంశంపై మంత్రి సమీక్షించారు. ఈఎన్సీలు మురళీధర్, విజయప్రకాష్, సీఈ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సారెస్పీ ప్రధాన కాలువ పూడుకుపోవడంతో ఇంత కాలం భూపాలపల్లి, మహబూబా బాద్, డోర్నకల్ అసెంబ్లీ నియోజక వర్గాలు సాగునీటిని చూడలేదని.. వాటికి సాగునీరందించడానికి కాలువల ఆధునీకరణ పనులు చేపట్టాలని ఆదేశించారు. ప్రధాన కాలువను 8,000 క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించినా.. ఎన్నడూ 6 వేల క్యూసెక్కులకు మించి పారలేదన్నారు. ఈ నేపథ్యంలో ఆ కాలువను ఆధునీకరించి పూర్తి సామర్థ్యంతో నీరు పారేలా చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. పూర్తి ఆయకట్టుకు నీరివ్వాల్సిందే.. ఎస్సారెస్పీ పరిధిలోని మొత్తం 9.68 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలన్న సీఎం ఆదేశాలకు అనుగుణంగా పని చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద ఈ పనులు చేపట్టాలని.. రెవెన్యూ అధికారులతో సమన్వయంతో పనిచేసి పూర్తి ఆయకట్టు లక్ష్య సాధనకు ప్రయత్నించాలని సూచించారు. చివరి ఆయకట్టుకు సాగునీరు అందించడం అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని.. ఈ విషయంలో అలసత్వాన్ని ఉపేక్షించబోమని హెచ్చరించారు. యుద్ధప్రాతిపదికన పనులు లోయర్ మానేరు డ్యామ్ ఎగువ, దిగువ ప్రాంతాల్లో మరమ్మతులు, ఇతర ఆన్ గోయింగ్ పనులు పూర్తి చేసి ఆయా కాలువలను యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేయాలని హరీశ్‌రావు స్పష్టం చేశారు. తొలుత చివరి ఆయకట్టుకు, అనంతరం సమీపంలోని ఆయకట్టుకు సాగునీటి పంపిణీ చేయాలని సూచించారు. సాగునీటి శాఖ అధికారులకు రెవెన్యూ సిబ్బంది సహకరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను హరీశ్‌రావు ఆదేశించారు. ఈ డిసెంబర్ కల్లా మిడ్ మానేరు నుంచి లోయర్ మానేరు డ్యామ్‌కు నీరందిస్తున్నామని, వచ్చే ఏడాది కాళేశ్వరంతో ఎస్సారెస్పీని అనుసంధానం చేస్తామని తెలిపారు. డిసెంబర్ కల్లా ఉదయ సముద్రం నల్లగొండ జిల్లాలోని ఉదయ సముద్రం ప్రాజెక్టును డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని.. 50 వేల ఎకరాలకు నీరివ్వాలని, 60 చెరువులు నింపాలని హరీశ్‌రావు ఆదేశించారు. ఏఎంఆర్పీ లోలెవల్ కెనాల్ భూసేకరణ కోర్టు కేసులను త్వరగా పరిష్కరించుకోవాలన్నారు. ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల్లో 29 కిలోమీటర్ల పని పూర్తయిందని.. మిగతా 14.2 కిలోమీటర్ల పనులు వచ్చే ఏడాది డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని కోరారు. పెండ్లి పాకల రిజర్వాయర్ నిర్మాణంలో పెండింగ్‌లో ఉన్న 1994 ఎకరాల భూసేకరణకు వీలుగా సంబంధిత ఏజెన్సీ ప్రతినిధులు, సాగునీటి శాఖ ఇంజనీర్లతో ఒక సమావేశం నిర్వహించాలని నాగర్‌కర్నూల్ కలెక్టర్‌కు సూచించారు. -
పరి‘శ్రమిస్తే’.. నం.1
ప్రగతిపథాన జిల్లా పారిశ్రామికాభివృద్ధి 2019 నాటికి ఆర్ఎఫ్సీఎల్లో ఎరువుల ఉత్పత్తి 2020కి 1600 మెగావాట్ల విద్యుత్ ప్రతిపాదన దశలో 15మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ సింగరేణి ఆధ్వర్యంలో కోల్వాషరీస్ ప్లాంట్లు ఎల్లంపల్లితో పెరగనున్నవరిసాగు గోదావరిఖని/మంథని: సిరులు పంచే సింగరేణి.. దేశానికి వెలుగులు పంచే ఎన్టీపీసీ.. స్థానిక యువతకు ఉపాధి కల్పించే బసంత్‌నగర్ సిమెంట్.. బీడు భూములను సస్యశ్యామలం చేసే ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ.. ఇవీ పెద్దపల్లి జిల్లాకు ప్రధాన వనరులు. అలాంటి పెద్దపల్లికి జిల్లా హోదా దక్కడం మరో కొత్త అధ్యాయం.. పరిశ్రమల ఏర్పాటుకు అనువైన ప్రాంతం కావడం, రవాణా సౌకర్యం ఉండడంతో పారిశ్రామికాభివృద్ధి ప్రగతిపథాన ముందుకు దూసుకుపోనుంది. సింగరేణి గనులు, ఎన్టీపీసీ విస్తరణ, అనుబంధ పరిశ్రమల ఏర్పాటుతో కొత్త కళ రానుంది. ‘కాలం’ కలిసి వస్తే ఈ ప్రాంతం మరో కోనసీమగా మారనుంది. ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారిస్తే రాష్ట్రంలోనే పెద్దపల్లి జిల్లా అభివృద్ధిలో మొదటిస్థానంలో నిలవనుంది. 2019 నాటికి ఆర్ఎఫ్సీఎల్ ఎరువు.. రామగుండం ఎరువుల కర్మాగారంలో 1980 నుంచి 1999వరకు ‘అన్నపూర్ణ’ పేరుతో ఎరువుల ఉత్పత్తి చేసి ఉత్తర తెలంగాణ జిల్లాల రైతులకు కల్పతరువుగా మారింది. అనుకోని పరిస్థితుల్లో మూతపడగా...పునరుద్ధరణకు నోచుకుంటోంది. గ్యాస్ఆధారంగా నడవనున్న ఈ ప్లాంట్ 2019 నాటికి అందుబాటులోకి రానుంది. రోజుకు 6లక్షల టన్నుల యూరియాను ఉత్పత్తి చేయనుంది. స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నారుు. 2020 నాటికి తెలంగాణ స్టేజ్-1 విద్యుత్ రామగుండం ఎన్టీపీసీలో ప్రస్తుతం 2,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండగా... అందులో 36 శాతం విద్యుత్ అంటే 936 మెగావాట్లు తెలంగాణ(హోంస్టేట్)కు కేటాయించారు. తెలంగాణ పునర్విభజనలో భాగంగా కేటాయించిన విద్యుత్‌లో 2020 నాటికి తెలంగాణ స్టేజ్-1కింద ఉత్పత్తి చేయనున్న 1600 మెగావాట్ల విద్యుత్‌లో 85శాతం(1360 మెగావాట్లు) తెలంగాణ అవసరాలకు వినియోగిస్తారు. ఆ తర్వాత మరో 2,400 మెగావాట్ల ప్లాంట్‌లోనూ 85శాతం (2,040 మెగావాట్లు) విద్యుత్‌ను తెలంగాణకు కేటాయిస్తారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలోనే 10 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేయగా... రాబోయే రోజుల్లో రిజర్వాయర్ సమీపంలో మరో 15మెగావాట్ల సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటుచేసేలా ఎన్టీపీసీ యాజమాన్యం ప్రణాళికలు సిద్ధంచేసింది. సింగరేణి విద్యుత్...పరిశ్రమలకు చేయూత మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 1200 మెగావాట్ల ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి ఇటీవలే జరుగుతున్నది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్ పూర్తిగా తెలంగాణ ప్రభుత్వానికే కేటాయించారు. ఈక్రమంలో ఈ విద్యుత్‌ను వినియోగిస్తూ స్థానికంగా వివిధ రకాల పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు అవకాశముంది. ఇందుకు పెద్దపల్లి జిల్లా పరిధిలోని సుల్తానాబాద్, పెద్దపల్లి, మంథని ఏరియాలో భూములు అందుబాటులో ఉన్నాయి. కొత్త జిల్లా కావడంతో ప్రభుత్వం కూడా కొత్త పరిశ్రమల ఏర్పాటుకు చేయూతనిచ్చేందుకు ముందుకు రానున్నది. బొగ్గుశుద్ధి కర్మాగారాల ఏర్పాటు సింగరేణిలో ఉత్పత్తి చేస్తున్న బొగ్గును యాజమాన్యం సరఫరా చేస్తున్నా నాణ్యత లోపించడంతో వివిధ పరిశ్రమల నిర్వాహకులు ఆ బొగ్గును వాడేందుకు అనాసక్తిని చూపుతున్నారు. ఈ క్రమంలో ఆర్జీ-2 ఏరియాలోని యైటింక్లయిన్‌కాలనీ కోల్‌కారిడార్ తోపాటు ఆర్జీ-1 ఏరియా గోదావరిఖని జీడీకె 2, 2ఏ గని సమీపంలో బొగ్గుశుద్ధి కర్మాగారాలను ఏర్పాటు చేసేందుకు యాజమాన్యం ప్రణాళికలు రూపొందించింది. దీనిద్వారా సింగరేణి బొగ్గును అధికంగా వినియోగదారులు వినియోగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆయా పరిశ్రమల్లో వస్తుత్పత్తి జరగనుండగా... చాలా మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అనుబంధ పరిశ్రమలకు ఏర్పాటు సింగరేణి సంస్థ గతంలో స్థానిక నిరుద్యోగులకు వివిధ పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేలా అవకాశం కల్పించేందుకు అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేయాలనే ఆలోచనకు వచ్చింది. అరుుతే అప్పట్లో అనుకున్నంతగా యాజమాన్యం చొరవ చూపలేదు. ప్రస్తుతం కొత్త జిల్లాలో సింగరేణిలో బొగ్గుగనులు, ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులలో బొగ్గు ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగించే వస్తువులు, యంత్రాల విడిభాగాలను తయారు చేసేందుకు వీలుగా కోల్‌బెల్ట్ ప్రాంత నిరుద్యోగులను ప్రోత్సహించే అవకాశముంది. నట్లు, బోల్టులు, బెల్ట్‌లు, షూలు, టోపీలు, రాడ్లు, మందుగుండు సామగ్రిని భద్రపరిచే పెట్టెలు, ఇతరత్రా వస్తువులను తయారు చేయడం, సరఫరా చేయడం వంటి పనులు స్థానికులకే లభించనున్నాయి. రైస్‌మిల్లుల ఏర్పాటుకు అవకాశం... గతంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి వచ్చే నీరు డి-83 కాలువ ద్వారా రావడంతో దాని చుట్టుపక్కల గల గ్రామాలలో వరి పంట ఎక్కువ పండించేవారు. ఇలా పండిన వరిధాన్యాన్ని సుల్తానాబాద్‌లోని 115 రైస్‌మిల్లులకు పంపించేవారు. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి సాగునీరు గుండారం చెరువు ద్వారా మంథని ఏరియాతో పాటు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా సరఫరా అవుతుండగా... ఎక్కువ విస్తీర్ణంలో వరిపంట సాగయ్యే అవకాశముంది. దీంతో మిగతా ప్రాంతాలలో కూడా రైస్‌మిల్లుల ఏర్పాటుకు మార్గం సుగమం కానున్నది. దీనిద్వారా చాలా మందికి ఉపాధి లభించనుంది. -
ఎస్సారెస్పీ 26 గేట్ల ఎత్తివేత
ఎస్సారెస్పీ 26 గేట్ల ఎత్తివేత బాల్కొండ: నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్ట్ 26 వరద గేట్లను ఎత్తి గోదావరిలోకి లక్ష క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. గురువారం ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు తగ్గుముఖం పట్టడంతో 9 వరద గేట్ల ద్వారా 50 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. శుక్రవారం ఉదయం వరద నీరు పోటెత్తడంతో మళ్లీ గేట్లను పెంచి నీటి విడుదలను పెంచారు. ప్రాజెక్ట్ నుంచి వరద కాలువ ద్వారా 15 వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 4,500 క్యూసెక్కులు, లక్ష్మీ కాలువ ద్వారా 150 క్యూసెక్కుల నీటి విడుదల జరుగుతోంది. కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల కొనసాగుతుండటంతో ప్రాజెక్ట్ జల విద్యుదుత్పత్తి కేంద్రంలో 4 టర్బయిన్ల ద్వార 36 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతుందని జెన్కో అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1,091(90 టీఎంసీలు) అడుగులతో నిండుకుండలా ఉంది. నిజాంసాగర్ నుంచి 12 వేల క్యూసెక్కులు నిజాంసాగర్: నిజామాబాద్ జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టు నీటితో నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న 21 వేల క్యూసెక్కుల వరదనీటిని అంతే మొత్తంలో శుక్రవారం ప్రాజెక్టు 4, 5 వరదగేట్ల ద్వారా దిగువనకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులతో 17.8 టీంఎసీల నీరు పూర్తిస్థాయిలో నిల్వ ఉంది. అన్నదాత ఆత్మహత్య భిక్కనూరు: నిజామాబాద్ జిల్లా భిక్కనూరు మండలం కాచాపూర్‌కు చెందిన రైతు సంగెపు బీరయ్య(40) పంట దెబ్బతినడంతో మనస్తాపం చెంది గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. బీరయ్య తన ఎకరం 16 గుంటల్లో మక్కపంటను వేశాడు. గ్రామంలో గొర్రెల కాపరిగా పని చేస్తున్నాడు. ఇటీవల మక్కపంట చేతికి రావడంతో పంటలు కోసి జూడుగా పెట్టాడు. ఐదు రోజులు వరుసగా వర్షాలు కురియడంతో మక్కపంట తడిసి ముద్దయి మొలకెత్తి బూజు పట్టింది. ఇదివరకే రూ. 4 లక్షల అప్పు ఉంది. మక్క పంట దెబ్బతినడంతో మానసిక వేదనకు గురయ్యాడు. గురువారం రాత్రి కొట్టం వద్దకు వెళ్లి ఉరేసుకున్నాడు.