సాక్షి, రంగారెడ్డి జిల్లా: తొలిదశ ప్రాదేశిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికల ప్రక్రియ శాంతియుత వాతావరణంలో జరిగింది. తొలివిడతలో 16 మండలాల్లోని 303 ఎంపీటీసీ స్థానాలు, 16 జెడ్పీటీసీ స్థానాలున్నాయి. అయితే ఇప్పటికే 3 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కావడంతో 300 ఎంపీటీసీ, 16 జెడ్పీటీసీ స్థానాలకు ఆదివారం ఎన్నికలు నిర్వహించారు.
1,110 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. తొలివిడతలో భాగంగా 16 మండలాల్లో 9,51,162 మంది ఓటర్లుండగా.. వీరిలో 6,81,032 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. 71.6 శాతం పోలింగ్ నమోదైంది. ధారూరు రెండో వార్డులో ఏజెంట్లు దగ్గరుండీ మరీ ఓటు వేయిస్తున్నారంటూ పలువురు ఆందోళనకు దిగడంతో అరగంటపాటు పోలింగ్ నిలిచిపోయింది. ఇదే మండలం మైలారంలో పోలింగ్ సిబ్బందితో కొందరు యువకులు వాగ్వాదానికి దిగడంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
వడివడిగా కదిలి..
జిల్లాలో ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఉత్సాహంగా సాగింది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండడంతో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు నూతనోత్సాహంతో ముందుకు వచ్చారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 9గంటల ప్రాంతంలో 13 శాతం పోలింగ్ నమోదైంది.
ఆ తర్వాత ఓటింగ్ ప్రక్రియ ఊపందుకుంది. దీంతో ఉదయం 11 గంటల ప్రాంతంలో 31.1 శాతం ఓట్లు పోలయ్యాయి. ఆ తర్వాత ఎండ తీవ్రత పెరగడంతో కొంత మందకొడిగా సాగిం ది. దీంతో ఒంటిగంట ప్రాంతంలో పోలింగ్ 46.23 శాతానికి చేరింది. ఆ తర్వాత మూడు గంటల ప్రాంతంలో 60.23 శాతం ఓట్లు పోలయ్యాయి. చివరి రెండుగంటల్లో ఓటింగ్ ప్రక్రియ వేగవంతమైంది. ఓటింగ్ ముగిసే సమయానికి జిల్లాలో 71.6 శాతం పోలింగ్ నమోదైంది. 16 మండలాల్లో పోలింగ్ పరిశీ లిస్తే.. తాండూరు మండలంలో అతి ఎక్కువగా 82.3శాతం ఓట్లు పోల య్యాయి. కుత్బుల్లాపూర్ మండలంలో 50 శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది.
అంచనాల్లో బిజీ!
దాదాపు పది రోజులుగా ప్రచారంలో మునిగిన అభ్యర్థులు.. ఆదివారం సాయంత్రంతో నాలుగుగోడల మధ్యకు వెళ్లిపోయారు. సాయంత్రం పోలింగ్ ప్రక్రియ పూర్తైది. ఫలితాలు వచ్చేనెలలో వెలువడనున్నాయి. దీంతో పోలింగ్ సరళిని బట్టి గెలుపోటములు ఎలా ఉంటాయనే కోణంలో అభ్యర్థులు అంచనాలు వేస్తున్నారు. దాదాపు మూడేళ్లు ఆలస్యంగా ప్రాదేశిక ఎన్నికలు జరుతుండడం.. రాజకీయంగా భారీ మార్పులు చోటుచేసుకోవడంతో ఫలితాలు ఎలా ఉంటాయనేది అభ్యర్థులకు సైతం అంతుచిక్కడం లేదు. మరోవైపు తుదివిడత మండలాల్లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నెల 11న తుది విడత పోలింగ్‌కు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
తొలిదశ ప్రశాంతం
Published Sun, Apr 6 2014 11:08 PM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement
Advertisement