State Bar Council
-
Supreme Court: లాయర్లుగా ఎన్రోల్కు అంత ఫీజా?
న్యూఢిల్లీ: న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టేందుకు లాయర్లుగా ఎన్రోల్చేసుంటున్న న్యాయశాస్త్ర పట్టభద్రుల నుంచి రాష్ట్రాల బార్ కౌన్సిళ్లు(ఎస్బీసీ) భారీ స్థాయిలో ఫీజులు వసూలుచేయడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. నిబంధనల ప్రకారం ఎస్సీ–ఎస్టీ కేటగిరీ లా పట్టభద్రుల నుంచి రూ.125 ఫీజు, జనరల్ కేటగిరీ నుంచి రూ.750 మించి వసూలుచేయకూడదని ధర్మాసనం ఆదేశించింది. ఎస్బీసీలు వసూలుచేస్తున్న విపరీతమైన ఫీజుల కారణంగా అణగారిన, ఆర్థికంగా వెనకబడిన వర్గాల పేద, మధ్యతరగతి లా పట్టభద్రులు న్యాయవృత్తిలోకి రాలేని పరిస్థితి నెలకొంటోందని, వారు ఈ వృత్తిలో భాగస్వాములయ్యే అవకాశాలు తగ్గిపోతాయని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆవేదన వ్యక్తంచేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం ఈ తీర్పు వెలువరిచింది. -
న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని నిలుపుకోవాలి
ఖమ్మం లీగల్: న్యాయవ్యవస్థపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉందని, దాన్ని న్యాయవాదులు, న్యాయమూర్తులు నిలుపుకోవాలని రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అన్నారు. న్యాయం అందించే ప్రక్రియలో జరిగే జాప్యాన్ని నివారించడంలో న్యాయమూర్తులు, న్యాయవాదుల పాత్ర కీలకమైందని చెప్పారు. ఖమ్మంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో శనివారం నిర్వహించిన న్యాయవాద పరిషత్ రాష్ట్ర ద్వితీయ మహాసభలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సంద ర్భంగా ‘సత్వర న్యాయం–న్యాయవాదుల పాత్ర’ అనే అంశంపై ప్రసంగించారు. కక్షిదారులు, ప్రజలకు సత్వర న్యాయం అందించకుంటే న్యాయవ్యవస్థపై నమ్మకం పోతుందన్నారు. న్యాయాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 20, 21 ప్రకారం అందరికీ సమన్యాయం వర్తిస్తుందని తెలిపారు. కక్షిదారులకు న్యాయస్థానాలను ఆశ్రయించే హక్కు ఉందన్నారు. కష్టపడి పనిచేయాలని, బరువు బాధ్యతలను చిరునవ్వుతో మోయాలంటూ ఇటుకలు మోసే పంజాబీ మహిళ గురించి ప్రస్తావించారు. 15 ఇటుకలను చిరునవ్వుతో మోసే ఆ మహిళ తల మీద మరికొన్ని మోపితే భారం అయినట్లుగా అవుతుందని పెండింగ్ కేసుల గురించి ప్రస్తావిస్తూ అన్నారు. సత్వర న్యాయానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలన్నారు. ప్రపంచంలోనే మనదేశ న్యాయవ్యవస్థ గొప్పదని చెప్పారు. ఖమ్మం జిల్లా పరిపాలనా న్యాయమూర్తి టి.వినోద్‌కుమార్ మాట్లాడుతూ సయోధ్య అనేది పురాతన కాలం నుంచి ఉందని, లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం అందించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి.శ్రీనివాసరావు మాట్లాడుతూ 2010లో తాను రాసిన పుస్తకంలోని సత్వర న్యాయం అనే అంశంపై వివరించానని తెలిపారు. మహాసభలో ఖమ్మం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గొల్లపూడి రామారావు, న్యాయమూర్తులు కె.లక్ష్మణ్, ఎన్.రాజేశ్వర్‌రావు, బి.నగేశ్, అదనపు సొలిసిటర్ జనరల్ టి.సూర్యకరణ్‌రెడ్డి, న్యాయవాద పరిషత్ బాధ్యులు కె.శ్రీనివాసమూర్తి, కరూర్ మోహన్, సునీల్, కె.విజయ్‌కుమార్, ఎస్.వెంకటేశ్వర గుప్తా, అన్ని జిల్లాల న్యాయవాద పరిషత్ న్యాయవాదులు హాజరయ్యారు. -
కదం తొక్కిన న్యాయవాదులు
సాక్షి, హైదరాబాద్: తమ సంక్షేమానికి బడ్జెట్లో రూ.5 వేల కోట్ల కేటాయింపు, జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.10 వేల ఉపకార వేతనం చెల్లింపు, మెడిక్లెయిమ్, రూ.20 లక్షల బీమా తదితర డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు మంగళవారం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పలు చోట్ల కోర్టు విధులను బహిష్కరించారు. హైకోర్టులో కూడా న్యాయవాదులు విధులను బహిష్కరించారు. కోర్టు హాళ్లలోకి వెళ్లి విధుల బహిష్కరణకు సహకరించాలని న్యాయమూర్తులను కోరారు. వాదనలు వినిపించేందుకు న్యాయవాదులు కూడా లేకపోవడంతో న్యాయమూర్తులు బెంచ్ దిగి తమ చాంబర్లకు వెళ్లిపోయారు. ఉదయం 11.30 కల్లా హైకోర్టు దాదాపుగా ఖాళీ అయింది. అనంతరం న్యాయవాదులు బార్ కౌన్సిల్ గేటు నుంచి మదీనా వరకు ర్యాలీ నిర్వహించారు. కొద్దిసేపు అక్కడ తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఆ తరువాత పలువురు న్యాయవాదులు హైదరాబాద్ కలెక్టరేట్‌కు వెళ్లి అక్కడ కలెక్టర్‌ను కలిసి తమ డిమాండ్లకు సంబంధించిన వినతిపత్రం అందించారు. ఆ వినతిపత్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి పంపాలని కలెక్టర్‌ను కోరారు. సాయంత్రం పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పీపుల్స్ ప్లాజాకు చేరుకున్నారు. అక్కడి నుంచి రాజ్‌భవన్ వరకు ర్యాలీగా వెళ్లారు. తమ డిమాండ్లకు సంబంధించిన వినతిపత్రాన్ని గవర్నర్ నరసింహన్‌కు సమర్పించారు. రాష్ట్ర బార్ కౌన్సిల్‌తో పాటు హైకోర్టు న్యాయవాదుల సంఘం, ఇతర కోర్టుల న్యాయవాదుల సంఘాల ప్రతివాదులు మంగళవారం నాటి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. -
బార్ కౌన్సిల్‌కు నిధులిచ్చింది వైఎస్ ఒక్కరే..
రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి వేములవాడ: దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి బార్ కౌన్సిల్‌కు రూ.1.65కోట్లు మంజూరు చేశారని, రాష్ట్ర చరిత్రలోనే ఇది మర్చిపోలేనిదని రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి గుర్తు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సివిల్ కోర్డు సొంత భవనం ప్రారంభోత్సవం ఆదివారం జరిగింది. కార్యక్రమంలో నర్సింహారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత సీఎం కేసీఆర్ సైతం బార్ కౌన్సిల్‌కు రూ.కోటి మంజూరు చేస్తానని ప్రకటించారని తెలిపారు. సిరిసిల్లలో జిల్లా కోర్టు ఏర్పాటు కావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. కోర్టులకు అవసరమైన పుస్తకాలను తన సొంత నిధులు వెచ్చించి అందజేస్తానని చెప్పారు. బార్ అండ్ బెంచ్ సమన్వయంతో పనిచేస్తేనే సమాజానికి న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.