state election commity
-
15న సహకార ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: ప్రాథమిక సహకార సంఘాల (ప్యాక్స్) ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ గురువారం ప్రకటించింది. ఈ మేరకు వచ్చే నెల 15న రాష్ట్రంలోని 906 ప్యాక్స్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లాల వారీగా వచ్చే నెల 3న నోటిఫికేషన్లు జారీ చేస్తారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు ఎన్నికల అధికారులను నియమించాల్సి ఉంటుంది. అన్ని ప్యాక్స్‌లలో మొత్తంగా 18,42,412 మంది ఓటర్లు ఉన్నారు. హైదరాబాద్ మినహా మిగిలిన పూర్వ తొమ్మిది జిల్లాల్లో (కొత్తగా 32) మొత్తం 909 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. ప్రస్తుతం 906 ప్యాక్స్‌లకే ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉమ్మడి వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కొక్క సహకార సంఘానికి ఎన్నికలు జరగడం లేదు. వీటిలో వరంగల్, నల్లగొండ జిల్లాల్లో ఉన్న ఒక్కొక్క సహకార సంఘానికి ఆగస్టు చివరి వరకు పాలక వర్గానికి కాలపరిమితి ఉంది. రంగారెడ్డి జిల్లాలోని మామిడిపల్లి పనితీరు సక్రమంగా లేకపోవడంతో దాన్ని రద్దు చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో సహకారశాఖ తక్షణమే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. వాస్తవంగా కొత్తగా ఏర్పడిన మండలాలతో పాటు, ప్రతీ మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని కచ్చితంగా రెండు ప్రాథమిక సహకార సంఘాలు (ప్యాక్స్) ఉండాలని ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ ప్రక్రియలో సహకార శాఖ నిమగ్నమైంది. ఆ ప్రకారం కొత్త వాటిని ఏర్పాటు చేసి మొత్తం 1,343 ప్యాక్స్లకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని అనుకున్నారు. ప్రస్తుతం మొత్తం 584 మండలాలకు 909 సహకార సంఘాలున్నాయి. 81 మండలాల్లో ఒక్క ప్యాక్స్ కూడా లేదు. మరికొన్ని మండలాల్లో 2 నుంచి 3 వరకు ఉన్నాయి. ప్రస్తుతమున్న 584లో 272 మండలాల్లో ఒక్కో ప్యాక్స్ మాత్రమే ఉంది. కొత్త నిబంధనల ప్రకారం వీటన్నింటిలో అదనంగా మరొక ప్యాక్స్ ఏర్పాటు చేయాలని అనుకున్నారు. 81 మండలాల్లోనూ రెండు చొప్పున మొత్తం 162 ఏర్పాటు చేయాలన్నది ఆలోచన. దీంతో కొత్తగా 434 ప్రాథమిక సహకార సంఘాలు ఏర్పాటు కావాల్సి ఉంది. ఈ ప్రక్రియ అంతా జరగాలంటే జూన్ వరకు సమయం పడుతుంది. కానీ ప్రభుత్వం తక్షణమే నియమించాలని కోరడంతో ప్రస్తుతమున్న ప్యాక్స్‌కు మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. డీసీసీబీలకు మాత్రమే.. ఉమ్మడి జిల్లాల ప్రకారం ఉన్న జిల్లా కేంద్ర సహకార బ్యాంకులకే (డీసీసీబీ) ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్యాక్స్‌కు ఒక్కసారి కూడా ఎన్నికలు జరగలేదు. 2018లోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ వరుస ఎన్నికలతో వాయిదా పడుతూ వస్తోంది. ప్యాక్స్లకు ఎన్నికలు పూర్తయ్యాక తదుపరి డీసీసీబీలకు, టెస్కాబ్‌కు ఎన్నికలు నిర్వహిస్తారు. వాటి షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. ఆ ఎన్నికల్లో డీసీసీబీ, టెస్కాబ్‌లకు చైర్మన్లను ఎన్నుకుంటారు. -
రీషెడ్యూల్ చేయండి..సాధ్యం కాదు..
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లకు సంబంధించి రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) నిర్వహించిన సమావేశం వాడివేడిగా జరిగింది. సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ ఎన్నికల తేదీలను రీషెడ్యూల్ చేయాలంటూ తాము చేసిన విజ్ఞప్తిపై ఎస్ఈసీ నుంచి సానుకూలత వ్యక్తం కాలేదని కాంగ్రెస్, ఇతర పార్టీల నేతలు పేర్కొన్నారు. తాము ఇచ్చిన సలహాలు, సూచనలను పట్టించుకోకపోగా ఎస్ఈసీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని, అధికారపార్టీకి తొత్తుగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్‌నేతలు మర్రి శశిధర్‌రెడ్డి, గోపిశెట్టి నిరంజన్ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని, అఖిలపక్ష సమావేశంలో ఆయన ఉపయోగించిన పరుష పదజాలానికి నిరసనగా సమావేశాన్ని బాయ్‌కాట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. రిజరేషన్లు ప్రకటించాకే ఎన్నికలు నిర్వహించాలని కోరితే తనపై దాడి చేశారని, వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానని దళిత బహుజన పార్టీ నేత కృష్ణ స్వరూప్ ఆరోపించారు. టీఆర్ఎస్, ఎంఐఎం మినహా దాదాపు మిగతా అన్ని పార్టీలు ఎన్నికల తేదీలు రీ షెడ్యూల్ చేయాలని డిమాండ్ చేశాయి. దీంతో సమావేశం ఒకింత రసాభాసగా మారింది. తమతో పరుషంగా మాట్లాడిన కృష్ణ స్వరూప్‌ను పోలీసుల సహాయంతో బయటకు పంపించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. శనివారం ఎస్ఈసీ వద్ద గుర్తింపు పొందిన పార్టీలు, రాజకీయపక్షాలతో కమిషన్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వి.నాగిరెడ్డి ముందుగా ఎన్నికల నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లు, షెడ్యూల్ విడుదల గురించి వివరించారు. మున్సిపాలిటీల కాలపరిమితి ముగిసేలోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని, రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో ఎన్నికలు నిర్వహించొచ్చని మున్సిపల్ చట్టంలో ఉందని, ఎన్నికల నిర్వహణలో జాప్యం జరగడంతో తామే కోర్టుకు వెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలు ఆలస్యమయ్యాయని, మెజారిటీ మున్సిపాలిటీల కాలపరిమితి ముగిసి 7 నెలలు గడిచినందున, సమ్మక్క,సారక్క జాతర ను దృష్టిలో పెట్టుకుని వచ్చే నెల 25లోగా ఎన్నికలు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు నాగిరెడ్డి చెప్పారు. ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకుంటుంటే తనను విమర్శిస్తున్నారని, కొందరు చెత్త, చెత్తగా మాట్లాడుతున్నారని, తన వద్ద పోలీసులు లేరని, ఉంటే వారిని పోలీస్‌స్టేషన్‌కు పంపేవాడినంటూ వ్యాఖ్యానించారు. కమిషనర్ హోదాలో ఉండి అలా వ్యాఖ్యానించడం ఆయన ఔన్నత్యానికి సరికాదని కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పండుగ తర్వాత నోటిఫికేషన్ ఇవ్వాలని, సాయంత్రం 6 తర్వాత ప్రచారానికి అనుమతించేలా నిబంధనలు సడలించాలని కోరారు. టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి జనగామ మున్సిపల్ కమిషనర్ హాజరయ్యారని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం నేత డీజీ నరసింహారావు డిమాండ్ చేశారు. ఎన్నికలు వాయిదా వేయించేందుకు కాంగ్రెస్ యత్నిస్తోందని టీఆర్ఎస్ ప్రతినిధి గట్టు రామచంద్రరావు అన్నారు. మున్సిపల్ ఎన్నికలను అనుకున్న తేదీల్లో నిర్వహించాలని ఎంఐఎం ఎమ్మెల్సీ సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ కోరారు. ఓటర్ల జాబితా, రిజర్వేషన్లు లేకుండా షెడ్యూల్ విడుదల చేయడం సరికాదని బీజేపీ నేత జి.మనోహర్‌రెడ్డి అభ్యంతరం తెలిపారు. వాయిదా వేయలేం... ఇప్పటికే ప్రకటించిన మేరకు మున్సి పల్ ఎన్నికలుంటాయని, వాటిని వాయిదా వేయలేమని నాగిరెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 30 నాటికి ఓటర్ల జాబితా వెలువడుతుందని, వచ్చే నెల 6వ తేదీకల్లా రిజర్వేషన్లు ఇస్తే 7న నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఒకవేళ ప్రభుత్వం రిజర్వేషన్లు ఇవ్వలేకపోతే నోటిఫికేషన్ జారీ చేయలేమని తెలిపారు. కార్యక్రమంలో విశ్వేశ్వరరావు (టీజేఎస్), బాలమల్లేశ్ (సీపీఐ) రావుల చంద్రశేఖర్‌రెడ్డి (టీడీపీ), నాగరాజు (తెలంగాణ లోక్‌సత్తా) ఇతర పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. ఇష్టారీతిగా వ్యవహరిస్తోంది.. తమ అభిప్రాయాలను పట్టించుకోలేదని, ఈసీ ఇష్టారీతిన, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని, ప్రభుత్వ ఇష్ట ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేసిందని మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నికల కమిషన్ అధికార పార్టీకి, ప్రభుత్వానికి తొత్తులా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రిజర్వేషన్లు ప్రకటించకుండా ఎన్నికలు నిర్వహించడం మొదటిసారి చూస్తున్నామని, అధికార పార్టీకి వత్తాసు పలికేలా నాగిరెడ్డి నియంతలా మాట్లాడుతున్నారని నిరంజన్ విమర్శించారు. -
ప్రాదేశిక ఎన్నికలకు 100 గుర్తులు
మంచిర్యాల రూరల్, న్యూస్‌లైన్ : ప్రాదేశిక ఎన్నికల్లో పోటీచేసే వివిధ పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేయనున్న వారికి కేటాయించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం 100 గుర్తులను ప్రకటించింది. అందులో 17 గుర్తులు ప్రధాన రాజకీయ పార్టీలకు చెందినవి కాగా, మిగిలిన 83 గుర్తులు స్వతంత్రులకు కేటాయించనున్నారు. వరుస క్రమంలో జాతీయ పార్టీలైన బహుజన్ సమాజ్‌పార్టీ-ఏనుగు, బీజేపీ-కమలం, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా-కంకి కొడవలి, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(మార్కిస్టు)-సుత్తి కొడవలి నక్షత్రం, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్-హస్తం, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ-గడియారం గుర్తులు కాగా, రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తించిన వాటిలో టీడీపీకి-సైకిల్, టీఆర్ఎస్-కారు గుర్తులున్నాయి. ఇతర రాష్ట్రాల్లో రిజిస్టరైన ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కగజం-రెండు ఆకులు, జనతాదళ్(సెక్యులర్)-వరి కంకులు తీసుకెళుతున్న మహిళా రైతు, సమాజ్‌వాది పార్టీ- మర్రిచెట్టు, జనతాదళ్(యునెటైడ్)-బాణం, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ-సింహం, రాష్ట్రీయ లోక్‌దళ్-చేతిపంపు గుర్తులున్నాయి. ఇక ఎన్నికల సంఘం వద్ద గుర్తులు రిజర్వ్డ్ చేసుకున్న వాటిలో ఆల్ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తేహదుల్ ముస్లిమీన్-గాలిపటం, లోక్‌సత్తా పార్టీ - ఈల, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ(వైఎస్సార్సీపీ)- ఫ్యాను గుర్తులున్నాయి. పార్టీలుగా రిజిస్టరు చేసుకుని గుర్తులు లేని పార్టీలతోపాటు, స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసే అభ్యర్థుల కోసం 83 గుర్తులను కేటాయించింది. వీటిలో బీరువా, ఆటోరిక్షా, గాలిబుడగ, పండ్ల బుట్ట, బ్యాట్, బ్యాట్స్‌మన్, బ్యాటరీలైట్, బెల్ట్, నల్లబోర్డు, బాటిల్, బ్రెడ్, పెట్టె, చీపురు, బ్రష్, బకెట్, కేక్, క్యాలిక్యులేటర్, కెమెరా, కొవ్వొత్తులు, క్యారంబోర్డు, కార్పెట్, క్యాలీఫ్లవర్, పాదరక్షలు(ఈ గుర్తు జైసమైక్యాంద్ర పార్టీకి కామన్‌గా కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు), చెస్‌బోర్డు, కోటు, కొబ్బరికాయ, మంచం, కప్పు మరియు సాసరు, కటింగ్ ప్లేయర్, కత్తి, డీజిల్ పంపు, డిష్యాంటెన్నా, పల్లకి, విద్యుత్ స్తంభం, కవరు, ఫ్లూటు, గౌను, మూకుడు, గరాటు, గ్యాస్ సిలిండర్, గ్యాస్‌పొయ్యి, గాజుగ్లాసు, ద్రాక్షపండు, హార్మోనియం, టోపీ, హెల్మెట్, హాకీబ్యాటు-బంతి, ఐస్‌క్రీం, ఇస్త్రీపెట్టె, కెటిల్, లేడీపర్సు, పోస్టు డబ్బా, మిక్సీ, నెయిల్కట్టర్, నెక్‌టై, పెన్‌స్టాండ్, పెన్సిల్ ఫార్పనర్, కుండ, ప్రెషర్ కుక్కర్, రేజర్, రిఫ్రిజిరేటర్, ఉంగరం, రంపం, స్కూల్బ్యాగు, కత్తెర, కుట్టుమిషను, షటిల్, పలక, స్టెతస్కోప్, స్టూలు, టేబులు, టేబుల్ బల్బ్, టెలిఫోన్, దూరదర్శిని, టెంట్, టూత్‌బ్రష్, ట్రంపెట్, వయోలిన్, చేతికర్ర, నీటి పంపు, కిటికి గుర్తులు ఉన్నాయి.