రాష్ర్ట స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీలు ప్రారంభం
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక జార్జికారొనేషన్ క్లబ్లో రాష్ర్టస్థాయి బాలబాలికల అండర్ 14, 17 రైఫిల్ షూటింగ్ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. వీటిని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలలో గెలుపోటములు సహజమేనని, గెలుపొందిన వారు ఎక్కువ, ఓడిన వారు తక్కువ కాదని చెప్పారు. విద్యార్థులు క్రీడా నైపుణ్యం సంపాదించి ఉత్తమ క్రీడాకారులుగా ఎదగాలన్నారు.
వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడలను ప్రోత్సహించి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాట వేయాలని సూచించారు. మున్సిపల్ పాఠశాల విద్యార్థిని జాతీయ స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీలో ప్రతిభకనబరచడం అభినందనీయమన్నారు. ఆర్‌ఐపీఈ భానుమూర్తి రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్సార్ జిల్లా స్పోర్ట్స్ స్కూల్ ముందంజలో ఉందన్నారు.
ఎస్జీఎఫ్ కార్యదర్శి మురళీకృష్ణ మాట్లాడుతూ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థిని హాజీబీ జాతీయ స్థాయి పోటీలలో ప్రతిభకనబర్చడం అభినందనీయమని, శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయుడు రాఘవను అభినందించారు. మున్సిపల్ చైర్మన్ గురివిరెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులకు తగిన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఉప క్లబ్ కార్యదర్శి మార్తల సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ క్లబ్లో రైఫిల్ షూటింగ్ కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.
జాతీయ స్థాయి రైఫిల్ పోటీలలో అండర్-14లో గోల్డ్‌మెడల్ సాధించిన టీ అతిథిని ఈ సందర్భంగా సత్కరించారు. ఈ క్రీడాకారిణికి కమలాపురం ఏపీసోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రమణమ్మ రూ.50వేలు నగదు బహుమతి అందించారు.
ఎంపీపీ రాజారాంరెడ్డి, నిర్వాహక కమిటీ అధ్యక్షులు, డీబీసీఎస్ మున్సిపల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు వేణుగోపాల్‌రావు, మున్సిపల్ వైస్‌చైర్మన్ వైఎస్ జబివుల్లా, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ స్వరూప్‌కుమార్‌రెడ్డి, నిర్వాహక కార్యదర్శి రాఘవ, వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీనివాసులరెడ్డి, సుధాకర్‌రెడ్డి, నడిగడ్డ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.