‘మహారత్న’లను మించిన సింగరేణి  | Singareni coal mining is the top in development | Sakshi
Sakshi News home page

‘మహారత్న’లను మించిన సింగరేణి 

Published Tue, May 14 2019 1:33 AM | Last Updated on Tue, May 14 2019 1:33 AM

Singareni coal mining is the top in development - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణకు కొంగు బంగారమైన సింగరేణి బొగ్గు గనుల సంస్థ లాభాలు, అమ్మకాల వృద్ధి రేటులో దేశంలోని ప్రతిష్టాత్మకమైన ‘మహారత్న’కంపెనీలను తలదన్ని కొత్త రికార్డు సృష్టించింది. గడచిన ఆరేళ్ల కాలంలో (2013–19) అద్భుత వృద్ధి రేటుతో దేశంలోనే ప్రభుత్వ రంగ సంస్థలకు తలమానికంగా నిలిచింది. 2013–14లో రూ.11,928 కోట్ల అమ్మకాలు జరగగా, 2018–19 నాటికి 116.5 శాతం వృద్ధి రేటుతో రూ.25,828 కోట్లకు పెరిగాయి. 2013–14లో రూ.419 కోట్ల నికర లాభాలు గడించగా, 2018–19 నాటికి 282 శాతం వృద్ధి రేటుతో రూ.1,600 కోట్లకు చేరుకున్నాయి. లాభాల్లో వృద్ధిని పరిశీలిస్తే ‘మహారత్న’ కంపెనీలలో అగ్రగామి సంస్థలైన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ గడచిన ఐదేళ్లలో 104.5 శాతం వృద్ధిని, గెయిల్‌ (ఇండియా) 49 శాతం వృద్ధిని, ఓఎన్‌జీసీ 36.5 శాతం వృద్ధిని, భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ 31.2 శాతం వృద్ధిని, కోలిండియా లిమిటెడ్‌ 0.6 శాతం వృద్ధిని సాధించగా, సింగరేణి ఏకంగా 281.9 శాతం వృద్ధిని నమోదు చేసింది. అమ్మకాల్లో కోల్‌ ఇండియా 55.1 శాతం, ఓఎన్‌జీసీ 30.9 శాతం, గెయిల్‌ (ఇండియా) 28.6 శాతం, ఎన్టీపీసీ 26.5 శాతం, భారత్‌ పెట్రోలియం 24.4 శాతం, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ 23.8శాతం, బీహెచ్‌ఈఎల్‌ 2 శాతం వృద్ధిని నమోదు చేయగా, సింగరేణి ఏకంగా 116.5 శాతం వృద్ధిని నమోదుచేసింది. 

ప్రభుత్వ తోడ్పాటుతో ముందడుగు  
తెలంగాణ ఆవిర్భావం తర్వాత సింగరేణి సంస్థలో ప్రవేశపెట్టిన సంస్కరణలు ఫలించాయి. ఇందుకు సీఎం కేసీఆర్‌ మార్గదర్శకత్వంలో సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ తీసుకున్న చర్యలతో సంస్థ వృద్ధి రేటులో దూసుకుపోయింది. అత్యధిక బొగ్గు ఉత్పత్తి, బొగ్గు రవాణాలు సాధిస్తూ, లాభాలు, అమ్మకాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలచింది. సింగరేణి సంస్థ కొత్త గనులకు అనుమతులు రాబట్టడం, ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాకుకు అదనంగా కొత్తగా ‘న్యూపాత్రపురా’బ్లాకును సింగరేణి సాధించడంలో సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవ చూపారు.  

2025 కల్లా వంద మిలియన్‌టన్నుల ఉత్పత్తి లక్ష్యం: సీఎండీ ఎన్‌.శ్రీధర్‌  
గత ఐదేళ్లలో తమ సంస్థ లాభాలు, అమ్మకాల వృద్ధి రేటులో దేశంలోనే అగ్రగామి కంపెనీల్లో ఒకటిగా నిలవడం సంతోషకరమని, అయితే తాము సాధించాల్సింది ఇంకా ఎంతో ఉందని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ అన్నారు. 2025 నాటికి 100 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం దాటే విధంగా సింగరేణిని రూపుదిద్దుతున్నామని వివరించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement