ఎస్సారెస్పీ 26 గేట్ల ఎత్తివేత
ఎస్సారెస్పీ 26 గేట్ల ఎత్తివేత
బాల్కొండ: నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్ట్ 26 వరద గేట్లను ఎత్తి గోదావరిలోకి లక్ష క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. గురువారం ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు తగ్గుముఖం పట్టడంతో 9 వరద గేట్ల ద్వారా 50 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు.
శుక్రవారం ఉదయం వరద నీరు పోటెత్తడంతో మళ్లీ గేట్లను పెంచి నీటి విడుదలను పెంచారు. ప్రాజెక్ట్ నుంచి వరద కాలువ ద్వారా 15 వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 4,500 క్యూసెక్కులు, లక్ష్మీ కాలువ ద్వారా 150 క్యూసెక్కుల నీటి విడుదల జరుగుతోంది. కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల కొనసాగుతుండటంతో ప్రాజెక్ట్ జల విద్యుదుత్పత్తి కేంద్రంలో 4 టర్బయిన్ల ద్వార 36 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతుందని జెన్‌కో అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1,091(90 టీఎంసీలు) అడుగులతో నిండుకుండలా ఉంది.
నిజాంసాగర్ నుంచి 12 వేల క్యూసెక్కులు
నిజాంసాగర్: నిజామాబాద్ జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టు నీటితో నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న 21 వేల క్యూసెక్కుల వరదనీటిని అంతే మొత్తంలో శుక్రవారం ప్రాజెక్టు 4, 5 వరదగేట్ల ద్వారా దిగువనకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులతో 17.8 టీంఎసీల నీరు పూర్తిస్థాయిలో నిల్వ ఉంది.
అన్నదాత ఆత్మహత్య
భిక్కనూరు: నిజామాబాద్ జిల్లా భిక్కనూరు మండలం కాచాపూర్‌కు చెందిన రైతు సంగెపు బీరయ్య(40) పంట దెబ్బతినడంతో మనస్తాపం చెంది గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. బీరయ్య తన ఎకరం 16 గుంటల్లో మక్కపంటను వేశాడు. గ్రామంలో గొర్రెల కాపరిగా పని చేస్తున్నాడు. ఇటీవల మక్కపంట చేతికి రావడంతో పంటలు కోసి జూడుగా పెట్టాడు. ఐదు రోజులు వరుసగా వర్షాలు కురియడంతో మక్కపంట తడిసి ముద్దయి మొలకెత్తి బూజు పట్టింది. ఇదివరకే రూ. 4 లక్షల అప్పు ఉంది. మక్క పంట దెబ్బతినడంతో మానసిక వేదనకు గురయ్యాడు. గురువారం రాత్రి కొట్టం వద్దకు వెళ్లి ఉరేసుకున్నాడు.