స్వీపర్లు కావలెను
బ్రాహ్మణ, క్షత్రియులకు ప్రాధాన్యం
అహ్మదాబాద్: స్వీపర్లు కావాలంటూ స్థానిక సెయింట్ జేవియర్స్ ఆధ్వర్యంలోని స్వచ్ఛంద సేవా సంస్థ ఇచ్చిన ప్రకటన వివాదాస్పదమైంది. సెయింట్ జేవియర్స్కు చెందిన ఎన్జీఓ ‘హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ సెంటర్’ (హెడీఆర్సీ) డెరైక్టర్ ప్రసాద్ చాకో స్వీపర్లు తదితర పారిశద్ధ్య సిబ్బంది పోస్టుల కోసం ఏప్రిల్‌లో ప్రకటన ఇచ్చారు. అందులోని ఓ క్లాజ్‌లో... బ్రాహ్మణ, క్షత్రియ, వనియా, పటేల్, జైన్, సయ్యద్, పఠాన్, సిరియన్ క్రిస్టియన్, పార్సి కులస్తులకు ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు.
దీనిపై గత రెండు రోజులుగా ఎన్జీఓ కార్యాలయ ప్రాంగణంలో ఆందోళనలు జరుగుతున్నాయి. రాజ్‌పుత్ శౌర్య ఫౌండేషన్, యువ శక్తి సంఘటన్, సున్ని అవమి ఫోరమ్‌కు చెందిన కొందరు ఎన్జీఓ ప్రకటనను తప్పు పట్టారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా కలెక్టర్‌కు విన్నవించారు. అయితే ఎన్జీఓతో పాటు మరికొన్ని స్వచ్ఛంద సంస్థల బృందం కలెక్టర్‌ను కలిసింది. తామే కులాన్నీ కించపరిచే ఉద్దేశంతో ఈ ప్రకటన ఇవ్వలేదని తెలిపింది.