ఎస్సారెస్పీ కాల్వలకు మరో 750 కోట్లు
♦ నీటి పారుదల అధికారులతో సమీక్షలో మంత్రి హరీశ్‌రావు
♦ చిట్టచివరి ఆయకట్టు వరకు నీరందేలా చర్యలు
సాక్షి, హైదరాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) కాల్వల ఆధునీకరణ పనులకు మరో రూ.750 కోట్లు మంజూరు చేయనున్నట్టు నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. దీనిపై రెండు రోజుల్లో సమగ్ర అంచనాలతో ప్రతిపాదనలు పంపాలని ప్రాజె క్టు అధికారులను ఆదేశించారు. గురువారం ఎస్సారెస్పీ ప్రాజెక్టు అంశంపై మంత్రి సమీక్షించారు. ఈఎన్‌సీలు మురళీధర్, విజయప్రకాష్, సీఈ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సారెస్పీ ప్రధాన కాలువ పూడుకుపోవడంతో ఇంత కాలం భూపాలపల్లి, మహబూబా బాద్, డోర్నకల్ అసెంబ్లీ నియోజక వర్గాలు సాగునీటిని చూడలేదని.. వాటికి సాగునీరందించడానికి కాలువల ఆధునీకరణ పనులు చేపట్టాలని ఆదేశించారు. ప్రధాన కాలువను 8,000 క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించినా.. ఎన్నడూ 6 వేల క్యూసెక్కులకు మించి పారలేదన్నారు. ఈ నేపథ్యంలో ఆ కాలువను ఆధునీకరించి పూర్తి సామర్థ్యంతో నీరు పారేలా చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు.
పూర్తి ఆయకట్టుకు నీరివ్వాల్సిందే..
ఎస్సారెస్పీ పరిధిలోని మొత్తం 9.68 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలన్న సీఎం ఆదేశాలకు అనుగుణంగా పని చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద ఈ పనులు చేపట్టాలని.. రెవెన్యూ అధికారులతో సమన్వయంతో పనిచేసి పూర్తి ఆయకట్టు లక్ష్య సాధనకు ప్రయత్నించాలని సూచించారు. చివరి ఆయకట్టుకు సాగునీరు అందించడం అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని.. ఈ విషయంలో అలసత్వాన్ని ఉపేక్షించబోమని హెచ్చరించారు.
యుద్ధప్రాతిపదికన పనులు
లోయర్ మానేరు డ్యామ్ ఎగువ, దిగువ ప్రాంతాల్లో మరమ్మతులు, ఇతర ఆన్ గోయింగ్ పనులు పూర్తి చేసి ఆయా కాలువలను యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేయాలని హరీశ్‌రావు స్పష్టం చేశారు. తొలుత చివరి ఆయకట్టుకు, అనంతరం సమీపంలోని ఆయకట్టుకు సాగునీటి పంపిణీ చేయాలని సూచించారు. సాగునీటి శాఖ అధికారులకు రెవెన్యూ సిబ్బంది సహకరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను హరీశ్‌రావు ఆదేశించారు. ఈ డిసెంబర్ కల్లా మిడ్ మానేరు నుంచి లోయర్ మానేరు డ్యామ్‌కు నీరందిస్తున్నామని, వచ్చే ఏడాది కాళేశ్వరంతో ఎస్సారెస్పీని అనుసంధానం చేస్తామని తెలిపారు.
డిసెంబర్ కల్లా ఉదయ సముద్రం
నల్లగొండ జిల్లాలోని ఉదయ సముద్రం ప్రాజెక్టును డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని.. 50 వేల ఎకరాలకు నీరివ్వాలని, 60 చెరువులు నింపాలని హరీశ్‌రావు ఆదేశించారు. ఏఎంఆర్‌పీ లోలెవల్ కెనాల్ భూసేకరణ కోర్టు కేసులను త్వరగా పరిష్కరించుకోవాలన్నారు. ఇక ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనుల్లో 29 కిలోమీటర్ల పని పూర్తయిందని.. మిగతా 14.2 కిలోమీటర్ల పనులు వచ్చే ఏడాది డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని కోరారు. పెండ్లి పాకల రిజర్వాయర్ నిర్మాణంలో పెండింగ్‌లో ఉన్న 1994 ఎకరాల భూసేకరణకు వీలుగా సంబంధిత ఏజెన్సీ ప్రతినిధులు, సాగునీటి శాఖ ఇంజనీర్లతో ఒక సమావేశం నిర్వహించాలని నాగర్‌కర్నూల్ కలెక్టర్‌కు సూచించారు.