భారత్ రేటింగ్ పెంచండి
న్యూఢిల్లీ: స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నట్లుగా గణాంకాలు సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలో భారత్ రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేయాలంటూ స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్‌అండ్‌పీ)కి ప్రభుత్వం సూచించింది. వస్తు, సేవల పన్నుల చట్టం (జీఎస్‌టీ) అమలుకు కట్టుబడి ఉన్నట్లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు మరింత మెరుగై 8 శాతం స్థాయిలో ఉండగలదని పేర్కొంది. భారత పర్యటనకి వచ్చిన ఎస్‌అండ్‌పీ అధికారులతో జరిగిన భేటీలో ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) అరవింద్ సుబ్రమణియన్ ఈ అంశాలు ప్రస్తావించినట్లు సంబంధిత వర్గాల కథనం. దీని ప్రకారం .. ద్రవ్యోల్బణం, కరెంటు అకౌంటు లోటు దిగి వచ్చాయని, ఆర్థిక పరిస్థితులు మెరుగవుతున్నాయని సుబ్రమణియన్ వివరించారు. ఆర్థిక సంస్కరణల దరిమిలా మధ్యకాలికంగా భారత్ వృద్ధి అవకాశాలు పటిష్టంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
జీఎస్‌టీ బిల్లు అమలు, బ్యాంకింగ్ వ్యవస్థలో పేరుకుపోతున్న మొండిబకాయిల సమస్య పరిష్కారానికి హోల్డింగ్ కంపెనీ ఏర్పాటు తదితర అంశాల పురోగతి గురించి, చైనా యువాన్ డీవేల్యుయేషన్ ప్రభావాలను ఎదుర్కొనే తీరు గురించి ఎస్‌అండ్‌పీ అధికారులు అడిగి తెలుసుకున్నారు. అలాగే, ఎగుమతుల మందగమనంపై ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, జవాబుదారీతనం పెంచేలా చేపడుతున్న పాలనాపరమైన సంస్కరణలు తదితర చర్యల గురించి బ్యాంకింగ్ కార్యదర్శి హస్‌ముఖ్ అధియా వివరించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్రం అదనపు మూలధనం సమకూర్చడం మొదలైన చర్యల కారణంగా హోల్డింగ్ సంస్థ ఏర్పాటు అవసరం ఉండకపోవచ్చని పేర్కొన్నారు.