సూపర్ సింగర్ ఫైనల్స్‌కు కర్నూలు కుర్రాడు
కర్నూలు(హాస్పిటల్): తమిళనాడులోని స్టార్ విజయ్‌టీవీ నిర్వహిస్తున్న సూపర్‌సింగర్ ఫైనల్స్‌కు కర్నూలుకు చెందిన అనిరుద్ ఎంపికయ్యాడు. జన్మతః అబ్బిన గాత్రంతో బాల్యం నుంచే అతను మంచి గాయకునిగా రాణించసాగాడు. కర్ణాటక సంగీతంతోపాటు సినీగీతాలను అలవోకగా పాడేస్తున్నాడు. ఐఐటీ చదివి చెన్నైలో ప్రయివేటు ఉద్యోగం చేస్తున్న ఆ యువకుడు సూపర్‌సింగర్ పోటీల్లో ఫైనల్స్‌కు చేరాడు. కర్నూలుకు చెందిన మెడికల్ రెప్ సుస్వరం వాసుదేవమూర్తి, సుస్వరం రజనీ వాసుదేవ్ దంపతులకు 1994 నవంబర్ 24న అనిరుద్ జన్మించాడు. బాల్యం నుంచే పాటలు పాడటంలో అతని ప్రతిభను గమనించిన తల్లిదండ్రులు మ్యూజిక్ టీచర్ విజయలక్ష్మి వద్ద శిక్షణ ఇప్పించారు.
ఆ తర్వాత ప్రతి శని, ఆదివారం హైదరాబాద్ వెళ్లి బాలసుబ్రమణ్యం, రామాచారి వద్ద సంగీతం అభ్యసించాడు. 8వ ఏట ఎస్పీ బాలసుబ్రమణ్యం వ్యాఖ్యాతగా వ్యవహరించిన మాటీవీలో ‘పాడాలని ఉంది’ మ్యూజిక్ కాంపిటీషన్లో పాల్గొని సెమిఫైనల్ వరకు వచ్చాడు. ఆ తర్వాత 12వ ఏటా ఎస్పీ బాలసుబ్రమణ్యం వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈటీవీ కన్నడ ఛానల్లో పాల్గొని సెమిఫైనల్‌కు అర్హత సాధించాడు. 13వ ఏట జీ తెలుగు నిర్వహించిన జీ లిటిల్ ఛాంప్స్‌లో సంగీత దర్శకులు కోటి, రమణ గోరంట్ల, గాయని శైలజ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన పోటీలో టాప్ 4లో నిలిచాడు. జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా పలు సంగీత పోటీల్లో పాల్గొని అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నాడు.
తర్వాత కొన్ని సంవత్సరాలు మ్యూజిక్కు దూరంగా ఉండి చదువుపై దృష్టి నిలిపాడు. ఐఐటీ మద్రాస్‌లో సీటు సాధించి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో బీటెక్, ఎంటెక్ పూర్తి చేశాడు. బీటెక్ ఫైనలియర్లో ఉన్నప్పుడే మాటీవీ వారు నిర్వహించిన సూపర్‌సింగర్ 8లో పాల్గొని ఫైనల్స్‌కు చేరుకున్నాడు. ప్రస్తుతం పేపాల్ చెన్నై బ్రాంచ్‌లో సర్టిఫైడ్ రిస్క్ అనలిస్ట్‌గా ఉద్యోగం చేస్తూ తమిళ్ ఛానల్ స్టార్ విజయ్ టీవీలో సూపర్‌సింగర్ పోటీలో పాల్గొని ఫైనల్ వరకు వచ్చాడు. ఈ పోటీకి దేశవ్యాప్తంగా 6వేల మందిని పరిశీలించగా చివరకు ఆరుగురు ఎంపికయ్యారు.
అనిరుద్‌కు ఓటేయండి
సూపర్ సింగర్ ఫైనల్ పోటీల్లో తమిళనాడు నుంచి ముగ్గురు, కర్ణాటక, కేరళ నుంచి ఒక్కొక్కరు, తెలుగు రాష్ట్రాల నుంచి అనిరుద్ ఎంపికయ్యారు. ఈ పోటీ ఈ నెల 15వ తేదీన నిర్వహించనున్నారు. టైటిల్ విన్నర్ అవ్వాలంటే ఓటింగ్ తప్పనిసరి కావడంతో ఈ నెల 15వతేదీలోగా గూగుల్ ద్వారా అనిరుద్‌కు ఓటేసి గెలిపించాలని తండ్రి వాసుదేవరావు కోరుతున్నాడు. గూగుల్ వెబ్సైట్ తెరిచి ‘సూపర్ సింగర్ ఓట్’ అని టైప్ చేసి, అందులో అనిరుద్ ఇమేజ్ను ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత స్కేల్‌ను 50 వరకు డ్రాగ్ చేసి మీ ఓటును అందించాలని కోరారు.