ప్రాదేశిక ఎన్నికలకు 100 గుర్తులు
మంచిర్యాల రూరల్, న్యూస్‌లైన్ : ప్రాదేశిక ఎన్నికల్లో పోటీచేసే వివిధ పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేయనున్న వారికి కేటాయించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం 100 గుర్తులను ప్రకటించింది. అందులో 17 గుర్తులు ప్రధాన రాజకీయ పార్టీలకు చెందినవి కాగా, మిగిలిన 83 గుర్తులు స్వతంత్రులకు కేటాయించనున్నారు.
వరుస క్రమంలో జాతీయ పార్టీలైన బహుజన్ సమాజ్‌పార్టీ-ఏనుగు, బీజేపీ-కమలం, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా-కంకి కొడవలి, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా(మార్కిస్టు)-సుత్తి కొడవలి నక్షత్రం, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్-హస్తం, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ-గడియారం గుర్తులు కాగా, రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తించిన వాటిలో టీడీపీకి-సైకిల్, టీఆర్‌ఎస్-కారు గుర్తులున్నాయి.
ఇతర రాష్ట్రాల్లో రిజిస్టరైన ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కగజం-రెండు ఆకులు, జనతాదళ్(సెక్యులర్)-వరి కంకులు తీసుకెళుతున్న మహిళా రైతు, సమాజ్‌వాది పార్టీ- మర్రిచెట్టు, జనతాదళ్(యునెటైడ్)-బాణం, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ-సింహం, రాష్ట్రీయ లోక్‌దళ్-చేతిపంపు గుర్తులున్నాయి. ఇక ఎన్నికల సంఘం వద్ద గుర్తులు రిజర్వ్‌డ్ చేసుకున్న వాటిలో ఆల్‌ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తేహదుల్ ముస్లిమీన్-గాలిపటం, లోక్‌సత్తా పార్టీ - ఈల, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ(వైఎస్సార్‌సీపీ)- ఫ్యాను గుర్తులున్నాయి.
పార్టీలుగా రిజిస్టరు చేసుకుని గుర్తులు లేని పార్టీలతోపాటు, స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసే అభ్యర్థుల కోసం 83 గుర్తులను కేటాయించింది. వీటిలో బీరువా, ఆటోరిక్షా, గాలిబుడగ, పండ్ల బుట్ట, బ్యాట్, బ్యాట్స్‌మన్, బ్యాటరీలైట్, బెల్ట్, నల్లబోర్డు, బాటిల్, బ్రెడ్, పెట్టె, చీపురు, బ్రష్, బకెట్, కేక్, క్యాలిక్యులేటర్, కెమెరా, కొవ్వొత్తులు, క్యారంబోర్డు, కార్పెట్, క్యాలీఫ్లవర్, పాదరక్షలు(ఈ గుర్తు జైసమైక్యాంద్ర పార్టీకి కామన్‌గా కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు), చెస్‌బోర్డు, కోటు, కొబ్బరికాయ, మంచం, కప్పు మరియు సాసరు, కటింగ్ ప్లేయర్, కత్తి, డీజిల్ పంపు, డిష్‌యాంటెన్నా, పల్లకి, విద్యుత్ స్తంభం, కవరు, ఫ్లూటు, గౌను, మూకుడు, గరాటు, గ్యాస్ సిలిండర్, గ్యాస్‌పొయ్యి, గాజుగ్లాసు, ద్రాక్షపండు, హార్మోనియం, టోపీ, హెల్మెట్, హాకీబ్యాటు-బంతి, ఐస్‌క్రీం, ఇస్త్రీపెట్టె, కెటిల్, లేడీపర్సు, పోస్టు డబ్బా, మిక్సీ, నెయిల్‌కట్టర్, నెక్‌టై, పెన్‌స్టాండ్, పెన్సిల్ ఫార్పనర్, కుండ, ప్రెషర్ కుక్కర్, రేజర్, రిఫ్రిజిరేటర్, ఉంగరం, రంపం, స్కూల్‌బ్యాగు, కత్తెర, కుట్టుమిషను, షటిల్, పలక, స్టెతస్కోప్, స్టూలు, టేబులు, టేబుల్ బల్బ్, టెలిఫోన్, దూరదర్శిని, టెంట్, టూత్‌బ్రష్, ట్రంపెట్, వయోలిన్, చేతికర్ర, నీటి పంపు, కిటికి గుర్తులు ఉన్నాయి.