భారత్ రేటింగ్ పెరిగే చాన్స్!
సార్వభౌమ రేటింగ్ అప్‌గ్రేడ్‌కు
అవకాశాలున్నాయి: ఎస్‌అండ్‌పీ
ఈ ఏడాది క్యాడ్ 2% దిగువనే..
న్యూఢిల్లీ: భారత్‌కు త్వరలో రేటింగ్ బూస్ట్ లభిస్తుందా? మోదీ సర్కారు సంస్కరణల జోరు నేపథ్యంలో అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం స్టాండర్డ్ అండ్ పూర్స్(ఎస్‌అండ్‌పీ) నుంచి సానుకూల వ్యాఖ్యలు వెలువడ్డాయి. భారత సార్వభౌమ(సావరీన్) పరపతి రేటింగ్‌ను రానున్న కాలంలో పెంచే అంశాన్ని కొట్టిపారేయలేమని శుక్రవారం పేర్కొంది. అయితే, వచ్చే రెండేళ్లలో దేశీయంగా ఆర్థిక వ్యవస్థ పనితీరుపైనే రేటింగ్ అప్‌గ్రేడ్ ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడింది. గతేడాది సెప్టెంబర్‌లో భారత్ సావరీన్ రేటింగ్ అవుట్‌లుక్‌ను ఎస్‌అండ్‌పీ ప్రతికూలం(నెగటివ్) నుంచి స్థిరానికి(స్టేబుల్) పెంచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత్‌కు ఎస్‌అండ్‌పీ బీబీబీ మైనస్(అవుట్‌లుక్ స్టేబుల్) దీర్ఘకాలిక రేటింగ్‌ను కొనసాగిస్తోంది. ఈ రేటింగ్‌ను గనుక పెంచితే భారత్‌కు మరిన్ని విదేశీ పెట్టుబడులు తరలిరావడంతోపాటు... దేశీ కార్పొరేట్లు, ప్రభుత్వానికి విదేశీ నిధుల సమీకరణలో మరింత తోడ్పాటు లభిస్తుంది. కాగా, అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత్‌కు వస్తున్న నేపథ్యంలో ఎస్‌అండ్‌పీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
కాగా, వాస్తవ జీడీపీ వృద్ధి రేటు 5.5 శాతం పైన కొనసాగడంతోపాటు.. ద్రవ్య, వాణిజ్య, కరెంట్ అకౌంట్ లోటులు కట్టడి కావడం, ద్రవ్యోల్బణం ప్రస్తుతమున్న దిగువ స్థాయిల్లో కొనసాగితే భారత్ రేటింగ్‌ను పెంచేందుకు ఆస్కారం ఉందని ఏజెన్సీ వివరించింది. ప్రస్తుత ఏడాది(2014-15)లో కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) జీడీపీలో 2% లోపునకే పరిమితం కావచ్చని ఎస్‌అండ్‌పీ అంచనా వేసింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల భారీ పతనం ఇందుకు దోహదం చేస్తుందని పేర్కొంది. అయితే, ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ద్రవ్యలోటు లక్ష్యం(జీడీపీలో 4.1%) సాకారం కావడం కష్టసాధ్యమేనని అభిప్రాయపడింది.