35 పట్టణాలకు మిషన్ భగీరథ
► రూ.4,403 కోట్ల ప్రాజెక్టుకు ఆమోదం
► మూడు ప్యాకేజీలుగా పనులకు టెండర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో ఇంటింటికీ నల్లా నీటిని అందించేందుకు రూ.4403 కోట్ల అంచనా వ్యయమయ్యే ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి ఎంజీ గోపాల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 35 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు తాగునీటిని అందించాలని లక్ష్యంగా ఎంచుకుంది. అమృ త్ పరిధిలో ఉన్న 10 పట్టణాలకు కేంద్ర ప్రభుత్వం 50% నిధులను అందించనుండగా మిగతా 25 పట్టణాలకు సైతం తాగునీరు అందించేందుకు వీలుగా బృహత్తర ప్రణాళికను సిద్ధం చేసింది.
ఏడేళ్ల వ్యవధిలో నిధులు చెల్లించేలా యాన్యుటీ మోడ్ ఆఫ్ కాంట్రాక్ట్ పద్ధతిన ఈ ప్రాజెక్టును కాంట్రాక్టు కంపెనీలకు అప్పగిస్తుంది. మూడు ప్యాకేజీలుగా పనులను విభజించింది. మొదటి ప్యాకేజీలో కరీంనగర్, రామగుండం, ఖమ్మం కార్పొరేషన్లతోపాటు మహబూబ్‌నగర్, మిర్యాలగూడ, నల్లగొండ, సూర్యాపేట మున్సిపాలిటీలున్నాయి. రెండో ప్యాకేజీలో వరంగల్, నిజామాబాద్ కార్పొరేషన్, ఆదిలాబాద్, మూడో ప్యాకేజీలో కోరుట్ల, మెట్పల్లి, సిరిసిల్ల, పాల్వంచ, సత్తుపల్లి, ఇల్లందు, బెల్లంపల్లి, భైంసా, కాగజ్‌నగర్, మంచిర్యాల, మందమర్రి, నిర్మల్, జనగాం, గద్వాల, నారాయణపేట, వనపర్తి, భువనగిరి, తాండూరు, వికారాబాద్, సదాశివపేట, సంగారెడ్డి, జహీరాబాద్, బోధన్, కామారెడ్డి పట్టణాలకు తాగునీటిని అందించే పనులను పొందుపరిచారు.
ఈ మూడు ప్యాకేజీలకు రూ.2,296 కోట్లు అంచనా వ్యయంతో టెండర్లు పిలువాలని నిర్ణయించారు. ప్యాకేజీ పనులకు తోడుగా ద్రవోల్బణం, వడ్డీ తదితర ఖర్చులన్నీ కలిపి మరో రూ.2,707 కోట్లు అవుతుందని, మొత్తం రూ.4,152 కోట్లు అవుతుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ లెక్కలేసింది. పట్టణ ప్రాంతాల్లో ఈ పనులు చేపట్టేందుకు అవసరమయ్యే భూసేకరణకు రూ.51 కోట్లు, వనరుల సమీకరణ, రవాణాకు రూ.25 కోట్లు, జాతీయ రహదారులు, ఆర్ అండ్‌బీ, రైల్వే పరిధిలోని క్రాసింగ్‌ల్లో తవ్వకాలు, వాటి పునరుద్ధరణకు రూ.175 కోట్లు అంచనా వేసింది. మొత్తం రూ.4,403 కోట్లకు పరిపాలనా అనుమతి మంజూరు చేసింది.