సాక్షి, ఖమ్మం: జెడ్పీటీసీ, ఎంపీటీసీ తొలివిడత ఎన్నికలు ఆదివారం ముగిశాయి. స్వల్ప ఉద్రిక్తతలు...ఆందోళనల నడుమ పోలింగ్ కొనసాగింది. ఓటర్ల జాబితాలతో పాటు అభ్యర్థుల గుర్తులు గల్లంతు కావడం, ఓటర్లు, నాయకులకు మధ్య వాగ్వాదాలు, ఓటర్లను పోలీసులు కొట్టడం తదితర ఘటనలతో పోలింగ్ జరిగింది.
తొలివిడతలో భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం డివిజన్ల పరిధిలోని 27 జెడ్పీటీసీ, 357 ఎంపీటీసీలకు పోలింగ్ జరిగింది. ఉదయం కొంత మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ ఆ తర్వాత ఊపందుకుంది.ఎండతీవ్రత పెరిగినా ఓటర్లు అలాగే క్యూలో నిల్చొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహిళలు, పురుషులు, వృద్ధులు సైతం ఎంతో ఓపికగా ఓటు కోసం నిరీక్షించారు. కొన్నిచోట్ల పోలింగ్ కేంద్రాలలో కనీసం టెంట్లు కూడా ఏర్పాటు చేసే పరిస్థితి లేకపోవడంతో ఓటర్లు ఎండలో మాడిపోయారు.
తొలి విడత పోలింగ్ ముఖ్యాంశాలివి...
కారేపల్లి మండలం మాదారం పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి వచ్చిన బుడిగ జంగాలకు, కాంగ్రెస్ పార్టీ కార్యర్తలకు మధ్య క్యూలైన్ విషయంలో వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ వారు బుడిగజంగాలపై దాడి చేయడంతో ఆరుగురికి గాయాలయ్యాయి.
ఈ ఘటనతో జంగాలు ఓటు వేసేందుకు నిరాకరించి వెనుదిరిగారు. ఇల్లెందు డీఎస్పీ అక్కడకు చేరుకొని ఇరువర్గాలను శాంతింపజేశారు. ఆ తర్వాత పార్టీల నాయకులు బుజ్జగించడంతో తిరిగి వారు ఓటేశారు.ఇల్లెందు మండలం ధనియాలపాడు పోలింగ్ కేంద్రంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ (చంద్రన్న వర్గం) జెడ్పీటీసీ అభ్యర్థి బయ్యా శారద కత్తెర గుర్తుకు బదులు కుట్టుమిషన్‌ను పోలింగ్ కేంద్రం వద్ద అంటించారు.
సదరు అభ్యర్థి అనుచరులు పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళన చేశారు. ఏజెంట్లు ఆలస్యంగా రావడంతో ఇక్కడ 7.30 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. రాఘబోయినగూడెంలోని 46వ నంబర్ పోలింగ్ కేంద్రంలో ఉదయం 9 గంటల వరకు ఒక్కఓటూ పడలేదు.గ్రామ సమస్యలను ఏ నాయకుడు పట్టించుకోలేదని ఇల్లెందు మండలం కొమ్ముగూడెంలో 315 మంది ఓటర్లు పోలింగ్‌ను బహిష్కరించారు.
బయ్యారం మండలం ఉప్పలపాడులో టీఆర్‌ఎల్డీ జిల్లా అధ్యక్షుడు మట్టిపల్లి రమేష్ పోలింగ్ బూత్‌లోకి వెళ్తుండగా సీఐ జైపాల్ అడ్డుకున్నారు. సీఐ, రమేశ్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. రమేశ్‌కు మద్దతుగా కొంతమంది పోలింగ్‌కేంద్రం వద్దకు రావడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. రమేశ్‌ను స్టేషన్‌కు తరలించారు.
వాజేడు మండలం కూసూరు నుంచి ట్రాక్టర్‌లో ఎడ్చర్లపల్లి పోలింగ్ కేంద్రానికి వెళ్తున్న ఓటర్లను పోలీసులు కొట్టారు. ట్రాక్టర్లలో పోలింగ్ కేంద్రానికి తరలించడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమన్నారు. పోలీసులు కొట్టడంతో పోలింగ్ కేంద్రం ముందు సుమారు 200 మంది ధర్నా చేశారు. ఎస్‌ఐని సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. ఇదే మండలం లక్ష్మీపురం పోలింగ్ కేంద్రంలో ఇద్దరు వ్యక్తులు ఘర్షణ పడడంతో పోలింగ్ అరగంటపాటు నిలిచిపోయింది. దుమ్ముగూడెం మండలం అంజిబాకలో సాయంత్రం ఎక్కువ మంది పోలింగ్ కేంద్రానికి వచ్చారు. రాత్రి 7 గంటల వరకు పోలింగ్ సాగింది.
అశ్వారావుపేటలో పోల్ స్లిప్పులు అందజేయలేదని ఓటర్లు అంగన్‌వాడీ కార్యకర్తలతో వాగ్వాదం చేశారు. అశ్వారావుపేట మండలం నారాయణపురం, పండువారిగూడెంలో ఓటర్ల జాబితా తారుమారు కావడంతో ఉదయం 8.30 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. దమ్మపేట మండలం గొల్లగూడెంలో క్యూలో నిల్చున్న ఇద్దరు యువతులు ఎండ వేడిమికి తాళలేక సొమ్మసిల్లి పడిపోయారు. ఇదే మండలం పట్వారిగూడెంలో పోల్ స్లిప్పులు అందలేదని పోలింగ్ కేంద్ర వద్ద ఓటర్లు ఆందోళన చేశారు.
ముల్కలపల్లి మండలం జగన్నాథపురం పంచాయతీ పరిధిలోని రేగులకుంటలో సమస్యలను పరిష్కరించలేదని గ్రామస్తులు ఓట్లను బహిష్కరించారు. అక్కడి పంచాయతీ సర్పంచ్ సముదాయించడంతో మళ్లీ ఓట్లు వేశారు. చండ్రుగొండ, ఎర్రగుంటలో ఓటర్లు భారీగా తరలిరావడంతో సాయంత్రం 5 గంటలలోపు పోలింగ్ కేంద్రంలోకి వచ్చిన వారిని ఓటు వేసేందుకు అనుమతించారు. రాత్రి 8 గంటల వరకు పోలింగ్ సాగింది.
కొత్తగూడెం పాలకేంద్రంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ శ్రీనివాసశ్రీనరేశ్, ఎస్పీ రంగనాథ్ పరిశీలించారు. కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో 45 డిగ్రీల ఎండ వేడిలోనూ ఓటర్లు భారీగా క్యూలో నిల్చుని ఓటు వేశారు. సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లిలో ఎండతీవ్రతకు ఓటర్లు ఇబ్బంది పడ్డారు.
కామేపల్లి మండలం పాతలింగాలలో మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, ఇల్లెందు మండలం సుదిమళ్లలో ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య, అశ్వారావుపేట మండలం మామిళ్లవారిగూడెంలో ఎమ్మెల్యే వగ్గెల మిత్రసేన , చుంచుపల్లిలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తొలివిడత 80 శాతం
Published Mon, Apr 7 2014 2:03 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement