రంగంలోకి అమిత్ షా!
తమిళనాట కమలనాథుల్లో మరింత ఉత్సాహాన్ని నింపడంతో పాటుగా, అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం వ్యూహ రచనలు చేస్తోంది. రాష్ర్ట పార్టీ బలోపేత బాధ్యతలను ప్రధాని నరేంద్ర మోడీ సన్నిహితుడు అమిత్ షాకు అప్పగించేందుకు నిర్ణయించారు.
- బీజేపీ బలోపేతానికి వ్యూహాలు
- రాష్ట్ర కొత్త అధ్యక్షుడి బాధ్యత ఆయనకే
సాక్షి, చెన్నై: నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన క్షణం నుంచి రాష్ట్రంలోని కమలనాథులు ఉత్సాహంతో పార్టీ పనుల్లో నిమగ్నమయ్యూరు. ఒకప్పుడు చతికి ల బడి, దిక్కుతోచని స్థితిలో ఉన్న నాయకుల్లో ఇప్పుడు రెట్టింపు ఉత్సాహం వచ్చింది. తమ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడంతో, అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో ఉన్నారు. రాష్ట్రంలో పార్టీ మరింత బలోపేతమే లక్ష్యంగా, తమ మిత్రులను చేజార్చుకోకుండా కమలనాథులు జాగ్రత్త పడుతున్నారు. రానున్న రోజుల్లో పార్టీకి సరికొత్తవ్యూహాలను రచించి ఇవ్వడంతో పాటుగా, కొత్త అధ్యక్షుడి ఎంపిక, పూర్తి స్థాయిలో బలోపేత బాధ్యతలను ఇన్చార్జ్ భుజాన వేయడానికి బీజేపీ అధిష్టానం నిర్ణయించి ఉంది.
మోడీ సన్నిహితుడు: దక్షిణాదిలో తమిళనాట పార్టీ బలహీనంగా ఉన్న దృష్ట్యా, ఇక పూర్తి స్థాయిలో బీజేపీ అధిష్టానం తన దృష్టిని ఇక్కడ పెట్టనుంది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ గా మురళీ ధరరావు ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. ఆయన స్థానంలో కొత్త బాధ్యతలను చేపట్టేందుకు అమిత్ షా సిద్ధం అవుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడైన అమిత్ షా గుజరాత్లో కీలక నేత.
జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న అమిత్ షా వ్యూహాలను తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రాల్లో అమలు చేయించేం దుకు బీజేపీ అధిష్టానం నిర్ణయించినట్టు సమాచారం. ఇందులో భాగంగా తమిళనాడు మీద తొలుత అమిత్ షా తన దృష్టిని కేంద్రీకరించేందుకు సిద్ధం అవుతున్నారు. త్వరలో ఆయన నియూమకాన్ని ధృవీకరిస్తూ అధికారిక ప్రకటన వెలువడనుంది.
ఆయన రాకతో ఎన్నికల మిత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎవరెవరు తమతో కలసి వస్తారన్నది తేల్చుకున్నాకే, తదుపరి వ్యూహాలను అమిత్ షా అమలు చేయనున్నట్లు సమాచారం. 2016 అసెంబ్లీ ఎన్నికల్లోపు బలమైన శక్తిగా తమిళనాడులో బీజేపీ కూటమి అవతరించాలన్న లక్ష్యంతో అమిత్షా తన వ్యూహాలకు పదును పెట్టనున్నారన్న ప్రచారం కమలనాథుల్లో పుంజుకుంటోంది. ఆయన వచ్చాకే, కొత్త అధ్యక్షుడెవరన్నది తేలుతుందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
కొత్త అధ్యక్షుడెవరో: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్ కేంద్ర సహాయ మంత్రి అయ్యారు. దీంతో రాష్ట్ర పగ్గాలు ఎవరికి దక్కుతాయోనన్న ఉత్కంఠ కమలనాథుల్లో వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో బీజేపీ సీనియర్లు ఎందరో ఉన్నారు. రాష్ట్ర పార్టీలో పనిచేసినానంతరం వీరిలో అనేక మందికి జాతీయ పార్టీలో చోటు దక్కింది. ఈ దృష్ట్యా, ప్రస్తుతం రాష్ట్ర పార్టీలో సేవలను అందిస్తున్న వారిలో ఒకరికి అధ్యక్షుడయ్యే అవకాశాలున్నాయన్న ప్రచారం సాగుతోంది.
ఈ రేసులో బీజేపీ ఉపాధ్యక్షుడిగా హెచ్ రాజా, ప్రధాన కార్యదర్శిగా వానతీ శ్రీనివాసన్ ఉన్న ట్టు సమాచారం. అయితే, మహిళా కార్డును తెర మీదకు బీజేపీ తెచ్చే అవకాశాలు ఉన్నా యి. వానతీ శ్రీనివాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పార్టీలో చేరిన కొన్నాళ్లకే ప్రధా న కార్యదర్శి పదవిని ఆమె దక్కించుకున్నారు. ఇందుకు కారణం పార్టీ కోసం ఆమె సేవ, వాక్ చాతుర్యమే. ఆమె వాక్ చాతుర్యాన్ని బీజేపీ పెద్దలు మోడీ, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కారీ, సుష్మా స్వరాజ్ ప్రత్యేకంగా ప్రశంసించిన సందర్భాలు అనేకం. మహిళలకు మోడీ కేబినెట్లో పెద్ద పీట వేసిన దృష్ట్యా, ఇక్కడ కూడా మహిళను తెర మీదకు తెచ్చే అవకాశాలు ఎక్కువే.