పరి‘శ్రమిస్తే’.. నం.1
Published Sat, Oct 15 2016 12:21 PM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
ప్రగతిపథాన జిల్లా పారిశ్రామికాభివృద్ధి
2019 నాటికి ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఎరువుల ఉత్పత్తి
2020కి 1600 మెగావాట్ల విద్యుత్
ప్రతిపాదన దశలో 15మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్
సింగరేణి ఆధ్వర్యంలో కోల్‌వాషరీస్ ప్లాంట్లు
ఎల్లంపల్లితో పెరగనున్నవరిసాగు
గోదావరిఖని/మంథని: సిరులు పంచే సింగరేణి.. దేశానికి వెలుగులు పంచే ఎన్టీపీసీ.. స్థానిక యువతకు ఉపాధి కల్పించే బసంత్‌నగర్ సిమెంట్.. బీడు భూములను సస్యశ్యామలం చేసే ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ.. ఇవీ పెద్దపల్లి జిల్లాకు ప్రధాన వనరులు. అలాంటి పెద్దపల్లికి జిల్లా హోదా దక్కడం మరో కొత్త అధ్యాయం.. పరిశ్రమల ఏర్పాటుకు అనువైన ప్రాంతం కావడం, రవాణా సౌకర్యం ఉండడంతో పారిశ్రామికాభివృద్ధి ప్రగతిపథాన ముందుకు దూసుకుపోనుంది. సింగరేణి గనులు, ఎన్టీపీసీ విస్తరణ, అనుబంధ పరిశ్రమల ఏర్పాటుతో కొత్త కళ రానుంది. ‘కాలం’ కలిసి వస్తే ఈ ప్రాంతం మరో కోనసీమగా మారనుంది. ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారిస్తే రాష్ట్రంలోనే పెద్దపల్లి జిల్లా అభివృద్ధిలో మొదటిస్థానంలో నిలవనుంది.
2019 నాటికి ఆర్‌ఎఫ్‌సీఎల్ ఎరువు..
రామగుండం ఎరువుల కర్మాగారంలో 1980 నుంచి 1999వరకు ‘అన్నపూర్ణ’ పేరుతో ఎరువుల ఉత్పత్తి చేసి ఉత్తర తెలంగాణ జిల్లాల రైతులకు కల్పతరువుగా మారింది. అనుకోని పరిస్థితుల్లో మూతపడగా...పునరుద్ధరణకు నోచుకుంటోంది. గ్యాస్‌ఆధారంగా నడవనున్న ఈ ప్లాంట్ 2019 నాటికి అందుబాటులోకి రానుంది. రోజుకు 6లక్షల టన్నుల యూరియాను ఉత్పత్తి చేయనుంది. స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నారుు.
2020 నాటికి తెలంగాణ స్టేజ్-1 విద్యుత్
రామగుండం ఎన్టీపీసీలో ప్రస్తుతం 2,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండగా... అందులో 36 శాతం విద్యుత్ అంటే 936 మెగావాట్లు తెలంగాణ(హోంస్టేట్)కు కేటాయించారు. తెలంగాణ పునర్విభజనలో భాగంగా కేటాయించిన విద్యుత్‌లో 2020 నాటికి తెలంగాణ స్టేజ్-1కింద ఉత్పత్తి చేయనున్న 1600 మెగావాట్ల విద్యుత్‌లో 85శాతం(1360 మెగావాట్లు) తెలంగాణ అవసరాలకు వినియోగిస్తారు. ఆ తర్వాత మరో 2,400 మెగావాట్ల ప్లాంట్‌లోనూ 85శాతం (2,040 మెగావాట్లు) విద్యుత్‌ను తెలంగాణకు కేటాయిస్తారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలోనే 10 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేయగా... రాబోయే రోజుల్లో రిజర్వాయర్ సమీపంలో మరో 15మెగావాట్ల సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటుచేసేలా ఎన్టీపీసీ యాజమాన్యం ప్రణాళికలు సిద్ధంచేసింది.
సింగరేణి విద్యుత్...పరిశ్రమలకు చేయూత
మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 1200 మెగావాట్ల ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి ఇటీవలే జరుగుతున్నది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్ పూర్తిగా తెలంగాణ ప్రభుత్వానికే కేటాయించారు. ఈక్రమంలో ఈ విద్యుత్‌ను వినియోగిస్తూ స్థానికంగా వివిధ రకాల పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు అవకాశముంది. ఇందుకు పెద్దపల్లి జిల్లా పరిధిలోని సుల్తానాబాద్, పెద్దపల్లి, మంథని ఏరియాలో భూములు అందుబాటులో ఉన్నాయి. కొత్త జిల్లా కావడంతో ప్రభుత్వం కూడా కొత్త పరిశ్రమల ఏర్పాటుకు చేయూతనిచ్చేందుకు ముందుకు రానున్నది.
బొగ్గుశుద్ధి కర్మాగారాల ఏర్పాటు
సింగరేణిలో ఉత్పత్తి చేస్తున్న బొగ్గును యాజమాన్యం సరఫరా చేస్తున్నా నాణ్యత లోపించడంతో వివిధ పరిశ్రమల నిర్వాహకులు ఆ బొగ్గును వాడేందుకు అనాసక్తిని చూపుతున్నారు. ఈ క్రమంలో ఆర్జీ-2 ఏరియాలోని యైటింక్లయిన్‌కాలనీ కోల్‌కారిడార్ తోపాటు ఆర్జీ-1 ఏరియా గోదావరిఖని జీడీకె 2, 2ఏ గని సమీపంలో బొగ్గుశుద్ధి కర్మాగారాలను ఏర్పాటు చేసేందుకు యాజమాన్యం ప్రణాళికలు రూపొందించింది. దీనిద్వారా సింగరేణి బొగ్గును అధికంగా వినియోగదారులు వినియోగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆయా పరిశ్రమల్లో వస్తుత్పత్తి జరగనుండగా... చాలా మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
అనుబంధ పరిశ్రమలకు ఏర్పాటు
సింగరేణి సంస్థ గతంలో స్థానిక నిరుద్యోగులకు వివిధ పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేలా అవకాశం కల్పించేందుకు అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేయాలనే ఆలోచనకు వచ్చింది. అరుుతే అప్పట్లో అనుకున్నంతగా యాజమాన్యం చొరవ చూపలేదు. ప్రస్తుతం కొత్త జిల్లాలో సింగరేణిలో బొగ్గుగనులు, ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులలో బొగ్గు ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగించే వస్తువులు, యంత్రాల విడిభాగాలను తయారు చేసేందుకు వీలుగా కోల్‌బెల్ట్ ప్రాంత నిరుద్యోగులను ప్రోత్సహించే అవకాశముంది. నట్లు, బోల్టులు, బెల్ట్‌లు, షూలు, టోపీలు, రాడ్లు, మందుగుండు సామగ్రిని భద్రపరిచే పెట్టెలు, ఇతరత్రా వస్తువులను తయారు చేయడం, సరఫరా చేయడం వంటి పనులు స్థానికులకే లభించనున్నాయి.
రైస్‌మిల్లుల ఏర్పాటుకు అవకాశం...
గతంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి వచ్చే నీరు డి-83 కాలువ ద్వారా రావడంతో దాని చుట్టుపక్కల గల గ్రామాలలో వరి పంట ఎక్కువ పండించేవారు. ఇలా పండిన వరిధాన్యాన్ని సుల్తానాబాద్‌లోని 115 రైస్‌మిల్లులకు పంపించేవారు. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి సాగునీరు గుండారం చెరువు ద్వారా మంథని ఏరియాతో పాటు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా సరఫరా అవుతుండగా... ఎక్కువ విస్తీర్ణంలో వరిపంట సాగయ్యే అవకాశముంది. దీంతో మిగతా ప్రాంతాలలో కూడా రైస్‌మిల్లుల ఏర్పాటుకు మార్గం సుగమం కానున్నది. దీనిద్వారా చాలా మందికి ఉపాధి లభించనుంది.
Advertisement
Advertisement