సైన్యం ఆధునికీకరణ సరే! నిధులెక్కడ? | Union Budget 2022: Central Allocates Tiny Budget Sanction To Army Modernisation | Sakshi
Sakshi News home page

సైన్యం ఆధునికీకరణ సరే! నిధులెక్కడ?

Published Thu, Feb 17 2022 12:48 AM | Last Updated on Thu, Feb 17 2022 1:06 AM

Union Budget 2022: Central Allocates Tiny Budget Sanction To Army Modernisation - Sakshi

ఈశాన్య, వాయువ్య సరిహద్దుల్లో అణ్వాయుధ ప్రత్యర్థులైన చైనా, పాకిస్తాన్‌లతో ఘర్షణ వాతావరణం ఏర్పడిన నేపథ్యంలోనూ తాజా కేంద్రబడ్జెట్‌లో రక్షణ రంగ కేటాయింపులు తగ్గిపోవడం గమనార్హం. రక్షణరంగానికి కనీసమాత్రంగానే కేటాయింపులు పెంచుతుండటం వల్ల సైనిక బలగాల ఆధునికీకరణపై ఆర్మీ ఆశలు చెదిరిపోయాయి. పైగా సైన్యం ఆధునికీకరణకు మూలధనం కేటాయింపులు ఏమాత్రం సరిపోవు. భారత సాయుధ బలగాలు భారీ స్థాయిలో నిధులు కావాలని చేసిన డిమాండుకూ, కేంద్ర ప్రభుత్వ తాజా బడ్జెట్‌లో రక్షణ రంగానికి సాపేక్షికంగా చేసిన తక్కువ కేటాయింపులకూ మధ్య ఎన్నడూ లేనంత అంతరం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. దీంతో భారత సైన్యం నిర్వహణా సామర్థ్యం తీవ్రంగా ప్రభావితం కానుంది.

భారత రక్షణ బడ్జెట్‌ మరోసారి చేదు వాస్తవాన్ని బయటపెట్టింది. భారత సాయుధ బలగాలు భారీ స్థాయిలో నిధులు కావాలని చేసిన డిమాండుకూ, కేంద్ర ప్రభుత్వ తాజా బడ్జెట్‌లో రక్షణ రంగానికి సాపేక్షికంగా చేసిన తక్కువ కేటాయింపులకూ మధ్య ఎన్నడూ లేనంత అంతరం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. గత వార్షిక బడ్జెట్లకు లాగే, 2022–23 వార్షిక బడ్జెట్‌లోనూ రక్షణ రంగానికి బడ్జెట్‌ కేటాయింపును అంచనా వేసిన దానికంటే కాస్త ఎక్కువగా పెంచారు. ఆర్థికమాంద్య పరిస్థితుల్లో ద్రవ్యపరమైన వాస్తవాలను అర్థం చేసుకుంటూనే, వన రుల కొరత భారాన్ని అధిగమించడానికి సాధారణంగా కేటాయించే బడ్జెట్‌ కంటే ఇదేమీ పెద్ద మొత్తం కాదనే చెప్పాల్సి ఉంటుంది.

మొత్తం రక్షణ బడ్జెట్‌కు ఈ ఏడాదికి గానూ 5.25 లక్షల కోట్ల మేరకు కేటాయించారు. ఇది గత సంవత్సరం కంటే ఎక్కువే. కానీ స్థూల దేశీయోత్పత్తి పరంగా చూస్తే ఇది తక్కువే. గత ఏడాదిలోని 2.15 శాతంతో పోలిస్తే ఈ ఏడాది కేటాయింపులు 2.04 శాతానికి పడిపోయాయి. కేంద్రప్రభుత్వ మొత్తం వ్యయంలో రక్షణ రంగ వాటా 13.73 శాతం నుంచి 13.31 శాతానికి దిగజారిపోయింది. ఈశాన్య, వాయవ్య సరిహద్దుల్లో అణ్వాయుధ ప్రత్యర్థులైన చైనా, పాకిస్తాన్‌ రెండు దేశాలతో ఘర్షణ వాతావరణం ఏర్పడిన నేపథ్యంలోనూ రక్షణ రంగ కేటాయింపులు తగ్గిపోవడం గమనార్హం.

2020లో 15వ ఫైనాన్స్‌ కమిషన్‌కి సమర్పించిన రక్షణ శాఖ సొంత అంచనాల ప్రకారం చూస్తే, 2023 ఆర్థిక సంవత్సరానికి రక్షణ బడ్జెట్‌ 2.81 లక్షల కోట్లకు పెరగాల్సి ఉంది. ఈ మొత్తంలో సగం లేదా 1.62 లక్షల కోట్లను మూల ధనంపై వెచ్చించాలి. దీన్ని సైనికబలగాల ఆధునికీకరణకు, సైనిక చర్యల సామర్థ్య పెంపుదల కోసం వెచ్చిం చాల్సి ఉంది. రక్షణ రంగ బడ్జెట్‌ ప్రధాన సవాళ్లలో ఒకటి సైనిక బల గాల వేతనాల బిల్లు పెరుగుతూనే ఉండటం. దీంతో నిర్వహణాత్మక ఖర్చులకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయలేకపోతున్నారు. సైనిక బలగాల వేతనాల బిల్లు 2001 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రెవెన్యూ బడ్జెట్‌లో 36.81 శాతం మేరకు ఉండగా, 2023 బడ్జెట్‌ నాటికి ఇది 66.94 శాతానికి లేదా రూ. 1,49,403 కోట్లకు పెరిగింది. అంటే దాదాపు రెట్టింపయింది. త్రివిధ దళాల్లోనే ఎక్కువ సంఖ్యలో ఉంటున్న ఆర్మీకి చెందిన వేతనాల బిల్లు కూడా బాగా పెరిగింది. 2001 ఆర్థిక సంవత్సరంలో ఆర్మీ వేతనాలు మొత్తం రక్షణరంగ రెవెన్యూ బడ్జెట్‌లో 40.36 శాతం మేరకు ఉండగా, రెండు దశాబ్దాల తర్వాత అది 70.78 శాతానికి అంటే రూ.1,16,707 కోట్లకు పెరిగింది.

తద్భిన్నంగా, సైనిక బలగాల వేతనాల పెంపు ఇలా పెరిగి నప్పటికీ, సైనికుల స్టోర్‌ బడ్జెట్‌... అంటే రేషన్లు, దుస్తులు, రక్షణ పరికరాల స్పేర్‌ పార్టులు, మందుగుండు సామగ్రి, భారతీయ సైన్యం సమర్థతను బలపర్చే ఇతర చిల్లర ఖర్చులపై వ్యయం బాగా పడిపోయింది. ఈ 20 ఏళ్లలో త్రివిధ బలగాలకు అయ్యే ఈ వ్యయం 43.65 శాతం నుంచి 16.18 శాతానికి పడిపోయింది. దీంతోపాటు భవనాలు, ఇతర కట్టడాల నిర్మాణానికి కీలకమైన మౌలిక వసతుల కోసం కేటాయించే బడ్జెట్‌ బాగా తగ్గిపోయింది. ఈ రెండింటిపై వెచ్చించే ఖర్చు కూడా దాదాపు సగానికి పడిపోయింది. అంకెల్లో చెప్పాలంటే, 2001 నాటికి ఇది 9.62 శాతం ఉండగా, 2023 నాటికి 5.7 శాతానికి పడిపోయింది. అంటే కేవలం రూ.12,728 కోట్లకు ఈ వ్యయం పడిపోయింది.

ఫైనాన్స్‌ కమిషన్, రక్షణ మంత్రిత్వ శాఖకు సమర్పించిన నివేదికను బట్టి ఈ లోటు తీవ్రత స్థాయిని అంచనా వేయవచ్చు. 2021 నుంచి 2026 సంవత్సరాలకు గానూ సైనిక బలగాల రెవెన్యూ వ్యయం 6.97 లక్షల కోట్ల వరకు తగ్గనుందని తెలుస్తోంది. దీంతో భారత సైన్యం నిర్వహణా సామర్థ్యం తీవ్రంగా ప్రభావితం కానుంది. 2020 మేలో తూర్పు లద్దాఖ్‌లో చైనా ప్రజావిముక్తి సైన్యంతో మొదలైన ఘర్షణ ఇంకా ప్రతిష్టంభనలోనే ఉన్న సమయంలో భారత సైనిక బలగాల అప్రమత్తత ద్విగుణీకృతం కావలసి ఉంది. ఈ సమయంలో సైన్యం నిర్వహణాత్మక వ్యయానికి కావలసిన వనరు లను ఇంకా పెంచాలి. కానీ ఈ అయిదేళ్ల కాలానికి గాను ఈ వ్యయం తగ్గుముఖం పట్టనుండటం గమనార్హం. బలగాలు, వేతనాలకు సంబంధించిన అంశాలకు ఇప్పుడు ఆర్థికంగా మరింత ప్రాధాన్యం ఉంది.

ఇవి పెన్షన్‌ చెల్లింపుతో అంతర్గత సంబంధం కలిగి ఉంటాయి. సైనిక బలగాల వేతనాలు, పింఛన్లకు అయ్యే ఖర్చు 2001 సంవత్స రంలో రూ. 12 వేల కోట్లు కాగా, 2023 ఆర్థిక సంవత్సరానికి ఇది అమాంతంగా రూ. 1.19 లక్షల కోట్లకు చేరుకుంది. అలాగే ద్రవ్యపరమైన చిక్కులు సైనికబలగాల వ్యయాన్ని అడ్డు కుంటున్నాయి. గత 20 ఏళ్లలో సైనిక బలగాల వ్యయం రూ.17,926 కోట్లనుంచి 8.5 రెట్లు పెరిగి రూ.1.52 లక్షల కోట్లకు చేరింది. కేపిటల్‌ బడ్జెట్‌ 85 నుంచి 90 శాతంకి అమాంతంగా పెరిగినప్పటికీ దాంట్లో ఎక్కువ భాగం ముందే కట్టుబడిన చెల్లింపులకు, ముందస్తుగా కొనుగోలు చేసిన రక్షణ సామగ్రికి సరిపోతుండటంతో కొత్త పరికరాల కొనుగోలుకు తక్కువ నిధులు మాత్రమే లభ్యమవుతుండటం గమ నార్హం. భారత ఆర్మీ మాజీ వైస్‌ చీఫ్‌ లెప్టినెంట్‌ జనరల్‌ శరత్‌ చంద్, 2018లో రక్షణరంగంపై పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీతో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. రక్షణరంగానికి కనీసమాత్రంగానే కేటాయింపులు పెంచుతుండటం వల్ల సైనిక బలగాల ఆధునికీకరణపై ఆర్మీ ఆశలు చెదిరిపోయాయని పేర్కొన్నారు.

నిశితంగా పరిశీలిస్తే, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తాజా బడ్జెట్‌ ప్రసంగంలో ఇలాంటి ప్రాథమిక సమస్యలను కనీసం ప్రస్తావించలేదు. తాజా బడ్జెట్‌లో ప్రజాకర్షక నిర్ణయాలే పతాక శీర్షికలకు ఎక్కాయి తప్పితే ఇలాంటి కీలక అంశాలు చర్చకు రాలేదు. ఆర్థకమంత్రి రెండు ప్రకటనలు చేశారు. తాజా రక్షణ రంగ బడ్జెట్‌లో 68 శాతం దేశీయ రక్షణ పరికరాల సేకరణకు రిజర్వ్‌ చేస్తున్నా మన్నారు. ఇది 2021లో 58 శాతం మాత్రమే. ఇకపోతే రీసెర్చ్, డెవలప్‌మెంట్‌ బడ్జెట్‌లో 25 శాతాన్ని (డీఆర్డీఓకి కేటాయించిన మూలధన బడ్డెట్‌ రూ. 11,981 కోట్లలో ఇది కొంత భాగం) ఇప్పుడు సైనిక పరికరాల రూపకల్పనలో పాలు పంచుకునే స్థానిక పరిశ్రమ కోసం, స్టార్టప్‌ల కోసం అట్టిపెట్టారు. ఈ రెండు నిర్ణయాలూ భారత రక్షణ పరిశ్రమకు, దేశీయంగా రక్షణ ఉత్పత్తుల తయారీకి మంచివార్తే కానీ రక్షణ రంగ ఆధునికీకరణకు నిధుల కొరత అనే మొత్తం సమస్యను ఇవి పరిష్కరించలేవు.

అయితే బడ్జెట్‌లో ఆర్థిక పదజాలాల డాంబికాన్ని అలా పక్కన పెడితే, బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌కి గత బడ్జెట్‌లో రూ. 2,500 కోట్లు కేటాయించగా, ఈ సంవత్సరం బడ్జెట్‌లో రూ. 3,500 కోట్లకు పెంచారు. అలాగే ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌కి రూ. 2,650 కోట్ల నుంచి, రూ. 4,246.37 కోట్లకు పెంచారు. అయితే ఈ పెంపుదల ఎంతో ముందే చేయాల్సి ఉంది. దేశ సరిహద్దు, తీరప్రాంత మౌలిక సదు పాయాల కల్పనను ఇది వేగవంతం చేస్తుంది. గత బడ్జెట్లలో వీటిని ఫుట్‌నోట్లలో మాత్రమే ప్రస్తావించిన విషయం గుర్తించాలి.

చివరగా, 2023 సంవత్సరం రక్షణ బడ్జెట్‌ కాస్త ఎక్కువ తక్కువగా గత బడ్జెట్లకు అనుగుణంగానే ఉంటోంది. కానీ రక్షణ రంగ మూలధన, రెవెన్యూ వ్యయం కొరతకు సంబంధించిన ప్రాథమిక సమస్యల పరిష్కారంలో తాజా బడ్జెట్‌ కూడా మరోసారి విఫలమైంది. ఈ బడ్జెట్‌లో కూడా సమగ్రమైన, రక్షణ రంగ ఫైనాన్షియల్‌ ప్రణాళికకు అవసరమైన రోడ్‌ మ్యాప్‌ లోపించిందని పలువురు సైనిక విశ్లేషకులు, రిటైరైన, సర్వీసులో ఉన్న సైనికాధికారులు పేర్కొన్నారు. ప్రత్యేకించి డీఆర్‌డీఓ, ఇండియన్‌ కోస్ట్‌గార్డ్, బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ తదితర కీలక సంస్థలకు సంబంధించిన సమగ్ర ప్రణాళిక ఈ బడ్జెట్లోనూ కనిపించలేదని వారన్నారు. 2018లో ఏర్పర్చిన అత్యున్నత స్థాయి రక్షణ ప్రణాళిక కమిటీ ఈ కర్తవ్యాలను నెరవేర్చాలని ఆదేశించింది కానీ అది కూడా చెత్తబుట్టలో కలిసిపోయిందనే చెప్పాలి.
– అమిత్‌ కోషిష్, రక్షణ శాఖ మాజీ ఆర్థిక సలహాదారు
– రాహుల్‌ బేడీ, సీనియర్‌ జర్నలిస్టు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement