Standard & Poors
-
భారత్ రేటింగ్ పెంచండి
న్యూఢిల్లీ: స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నట్లుగా గణాంకాలు సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలో భారత్ రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేయాలంటూ స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ)కి ప్రభుత్వం సూచించింది. వస్తు, సేవల పన్నుల చట్టం (జీఎస్టీ) అమలుకు కట్టుబడి ఉన్నట్లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు మరింత మెరుగై 8 శాతం స్థాయిలో ఉండగలదని పేర్కొంది. భారత పర్యటనకి వచ్చిన ఎస్అండ్పీ అధికారులతో జరిగిన భేటీలో ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) అరవింద్ సుబ్రమణియన్ ఈ అంశాలు ప్రస్తావించినట్లు సంబంధిత వర్గాల కథనం. దీని ప్రకారం .. ద్రవ్యోల్బణం, కరెంటు అకౌంటు లోటు దిగి వచ్చాయని, ఆర్థిక పరిస్థితులు మెరుగవుతున్నాయని సుబ్రమణియన్ వివరించారు. ఆర్థిక సంస్కరణల దరిమిలా మధ్యకాలికంగా భారత్ వృద్ధి అవకాశాలు పటిష్టంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. జీఎస్టీ బిల్లు అమలు, బ్యాంకింగ్ వ్యవస్థలో పేరుకుపోతున్న మొండిబకాయిల సమస్య పరిష్కారానికి హోల్డింగ్ కంపెనీ ఏర్పాటు తదితర అంశాల పురోగతి గురించి, చైనా యువాన్ డీవేల్యుయేషన్ ప్రభావాలను ఎదుర్కొనే తీరు గురించి ఎస్అండ్పీ అధికారులు అడిగి తెలుసుకున్నారు. అలాగే, ఎగుమతుల మందగమనంపై ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, జవాబుదారీతనం పెంచేలా చేపడుతున్న పాలనాపరమైన సంస్కరణలు తదితర చర్యల గురించి బ్యాంకింగ్ కార్యదర్శి హస్ముఖ్ అధియా వివరించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్రం అదనపు మూలధనం సమకూర్చడం మొదలైన చర్యల కారణంగా హోల్డింగ్ సంస్థ ఏర్పాటు అవసరం ఉండకపోవచ్చని పేర్కొన్నారు. -
భారత్ రేటింగ్ పెరిగే చాన్స్!
సార్వభౌమ రేటింగ్ అప్‌గ్రేడ్‌కు అవకాశాలున్నాయి: ఎస్అండ్పీ ఈ ఏడాది క్యాడ్ 2% దిగువనే.. న్యూఢిల్లీ: భారత్‌కు త్వరలో రేటింగ్ బూస్ట్ లభిస్తుందా? మోదీ సర్కారు సంస్కరణల జోరు నేపథ్యంలో అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం స్టాండర్డ్ అండ్ పూర్స్(ఎస్అండ్పీ) నుంచి సానుకూల వ్యాఖ్యలు వెలువడ్డాయి. భారత సార్వభౌమ(సావరీన్) పరపతి రేటింగ్‌ను రానున్న కాలంలో పెంచే అంశాన్ని కొట్టిపారేయలేమని శుక్రవారం పేర్కొంది. అయితే, వచ్చే రెండేళ్లలో దేశీయంగా ఆర్థిక వ్యవస్థ పనితీరుపైనే రేటింగ్ అప్‌గ్రేడ్ ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడింది. గతేడాది సెప్టెంబర్‌లో భారత్ సావరీన్ రేటింగ్ అవుట్‌లుక్‌ను ఎస్అండ్పీ ప్రతికూలం(నెగటివ్) నుంచి స్థిరానికి(స్టేబుల్) పెంచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత్‌కు ఎస్అండ్పీ బీబీబీ మైనస్(అవుట్‌లుక్ స్టేబుల్) దీర్ఘకాలిక రేటింగ్‌ను కొనసాగిస్తోంది. ఈ రేటింగ్‌ను గనుక పెంచితే భారత్‌కు మరిన్ని విదేశీ పెట్టుబడులు తరలిరావడంతోపాటు... దేశీ కార్పొరేట్లు, ప్రభుత్వానికి విదేశీ నిధుల సమీకరణలో మరింత తోడ్పాటు లభిస్తుంది. కాగా, అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత్‌కు వస్తున్న నేపథ్యంలో ఎస్అండ్పీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా, వాస్తవ జీడీపీ వృద్ధి రేటు 5.5 శాతం పైన కొనసాగడంతోపాటు.. ద్రవ్య, వాణిజ్య, కరెంట్ అకౌంట్ లోటులు కట్టడి కావడం, ద్రవ్యోల్బణం ప్రస్తుతమున్న దిగువ స్థాయిల్లో కొనసాగితే భారత్ రేటింగ్‌ను పెంచేందుకు ఆస్కారం ఉందని ఏజెన్సీ వివరించింది. ప్రస్తుత ఏడాది(2014-15)లో కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) జీడీపీలో 2% లోపునకే పరిమితం కావచ్చని ఎస్అండ్పీ అంచనా వేసింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల భారీ పతనం ఇందుకు దోహదం చేస్తుందని పేర్కొంది. అయితే, ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ద్రవ్యలోటు లక్ష్యం(జీడీపీలో 4.1%) సాకారం కావడం కష్టసాధ్యమేనని అభిప్రాయపడింది. -
వచ్చే ఐదేళ్లలో 6.5 శాతం వృద్ధి: క్రిసిల్
ముంబై: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు వచ్చే ఐదేళ్లలో సగటున 6.5 శాతంగా ఉండే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనావేస్తోంది. ఇప్పుడు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల అనంతరం సుస్థిర ప్రభుత్వం ఏర్పడే వీలుందన్నది స్టాండర్డ్ అండ్ పూర్స్(ఎస్అండ్పీ)కు చెందిన ఈ రేటింగ్ సంస్థ అంచనా. ఈ పరిణామం 2015-2019 ఆర్థిక సంవత్సరాల మధ్య వృద్ధి సగటున 6.5 శాతంగా నమోదుకావడానికి దోహదపడుతుందన్నది తన అంచనా అని ఒక నివేదికలో పేర్కొంది. వచ్చే ఎన్నికల్లో ఓటర్ల నిర్ణయాత్మక తీర్పు వెలువడుతుందని, ఇది దేశాభివృద్ధిలో కీలకం కానుందని వివరించింది. కాగా విధాన నిర్ణయాల్లో క్రియాశీలత లోపించడం, అమెరికా, యూరోజోన్లలో రికవరీ వేగం ఊహించినదానికన్నా తక్కువగా ఉండడం, రెండుమూడేళ్లలో బలహీన రుతుపవనాల పరిస్థితులు వంటి అంశాలు వృద్ధి 5% దిగువనే కొనసాగడానికి దారితీసే అంశాలని క్రిసిల్ నివేదిక పేర్కొంది.