బీసీ రిజర్వేషన్లపై హామీ ఇస్తేనే మద్దతు
కాకినాడ సిటీ, న్యూస్‌లైన్ : అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే తెలగ, బలిజ, కాపు వర్గాలకు బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చిన పార్టీలకే మద్దతు ఇస్తామని తెలగ, బలిజ, కాపు ఐక్యకార్యాచరణ వేదిక రాష్ట్ర కన్వీనర్ దాసరి రామ్మోహనరావు స్పష్టం చేశారు. బుధవారం స్థానిక కాస్మాపాలిటన్ క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాపులకు బీసీ రిజర్వేషన్ల అమలు అంశాన్ని ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చి నిజాయతీగా వ్యవహరించాలని పార్టీలను కోరారు.
మూడేళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రస్థాయి పోరాటాలు చేసినా నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందించలేదని, పైగా ఫైల్‌ను తొక్కిపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. సీమాంధ్రలో 22 శాతం ఉన్న తెలగ, బలిజ, కాపు ఓట్లు కీలకం కాబట్టి అవి చీలిపోకుండా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామన్నారు. కాపు, బలిజ వర్గీయులు అధికంగా ఉన్న ప్రాంతాలలో సీట్లకోసం పోరాడతామన్నారు.
పార్టీలు టికెట్లు ఇవ్వకపోతే ఆయా ప్రాంతాలలో స్వతంత్ర అభ్యర్థులను బరిలోకి దించి సత్తా చూపుతామని హెచ్చరించారు. అనంతరం ఆయన కాపు సద్భావనా సంఘ నాయకులతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. కాపు సంఘ నాయకులు వీవై దాసు, బసవా ప్రభాకరావు, పెద్దాడ సుబ్బారాయుడు, శ్రీరామ చంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు.
40 అసెంబ్లీ, 5 ఎంపీ సీట్లు ఇవ్వాలి
పిఠాపురం టౌన్ : తెలగ, బలిజ, కాపులకు జనాభా దామాషా ప్రకారం సీమాంధ్ర ప్రాంతంలో 40 అసెంబ్లీ, 5 ఎంపీ సీట్లను కేటాయించాలని తెలగ, బలిజ, కాపు ఐక్య కార్యచరణ వేదిక (టీబీకే జేఏసీ) రాష్ట్ర కన్వీనర్ దాసరి లోవ పిఠాపురంలో బుధవారం జరి గిన విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. సమస్యల సాధన కోసం కాపు, తెలగ, బలిజ కులస్తులు కల సికట్టుగా పోరాడాలన్నారు. సమావేశంలో వేదిక ప్రతి నిధులు బాలిపల్లి రాంబాబు, బస్వా శ్రీను, ఎస్.సతీష్, పి.రవికిరణ్, వై.దొరబాబు పాల్గొన్నారు.