పుష్కర పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలి
ఇబ్రహీంపట్నం : రానున్న పుష్కరాలను పురస్కరించుకుని స్నానఘాట్లు, రోడ్లు అభివృద్ధి పనులు యుద్ధప్రాతిపదికన నిర్వహించాలని కలెక్టర్ బాబు.ఏ ఆదేశించారు. గురువారం ఇబ్రహీంపట్నం మండంలోని ఫెర్రీ ఘాట్, కొండపల్లి రైల్వేస్టేషన్, పశ్చిమ ఇబ్రహీంపట్నం ట్రక్ టెర్మినల్ ప్రాంతాలను ఇతర అధికారులతో కలసి ఆయన పరిశీలించారు. తొలుత రాయనపాడు, కొండపల్లి రైల్వేస్టేషన్లు పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ పుష్కరాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి లక్షల్లో యాత్రికులు తరలివస్తారన్నారు.
గుంటుపల్లి సమీపంలోని రైల్వే స్థలంలో పుష్కరనగర్ ఏర్పాటుచేసి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. రైల్వేస్టేషన్ల నుంచి స్నానఘాట్లకు యాత్రికులను తరలించేందుకు మినీబస్‌లు ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. గుంటుపల్లి వ్యాగన్ వర్కుషాపు రహదారిని అభివృద్ధి చేయాలని తెలిపారు. ఇబ్రహీంపట్నం ట్రక్ టెర్మినల్ వద్ద తాత్కాలిక వసతి ఏర్పాటుతోపాటు తాగునీరు, బాత్రూమ్లు నెలకొల్పాలన్నారు.
పవిత్ర సంఘ మం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారని అందుకు అవసరమైన ఏర్పాటు తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. బుడమేరు కట్టపైన నివాసాలు తక్షణమే తొలగించి రహదారిని అభివృద్ధి పర్చాలని ఆదేశించారు. ఈయన వెంట రైల్వే డివిజ నల్ మేనేజర్ అశోక్‌కుమార్, జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, సబ్‌కలెక్టర్ సృజన, సీపీ లడ్డా, డీసీపీ కాళిదాస్ ఇతర అధికారులు పాల్గొన్నారు.