వచ్చే ఐదేళ్లలో 6.5 శాతం వృద్ధి: క్రిసిల్
ముంబై: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు వచ్చే ఐదేళ్లలో సగటున 6.5 శాతంగా ఉండే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనావేస్తోంది. ఇప్పుడు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల అనంతరం సుస్థిర ప్రభుత్వం ఏర్పడే వీలుందన్నది స్టాండర్డ్ అండ్ పూర్స్(ఎస్‌అండ్‌పీ)కు చెందిన ఈ రేటింగ్ సంస్థ అంచనా. ఈ పరిణామం 2015-2019 ఆర్థిక సంవత్సరాల మధ్య వృద్ధి సగటున 6.5 శాతంగా నమోదుకావడానికి దోహదపడుతుందన్నది తన అంచనా అని ఒక నివేదికలో పేర్కొంది.
వచ్చే ఎన్నికల్లో ఓటర్ల నిర్ణయాత్మక తీర్పు వెలువడుతుందని, ఇది దేశాభివృద్ధిలో కీలకం కానుందని వివరించింది. కాగా విధాన నిర్ణయాల్లో క్రియాశీలత లోపించడం, అమెరికా, యూరోజోన్‌లలో రికవరీ వేగం ఊహించినదానికన్నా తక్కువగా ఉండడం, రెండుమూడేళ్లలో బలహీన రుతుపవనాల పరిస్థితులు వంటి అంశాలు వృద్ధి 5% దిగువనే కొనసాగడానికి దారితీసే అంశాలని క్రిసిల్ నివేదిక పేర్కొంది.