సాక్షి, మంచిర్యాల : జిల్లాలో రాజకీయ వాతావరణం ఆసక్తికరంగా మారుతోంది. జిల్లాలోని ముఖ్య పార్టీల నేతలు పదవుల పందేరం, బాధ్యతల స్వీకరణలో బిజీగా మారుతున్నారు. అధికార టీఆర్‌ఎస్ పార్టీ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ సింగపూర్ పర్యటన తర్వాత జరగబోయే పదవుల పంపకంపై కోటి ఆశలతో ఉన్నారు. కేసీఆర్ రాజీనామాతో త్వరలో జరగబోయే మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు భాగస్వాములు కావాలని పలువురు కాంగ్రెస్ నాయకులకు ఇప్పటికే సమాచారం అందింది.
మరోవైపు కేంద్ర ప్రభుత్వంతోపాటు టీటీడీ బోర్డు సభ్యుల పదవులు ఇస్తామని హామీని కొందరు తెలుగుదేశం తమ్ముళ్లు ఇప్పటికే పొందారు. 2014లో బీజేపీని గెలుపుతీరాలకు చేర్చిన పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పర్యటనకు బీజేపీ నాయకులు సిద్ధం అవుతున్నారు.
సారొచ్చాకే సంబరాలు
ముఖ్యమంత్రి హోదాలో సీఎం కేసీఆర్ సింగ పూర్ పర్యటనకు వెళ్లి 24తేదీన హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది. ఆ త ర్వాత పెద్ద ఎత్తున నాయకుల చేరికలకు గులాబీ పార్టీ రంగం సిద్ధం చేసింది. ఈ తంతు ముగిసిన తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంది.
జిల్లాలో మంత్రి పదవి రేసులో సీరియస్‌గా వినిపిస్తున్న మహిళా ఎమ్మెల్యేతోపాటు మరో సీనియర్ ఎమ్మెల్యే కూడా ఈ కబురు కోసం ఎదురు చూస్తున్నారు. దీంతోపాటు ఎమ్మెల్సీ, మార్కెట్ కమిటీ చైర్మన్ వంటి నామినేటెడ్ పోస్టుల పందేరం అప్పుడే కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. పార్టీలో చేరిన ముఖ్య నేతలతోపాటు ఇన్నాళ్లు పార్టీకి సేవ చేసిన నాయకుల వివరాలని సమీక్షించి నామినేటెడ్ ఖాళీలు భర్తీ చేస్తారని పదవిపై కొండంత ఆశతో ఉన్న జిల్లా నాయకుడొకరు వివరించారు. సీఎం వచ్చాకే సంబరాలు ఉంటాయని గులాబీదళం భావిస్తోంది.
తమ్ముళ్లకు బంపర్ ఆఫర్
తెలంగాణలో దాదాపు ప్రశ్నార్థకంగా మారిన టీడీపీ శ్రేణులను ఖుషీ చేసే ప్రక్రియకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఇటీవల జిల్లా బాధ్యులతోపాటు పలువురు నియోజకవర్గ ఇన్‌చార్జీలతో ఆయన సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పలు బోర్డుల్లో మెంబర్ అవకాశం కల్పిస్తామని వారికి బాబు భరోసా ఇచ్చారు. త్వరలో భర్తీ చేయబోయే తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుల నియామకంలో జిల్లాకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాకు చెందిన ఓ నాయకుడికి ఈ మేరకు గట్టి హామీ దొరికినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ క్రెడిట్ దక్కించుకుందాం
తెలంగాణ రాష్ట్రం కలను సాకారం చేసిన కాంగ్రెస్ పార్టీ ఆ ఫలాలను పొందేందుకు తాజా అవకాశానికి వ్యూహరచన చేస్తోంది. వచ్చేనెల 13న జరగనున్న మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికను ఇందుకు ఉపయోగించుకోవాలని భావిస్తోంది. సీఎం కేసీఆర్ రాజీనామాతో జరగనున్న ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఇటీవలి సమావేశంలో నేతలకు సూచించారు. జిల్లాలోని నాయకులు బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుందని ఆ సందర్భంగా లక్ష్మయ్య పేర్కొన్నారు. పార్టీకి కీలకమైన ఈ ఎన్నికకు పనిచేసే వారి వివరాలు ఇవ్వాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చారు.
కొత్త నాయకుడి భేటీకి సిద్ధం
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియామకం అయిన అమిత్‌షా నేడు(గురువారం) హైదరాబాద్‌కు రానున్నారు. కార్యకర్తల సమావేశం తర్వాత రాష్ట్రాస్థాయి నేతలతో సమావేశం ఏర్పాటు చేసి పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం చేయనున్నారు. దీంతో పాటు మెదక్ పార్లమెంటు ఉప ఎన్నికలో విజయ సూత్రాలు బోధించే అవకాశం ఉంది. జాతీయస్థాయి కమలం వికసించేందుకు ముఖ్య కారకుడిగా భావిస్తున్న షా ఏం చెప్తారో అనే ఆసక్తి కాషాయదళంలో నెలకొంది. మొత్తంగా జిల్లాలో అన్నిపార్టీల్లోనూ సందడి నెలకొంది.
సర్వం సందడి
Published Thu, Aug 21 2014 1:56 AM | Last Updated on Mon, Sep 17 2018 4:56 PM
Advertisement