సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: తొలివిడత ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఆసక్తి చూపడంతో పోలింగ్ శాతం భారీగా నమోదైంది. అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా ఉండటంలో ఓటర్లను ప్రలోభపెట్టటానికి విశ్వప్రయత్నాలు చేశారు. దీంతో అక్కడక్కడా స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పలుచోట్ల కాంగ్రెస్, టీడీపీ నాయకులు డబ్బు పంచుతూ ప్రజలకు దొరికిపోయారు.
తొలివిడతలో 24 జెడ్పీటీసీ, 349 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 81.83శాతం పోలింగ్ నమోదైంది. కాశీపూర్ గ్రామంలోని 43వ పోలింగ్ కేంద్రంలో ఎన్నికల కమిషన్ రీపోలింగ్‌కు ఆదేశించింది. బ్యాలెట్ పేపరుపై అభ్యర్థుల పేరు తప్పుగా ముద్రించడమే రీపోలింగ్‌కు కారణం. ఈనెల 11న రీపోలింగ్ నిర్వహిస్తామని జిల్లా ఎన్నికల అధికారి స్మితాసబర్వాల్ తెలిపారు. పగటి ఉష్ణోగ్రత 42 డిగ్రీలు ఉండటంతో వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
దాదాపు పది మందికి పైగా వడదెబ్బ బారినపడ్డారు. ఇదిలాఉండగా కంగ్టి మండలం గర్డేగాం గ్రామం రక్తమోడింది. దాదాపు 20 నిమిషాల పాటు పోలింగ్ నిలిచిపోయింది. మునిపెల్లి మండలం తాడిపల్లి గ్రామంలో ఎస్‌ఐ నారాయణరెడ్డి ఓవర్ యాక్షన్ తో కొంతమంది మహిళా ఓటర్లు భయపడి ఓటు వేయకుండానే వెనుదిరిగిపోయారు.
చెర్లగూడెం ఎంపీటీసీ పరిధిలోని కాశీపూర్‌లో బ్యాలెట్ పత్రాలపై పేర్లు తప్పుగా ముద్రిం చారు. స్థానిక అభ్యర్థుల పేర్లకు బదులుగా పోతిరెడ్డిపల్లికి చెందిన అభ్యర్థులు పేర్లు ముద్రించారు. 187 ఓట్లు పడిన తరువాత అధికారులు గుర్తించారు. దీంతో 43 నంబర్ బూత్‌లో రీపోలింగ్‌కు ఈసీ ఆదేశించింది.కంగ్టి మండలం గరిడేగాంలో ఓ వ్యక్తి ఓటు వేసే విషయంలోకాంగ్రెస్,టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రెండు వర్గాలు ఒకరినొకరు తోసుకున్నారు. పరస్పరం రాళ్లు విసురుకోవడంతో దాదాపు నలుగురు గాయపడ్డారు.
మునిపల్లి మండలం తాడిపల్లి పోలింగ్ కేంద్రంలో ఎస్‌ఐ నారాయణ రెడ్డి ఓటర్లను తీవ్ర భయాందోళనకు గురి చేశారు. ఆయన పోలింగ్‌కేంద్రంలో కూర్చొని వచ్చిపోయే ఓటర్లను చిత్రీకరిస్తుండటంతో ఓటర్లు ఓటు వేయడానికి బయడ్డారు. కొందరు ఓటు వేయకుండానే వెనుదిరిగిపోయారు. అంతకు ముందు రాత్రే పోలీసులపై తాడిపల్లి గ్రామస్థులు తిరగబడిన విషయం తెలిసిందే. ఎస్‌ఐ తీరుపై అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
కొండపాక మండల కేంద్రంలో దమ్మక్కపల్లిలో శనివారం రాత్రి టీఆర్‌ఎస్‌కు చెందిన ఓ కార్యకర్త డబ్బు పంచుతుండగా కాంగ్రెస్ వాళ్లు పట్టుకున్నారు. తిరిగి అదే వ్యక్తి పోలింగ్ కేంద్రం వద్ద కనిపించడంతో కాంగ్రెస్ వాళ్లు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. దీంతో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒకరినొకరు తోసుకున్నారు. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో పోలీసులు స్వల్పంగా లాఠీ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.
వట్టిపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు ఓటర్లకు డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుండగా టీడీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.
మిరుదొడ్డి మండలం మోతెలో శనివారం అర్ధరాత్రి కాంగ్రెస్ అభ్యర్థి పంచిన మద్యం, డబ్బు గొడవకు దారి తీసింది. ఆదివారం కొంతమంది మహిళలు కాంగ్రెస్ అభ్యర్ధిపై గొడవకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. పరిస్థితి సద్దుమణిగింది. గ్రామంలో అదనపు పోలీసులు బలగాలను మోహరించారు.
మిరుదొడ్డిలో ఓటు వేసేందుకు వచ్చిన నలుగురు ఓటర్లు.. ఎండవేడిని తట్టుకోలేక అస్వస్థకు గురయ్యారు. వారిని ప్రభుత్వ ఆస్పత్రిలోకి తీసుకెళ్లి వైద్యం చేయించారు.జిల్లాలో మొత్తం 1,149 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాలకు వెబ్‌క్యామ్ పెట్టి ఆన్‌లైన్‌తో అనుసంధానం చేసి పర్యవేక్షిస్తామని కలెక్టర్ చెప్పారు. కానీ 300 పోలింగ్ కేంద్రాల్లోనే వెబ్ క్యామ్ ఏర్పాటు చేశారు.
దీని వల్ల పోలింగ్ కేంద్రాల్లో ఏం జరిగిందో తెలియకుండా పోయింది. ఇంజినీరింగ్ విద్యార్థులకు పరీక్షలు ఉండటం వల్ల ఎన్నికల విధులకు వారు రాలేకపోయారని, అందుకోసమే అన్ని పోలింగ్ కేంద్రాలకు వెబ్ సిస్టమ్ అమలు చేయలేకపోయామని అధికారులు చెప్పడం గమనార్హం.
తొలి విడత పోరులో పోలింగ్ 81.83 %
Published Mon, Apr 7 2014 12:11 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement