Cabinet expansion KCR
-
CM KCR : తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ విస్తరణపై ఇంకా సస్పెన్స్
హైదరాబద్: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ విస్తరణపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రభుత్వ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు మంత్రివర్గ విస్తరణపై గవర్నర్ కార్యాలయానికి ప్రగతి భవన్ నుంచి లేఖ వెళ్లింది. ప్రమాణస్వీకారానికి సమయం ఇవ్వాలని గవర్నర్ ను ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి విజ్ఞప్తి వచ్చింది. అయితే సీఎంవో లేఖపై రాజ్ భవన్ కార్యాలయం నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. గవర్నర్ ఆఫీస్ నుంచి షెడ్యూల్ రాగానే కొత్త మంత్రితో ప్రమాణస్వీకారం చేయాలని కేసీఆర్ ప్రభుత్వం భావిస్తోంది. ఈటల స్థానంలో పట్నం ప్రస్తుతానికి ఉన్న సమాచారం మేరకు క్యాబినెట్ విస్తరణను ఒకరికే పరిమితం చేయనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ మంత్రివర్గంలో 18మందికి అవకాశం ఉంది. ప్రస్తుతం 17 మంది మంత్రులు ఉన్నారు. ఖాళీగా ఉన్న ఈటల స్థానంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి అవకాశం ఇస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఒక వేళ గంపా గోవర్ధన్ ను కేబినెట్ లోకి తీసుకోవాలని భావిస్తే.. ప్రస్తుతమున్న వారిలో ఒకరిని పక్కనపెట్టే అవకాశముంది. పాండిచ్చేరి నుంచి హైదరాబాద్ నిన్న పాండిచ్చేరిలో ఉన్న గవర్నర్ తమిళిసైకు మంత్రి వర్గ విస్తరణ గురించి సమాచారం అందించడంతో హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. అదే సమాచారాన్ని ట్విట్టర్ లో పంచుకున్నారు గవర్నర్. Reached Hyderabad in the afternoon for engagements in Telangana today and tomorrow — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) August 21, 2023 ఇది కూడా చదవండి: మంత్రివర్గంలోకి ‘పట్నం’.. రేపు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం -
మంత్రులుగా ప్రమాణ స్వీకారం
-
జిల్లాకు మొండిచేయి
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సీఎం కేసీఆర్ ముహూర్తం నిర్ణయించారు. కొత్తగా 9 మంది శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. పూర్వపు మెదక్ జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలకు గాను, సంగారెడ్డి మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లోనూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. సిద్దిపేట నుంచి హరీశ్‌రావు వరుసగా ఆరో పర్యాయం విజయం సాధించడంతో పాటు, ఏకంగా లక్షకు పైగా ఓట్ల మెజారిటీ సాధించారు. మరోవైపు టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తూ వచ్చిన శాసనసభ్యులు పద్మా దేవేందర్‌రెడ్డి, సోలిపేట రామలింగారెడ్డి కూడా మంత్రివర్గంలో చోటు ఆశించారు. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఏ ఒక్క శాసనసభ్యుడికి మంత్రివర్గంలో చోటు దక్కక పోవడంపై చర్చ జరుగుతోంది. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : గజ్వేల్ నుంచి వరుసగా రెండోసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన కేసీఆర్ గత ఏడాది డిసెంబర్ 13న వరుసగా రెండోసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం కేసీఆర్‌తో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ హోం శాఖ మంత్రి బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన సుమారు రెండు నెలల తర్వాత తాజాగా సీఎం కేసీఆర్ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు మంగళవారం ముహూర్తం నిర్ణయించారు. మంత్రివర్గ విస్తరణలో తొమ్మిది మంది శాసనసభ్యులకు మంత్రి పదవి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని పది అసెంబ్లీ స్థానాలకు గాను, గత ఏడాది డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తొమ్మిది చోట్ల విజయం సాధించింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి కేబినెట్లో ఎవరికి చోటు దక్కుతుందనే అంశంపై చర్చ జరుగుతోంది. ఉద్యమనేతగా, నీటి పారుదల, మార్కెటింగ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా మంచి పనితీరు కనబరిచిన హరీశ్‌రావుకు మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కుతుందని భావించారు. పిన్న వయసులోనే వరుసగా ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన రికార్డుతో పాటు, ఏకంగా లక్షా ఇరువై వేల మెజారిటీతో విజయం సాధించిన ఘనత హరీశ్ సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలో ఆయనకు ప్రాధాన్యత ఉన్న శాఖ దక్కుతుందని భావించినా, తాజా విస్తరణలో చోటు దక్కే సూచనలు కనిపించడం లేదు. మరో ఇద్దరు నేతలకు నిరాశ టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పనిచేస్తూ, అసెంబ్లీకి నాలుగో పర్యాయం ఎన్నికైన దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కూడా మంత్రివర్గంలో చోటు ఆశించారు. మరో ఉద్యమ నేత, అసెంబ్లీకి మూడో పర్యాయం ఎన్నికైన మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి కూడా మంత్రి పదవి దక్కుతుందని భావించారు. సీఎం కేసీఆర్ ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో, హరీశ్‌తో సహా ఇతర ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఇవ్వడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ నేతృత్వంలో ఏర్పాటైన తొలి మంత్రివర్గంలో హరీశ్‌కు చోటు కల్పించిన విషయాన్ని ఆయన అనుచరులు ప్రస్తావిస్తున్నారు. 70వ దశకం తర్వాత ఇదే తొలిసారి ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి 1970వ దశకం నుంచి ఏర్పాటైన ప్రతీ మంత్రిమండలిలోనూ జిల్లాకు చెందిన శాసనసభ్యులకు మంత్రి పదవులు దక్కిన విషయాన్ని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. 1970వ దశకంలో పీవీ నర్సింహారావు, జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి, భవనం వెంకట్రాం, అంజయ్య, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మంత్రివర్గాల్లో జిల్లా నుంచి మదన్ మోహన్ ప్రాతినిధ్యం వహించారు. మర్రి చెన్నారెడ్డి తొలిసారిగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన సందర్భంలోనూ మదన్‌మోహన్‌తో పాటు బాగారెడ్డికి మంత్రి పదవి దక్కింది. టి.అంజయ్య జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించిన సందర్భంలోనూ మదన్మోహన్కు మంత్రి పదవి దక్కింది. 1983, 85లో ఎన్టీఆర్ మంత్రివర్గంలో కరణం రామచంద్రరావు, 1989లో మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మంత్రి వర్గాల్లో గీతారెడ్డి ప్రాతినిధ్యం వహించారు. కొంతకాలం పి.రామచంద్రారెడ్డి కూడా కోట్ల మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహించారు. 1994 నాటి ఎన్టీఆర్ కేబినెట్లో కరణం రామచంద్రరావు, ఆ తర్వాత చంద్రబాబు నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గంలో కరణం, ముత్యంరెడ్డి, బాబూమోహన్ పనిచేశారు. ప్రస్తుత సీఎం కేసీఆర్ అటు ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్లోనూ కొంతకాలం మంత్రిగా పనిచేశారు. 2004 నుంచి 2014 మధ్యకాలంలో వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో గీతారెడ్డి, ఫరిదుద్దీన్, దామోదర రాజనర్సింహ, సునీత లక్ష్మారెడ్డి మంత్రులుగా పనిచేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి మంత్రివర్గంలో ఏ ఒక్కరికీ చోటు దక్కకపోవడం ఆరు దశాబ్దాల్లో ఇదే తొలిసారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. -
మంత్రిగా ‘ఎర్రబెల్లి’కి అవకాశం
-
మంత్రి వర్గంలో ‘ఎర్రబెల్లి’కి చోటు
రాష్ట్ర కేబినెట్లో జిల్లా నుంచి ఒక్కరికే అవకాశం రావడంతో మంత్రి వర్గంలో చోటుదక్కుతుందని భావించిన ఆశావహులకు నిరాశే ఎదురైంది. ఉమ్మడి వరంగల్‌లో 12 నియోజకవర్గాలు ఉండగా పది స్థానాలను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలుచుకున్నారు. గత ప్రభుత్వంలో స్పీకర్‌తోపాటు రెండు మంత్రి పదవులు జిల్లాను వరించాయి. ఈ సారి ఒక్క పదవి మాత్రమే దక్కడంతో మిగతా వారికి కార్పొరేషన్ల చైర్మన్, ప్రభుత్వ విప్, పార్లమెంటరీ కార్యదర్శి పదవుల్లో అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. సాక్షి, వరంగల్ రూరల్ : రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. అమాత్య పదవులు ఎవరిని వరించబోతున్నాయన్న ఊహగానాలకు ఎట్టకేలకు తెరపడింది. మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు కల్పించాలనే విషయమై పూర్తి స్థాయి కసరత్తు అనంతరం జాబితాను సిద్ధం చేశారు. అందులో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పాలకుర్తి శాసన సభ్యుడు ఎర్రబెల్లి దయాకర్‌రావుకు చోటు లభించినట్లు సీఎం కార్యాలయం నుంచి ఆయనకు ఫోన్ కాల్ వచ్చింది. నేడు ప్రమాణ స్వీకారం ఈనెల 19న మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్ ఈ విషయమై గవర్నర్ నరసింహన్‌కు తెలియజేశారు. ఉదయం 11:30 గంటలకు రాజ్ భవన్లో మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. మంత్రి వర్గ విస్తరణ చేపట్టనుండడంతో ఇప్పటి వరకు ఉత్కంఠగా ఎదురుచూసిన ఆశావహులు పదవి దక్కించుకోవడానికి, అందులోనూ అనుకున్న శాఖ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గత కేబినెట్లో స్పీకర్, రెండు మంత్రి పదవులు.. తెలంగాణ రాష్ట్ర తొలి కేబినెట్లో జిల్లాకు స్పీకర్, రెండు మంత్రి పదవులు దక్కాయి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, స్పీకర్‌గా సిరికొండ మధుసూదనాచారికి అవకా శం దక్కింది. తర్వాత డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా రాజయ్య పదవి కోల్పోవడంతో ఆయన స్థానంలో కడియం శ్రీహరికి ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రిగా అవకాశం కల్పించారు. డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించగా రెండో సారి సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన సమయంలో మహమూద్ అలీతో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మం త్రి వర్గ విస్తరణ చేయలేదు. ప్రస్తుతం ముహూర్తం ఖరారు కావడంతో ఉత్కంఠకు తెరపడింది. మంత్రిగా ‘ఎర్రబెల్లి’కి అవకాశం పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుకు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు రావాల ని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ ద్వారా సమాచారం అందింది. తొలి సారిగా మం త్రి వర్గంలో దయాకర్‌రావుకు చోటు దక్కింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాలకు 10 స్థానాలను టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. అందులో వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా నన్నపునేని నరేందర్, పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, వర్ధన్నపేట అరూరి రమేష్, పాలకుర్తి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మహబూబాబాద్ శంకర్‌నాయక్, డోర్నకల్ రెడ్యానాయక్, నర్సంపేట పెద్ది సుదర్శన్‌రెడ్డి, పరకాల చల్లా ధర్మారెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్ డాక్టర్ రాజయ్య, జనగామ యాదగిరిరెడ్డి ఎన్నికయ్యారు. అయితే మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితోపాటు ఎమ్మెల్యేలు దయాకర్‌రావు, ధరంసోత్ రెడ్యానాయక్, వినయ్‌భాస్కర్, అరూరి రమేష్‌లకు మంత్రి వర్గంలో చోటు లభిస్తుందని ప్రచారం జరిగింది. తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఒక్క ఎర్రబెల్లి దయాకర్‌రావుకే మంత్రి పదవి దక్కడం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేగా డబుల్ హ్యాట్రిక్.. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరికి చెందిన ఎర్రబెల్లి దయాకర్‌రావు 1982లో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు. 1994లో జరిగిన సాధారణ ఎన్నికల్లో వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 1999లో రెండోసారి, 2004లో మూడో సారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1999లో నాటి చంద్రబాబు ప్రభుత్వంలో ప్రభుత్వ విప్‌గా పని చేశారు. ఆ తరువాత 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన తరువాత పాలకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. 2009 ఎన్నికల్లో పాలకుర్తి నుంచి నాలుగోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికలతోపాటు 2018లో జరిగిన ఎన్నికల్లో వరుసగా వరుసగా ఆరో సారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 ఎన్నికల తరువాత టీడీఎల్పీ నేతగా వ్యహరించారు. 2016లో టీడీపీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో 53,062 ఓట్ల భారీ మెజార్టీ విజయం సాధించారు. హైదరాబాద్‌లోనే దయాకర్‌రావు మంత్రివర్గ విస్తరణ మంగళవారం జరుగుతున్న నేపథ్యంలో పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు హైదరాబాద్‌లోనే ఉన్నారు. కశ్మీర్లో ఇటీవల ఉగ్రవాదులు జరిపిన దాడిలో వీరమరణం పొందిన సీఆర్పీఎఫ్ జవాన్లుకు తన సాయంగా రూ.2.50లక్షల చెక్‌ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సోమవారం అందించారు. ఇదే సందర్భంలో కేటీఆర్ ఎర్రబెల్లికి ముందస్తు అభినందలు తెలిపినట్లు సమాచారం. ఇది జరిగిన కొన్ని నిమిషాల తేడాతోనే ప్రగతి భవన్ నుంచి ఫోన్ రావడంతో ఆయన రాజధానిలోనే ఉన్నారు. మండలి చైర్మన్‌గా కడియం? గత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన కడియం శ్రీహరికి శాసన మండలి చైర్మన్‌గా అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత మండలి చైర్మన్ స్వామిగౌడ్ ఎమ్మెల్సీ పదవీ కాలం త్వరలో ముగియనుండడంతో ఆ స్థానం కడియంకు దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. డోర్నకల్ ఎమ్మెల్యే ధరంసోత్ రెడ్యానాయక్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌లకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవులు, ప్రభుత్వ విప్, పార్లమెంటరీ కార్యదర్శి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎర్రబెల్లి దయాకర్‌రావు బయోడేటా.. పూర్తి పేరు: ఎర్రబెల్లి దయాకర్‌రావు తండ్రి : ఎర్రబెల్లి జగన్నా«థరావు తల్లి : ఎర్రబెల్లి ఆదిలక్ష్మి భార్య : ఉషాదయాకర్‌రావు కుమారులు: ఎర్రబెల్లి ప్రేమ్ చందర్రావు స్వగ్రామం: గ్రామం, మండలం, పర్వతగిరి, జిల్లా వరంగల్ రూరల్ పుట్టిన తేది: 04–07–1956 విద్యార్హతలు: ఇంటర్మీడియట్ రాజకీయరంగ ప్రవేశం : 1982, తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రథమ కన్వీనర్‌గా నియామకం, 1994లో వర్ధన్నపేట ఎమ్మెల్యేగా ఎన్నిక,1997లో టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక, 1999లో ప్రభుత్వ విప్‌గా ఎన్నిక,2008లో ఎంపీగా గెలుపు. 2009, 2014, 2018లో పాలకుర్తి ఎమ్మెల్యేగా ఎన్నిక. -
ఉత్కంఠ వీడింది!
ఒకరు టీఆర్ఎస్ స్థాపించినప్పటి నుంచి కేసీఆర్ వెన్నంటే నడిచిన నేత.. ఎన్నికల్లో ఓడిపోయినా పార్టీనే నమ్ముకుని ఉన్న నాయకుడు కావడంతో తొలిసారి కేబినెట్ హోదా పదవి దక్కింది.. ఈసారి ఎమ్మెల్యేగా గెలవడంతో మంత్రివర్గంలో చోటు సాధించగలిగారు.. ఇక మరొకరు ఉద్యోగంతో తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఉద్యమ నేతగా ఎదిగి... స్వరాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేక తెలంగాణ ఏర్పడగానే అభివృద్ధిలో పాలుపంచుకునేందుకు టీఆర్ఎస్లో చేరారు.. ఆ వెంటనే తొలిసారి.. ఇప్పుడు రెండోసారి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిచి మంత్రి పదవి దక్కించుకున్నారు.. వీరిద్దరు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, విరసనోళ్ల శ్రీనివాస్‌గౌడ్.. వనపర్తి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేగా గెలిచిన వీరిద్దరికీ రాష్ట్ర మంత్రివర్గంలో ఈసారి స్థానం దక్కింది. ఈ సందర్భంగా మంగళవారం వీరిద్దరూ హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలోని 14 స్థానాల్లో 13 స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకున్న నేపథ్యంలో ఇక్కడి నుంచి ఇద్దరికి మంత్రులుగా కేసీఆర్ అవకాశం కల్పించగా.. మాజీ మంత్రి లక్ష్మారెడ్డికి చోటు దక్కకపోవడం గమనార్హం. అయితే ఆయనకు మలి విడతలోనైనా.. మరేదైనా కేబినెట్ ర్యాంకు పదవైనా కట్టబెట్టొచ్చని తెలుస్తోంది. సాక్షి, వనపర్తి: మంత్రివర్గ విస్తరణపై నెలకొన్న ఉత్కంఠ తొలిగింది. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి వనపర్తి ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌కు చోటు దక్కింది. సీఎం కేసీఆర్ వీరిద్దరికి సోమవారం సాయంత్రం స్వయంగా ఫోన్ చేసి మంగళవారం ఉదయం 11.30 గంటలకు అందుబాటులో ఉండాలని సూచించినట్లు సమాచారం. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటింది. సీఎంగా కేసీఆర్, హోం మంత్రిగా మహమూద్ అలీ 2018 డిసెంబర్ 13వ తేదీన ప్రమాణ స్వీకారం చేసినా మిగతా మంత్రివర్గ విస్తరణ చేపట్టలేదు. దీంతో అప్పటి నుంచి నేడు, రేపు అంటూ ప్రచారం సాగుతుండగా ఎవరికి మంత్రి పదవి దక్కుతుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. అయితే, మంగళవారం మంత్రివర్గ విస్తరణకు ముహూర్తంగా నిర్ణయించడంతో పాటు ఉమ్మడి పాలమూరు నుంచి ఇద్దరికి స్థానం కల్పించడంతో సస్పెన్స్‌కు తెరపడింది. 13 స్థానాల్లో గెలవడంతో... 2018 సెప్టెంబర్ 6వ తేదీన టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. డిసెంబర్ 7వ తేదిన ఎన్నికలు జరగగా అదే నెల 11 వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 13 స్థానాలను గెలుచుకుని టీఆర్ఎస్ పార్టీ రికార్డు సృష్టించింది. ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై పోటీ చేసినా టీఆర్ఎస్ ప్రభంజనాన్ని ఆపలేకపోయాయి. కేవలం కొల్లాపూర్ స్థానంలో మాత్రం కాంగ్రెస్ గెలిచి కేవలం ఉనికిని కాపాడుకోగలిగింది. అత్యధికంగా 13 స్థానాలు గెలవడం, పార్టీ మరోసారి అధికారంలోకి రావడంతో మంత్రి పదవులను ఆశించే వారు అధికమయ్యారు. లక్ష్మారెడ్డికి నిరాశే మొదటి నుంచి వనపర్తి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేలు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు మాజీ మంత్రి జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి.లక్ష్మారెడ్డికి కేసీఆర్ కేబినెట్లో చోటు దక్కుతుందని ఊహాగానాలు వినిపించాయి. దీనిని నిజం చేస్తూ నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌కు మంత్రి పదవులు దక్కనున్నాయి. కానీ సీఎం కేసీఆర్ తాజా కేబినెట్లో గత మంత్రివర్గంలో కొనసాగిన లక్ష్మారెడ్డికి స్థానం లభించలేదు. అయితే, పార్లమెంట్ ఎన్నికల తర్వాత రెండో విడత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెబుతున్నా... ఇప్పటికే ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరికి స్థానం కల్పించడంతో మరొకరికి చోటు ఉంటుందా, లేదా అన్న విషయమై వేచి చూడాల్సిందే. అయితే, లక్ష్మారెడ్డికి కేబినెట్ హోదాలో పదవి ఇస్తారని తెలుస్తోంది. కొత్త వారికే చోటు కేసీఆర్ రెండోసారి గెలిచాక ఏర్పాటుచేసిన ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరూ కొత్త వారికే మంత్రి పదవులు దక్కడం విశేషం. ఒకరు ఉద్యోగ సంఘాల నేతగా పేరొంది ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీనివాస్ గౌడ్ కాగా.. మరొకరు సీఎంకు నమ్మిన బంటు, పార్టీ వ్యవస్థాపక సభ్యుడైన సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి. గతంలో వీరిద్దరికి కూడా మంత్రి వర్గంలో పనిచేసిన అనుభవం లేదు. కానీ వారి విధేయత, నమ్మకం, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకున్న కేసీఆర్ వీరిద్దరికి అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరికి మంత్రి పదవులు దక్కించుకున్న వీరికి రానున్న పార్లమెంట్ ఎన్నికల బాధ్యతలు అప్పగించనున్నారు. భారీ మెజార్టీ మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ ఉద్యమ సమయంలో టీజీవోస్ అధ్యక్షుడిగా ఉంటూ ఉద్యోగులరినీ సకల జనుల సమ్మెలో పాల్గొనేలా చేశారు. ఆ సమయంలో చేసిన సమ్మె అప్పటి ప్రభుత్వాన్ని కదిలించింది. 2014 మార్చి నెలలో ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో మహబూబ్‌నగర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి గెలవడంతో అప్పడే మంత్రి పదవి దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావుకు ఉమ్మడి జిల్లా నుంచి అవకాశం దక్కింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ 57,775 మెజార్టీతో గెలవడంతో శ్రీనివాస్‌గౌడ్ తప్పక మంత్రి పదవి వరిస్తుందని అందరూ భావించినట్లుగానే జరిగింది. మొదటి ప్రభుత్వంలోనే... వనపర్తి ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. 2001లో కేసీఆర్ టీఆర్ఎస్ పా ర్టీని స్థాపించాలనే ఆలోచన చేసిన నుంచి ఆయన వెంటే నడిచారు. 2014 లో ఎమ్మెల్యేగా పోటీ చేసినా స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. లేదంటే కేసీఆర్ మొదటి ప్రభుత్వంలోనే నిరంజన్ రెడ్డికి మంత్రి పదవి దక్కేది. ప్రస్తుత ఎన్నికల్లో 51,685 ఓట్ల మెజార్టీతో గెలవడంతో నిరంజన్ రెడ్డికి మంత్రివర్గంలో బెర్త్ ఖాయమైంది. మంత్రుల ప్రొఫైల్ -
ఫిబ్రవరి వరకు ఆగాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: మంత్రివర్గ విస్తరణకు పంచాయతీ ఎన్నికల నియమావళి అడ్డుగా మారింది. గ్రామపంచాయతీ ఎన్నికల నియమావళి అమలులో ఉన్న సమయంలో విస్తరణకు అవకాశం ఉండదని రాష్ట్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. దీంతో పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాతే మంత్రివర్గ విస్తరణ జరిగే పరిస్థితి నెలకొంది. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ ప్రకటించింది. ఎన్నికల నియమావళి వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపింది. జనవరి 30న గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగియనున్నాయి. అనివార్య పరిస్థితుల్లో ఎక్కడైనా ఆ రోజు పోలింగ్ ఆగిపోతే మరుసటి రోజు నిర్వహిస్తారు. పంచాయతీ ఎన్నికలు ముగిసే రోజు వరకు ఎన్నికల నియమావళి అమల్లో ఉంటుంది. ఇలా జనవరి ఆఖరు వరకు మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఉండదు. ఫిబ్రవరిలోనే మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ మెజారిటీ సాధించింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డిసెంబర్ 13న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఆయనతోపాటు మహమూద్ అలీ ఒక్కరే మంత్రిగా ప్రమాణం చేశారు. మరో 16 మందిని మంత్రులుగా నియమించుకునే అవకాశం ఉంది. డిసెంబర్ చివరి వారంలోనే మంత్రివర్గ విస్తరణ చేయాలని కేసీఆర్ భావించారు. అయితే ఫెడరల్ ఫ్రంట్ వ్యవహారాలతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. దీంతో సంక్రాంతి తర్వాత మంత్రివర్గ విస్తరణ జరపాలని భావించారు. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలతో ఈ ప్రక్రియ మరో రెండుమూడు వారాలు వాయిదా పడింది. ముహూర్తాల ప్రకారం ఫిబ్రవరి 7 వరకు మంచి రోజులు లేవని పండితులు చెబుతున్నారు. జనవరి 31 వరకు పంచాయతీ ఎన్నికల నియమావళి అమల్లో ఉంటుంది. ముహూర్తాల ప్రకారం చూస్తే మరో వారం వరకు అంటే.. ఫిబ్రవరి ఏడు తర్వాతే మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఉండనుంది. అసెంబ్లీ అలాగే... కొత్త ఎమ్మెల్యేల ప్రమాణం కోసం నిర్వహించే అసెంబ్లీ సమావేశాల పరిస్థితి ఇలాగే ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికల నియమావళి అమలులో ఉన్నప్పుడు అసెంబ్లీ నిర్వహణకు వీలు ఉండదు. తప్పనిసరి పరిస్థితుల్లో నిర్వహించాలని భావిస్తే తమ అనుమతి తీసుకోవాలని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల తర్వాతే అసెంబ్లీ సమావేశాలు జరిగే పరిస్థితి ఉంది. ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాల్సిన అనివార్యత ఉంటుంది. ఎమ్మెల్యేల ప్రమాణ కార్యక్రమంతోనే ఈ సమావేశాలు మొదలయ్యే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత 53 రోజుల వరకు ఎమ్మెల్యేల ప్రమాణం కార్యక్రమం జరగలేదని, 2014 ఎన్నికల తర్వాత సైతం 29 రోజుల తర్వాతే జరిగిందని కేసీఆర్ ఇటీవల తెలిపారు. ఇన్ని రోజుల్లోనే ఎమ్మెల్యేల ప్రమాణం కార్యక్రమం నిర్వహించాలని నిబంధనలలోనే ఎక్కడా లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ సమయంలోనే ఎమ్మెల్యేల ప్రమాణం కోసం అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. దశల వారీగా... మంత్రివర్గ విస్తరణ విషయంలో సీఎం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. త్వరలో నిర్వహించే విస్తరణలో ఎనిమిది లేదా పది మందిని మంత్రులుగా తీసుకోవాలని భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత మిగిలిన ఖాళీలను భర్తీ చేయాలని యోచిస్తున్నారు. తొలిదశలో చేపట్టే మంత్రివర్గ విస్తరణతోపాటు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికలను నిర్వహించనున్నారు. ఆ వెంటనే చీఫ్ విప్, విప్లతోపాలు పార్లమెంటరీ కార్యదర్శులు, కీలకమైన కార్పొరేషన్ చైర్మన్ పదవుల నియామకం పూర్తి చేయనున్నారు. వీటిని కూడా సంక్రాంతి తర్వాత పూర్తి చేయాలని కేసీఆర్ భావించినా పంచాయతీ ఎన్నికల నియమావళితో ఆలస్యమయ్యే పరిస్థితి నెలకొంది. -
సర్వం సందడి
సాక్షి, మంచిర్యాల : జిల్లాలో రాజకీయ వాతావరణం ఆసక్తికరంగా మారుతోంది. జిల్లాలోని ముఖ్య పార్టీల నేతలు పదవుల పందేరం, బాధ్యతల స్వీకరణలో బిజీగా మారుతున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ సింగపూర్ పర్యటన తర్వాత జరగబోయే పదవుల పంపకంపై కోటి ఆశలతో ఉన్నారు. కేసీఆర్ రాజీనామాతో త్వరలో జరగబోయే మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు భాగస్వాములు కావాలని పలువురు కాంగ్రెస్ నాయకులకు ఇప్పటికే సమాచారం అందింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వంతోపాటు టీటీడీ బోర్డు సభ్యుల పదవులు ఇస్తామని హామీని కొందరు తెలుగుదేశం తమ్ముళ్లు ఇప్పటికే పొందారు. 2014లో బీజేపీని గెలుపుతీరాలకు చేర్చిన పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పర్యటనకు బీజేపీ నాయకులు సిద్ధం అవుతున్నారు. సారొచ్చాకే సంబరాలు ముఖ్యమంత్రి హోదాలో సీఎం కేసీఆర్ సింగ పూర్ పర్యటనకు వెళ్లి 24తేదీన హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది. ఆ త ర్వాత పెద్ద ఎత్తున నాయకుల చేరికలకు గులాబీ పార్టీ రంగం సిద్ధం చేసింది. ఈ తంతు ముగిసిన తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంది. జిల్లాలో మంత్రి పదవి రేసులో సీరియస్‌గా వినిపిస్తున్న మహిళా ఎమ్మెల్యేతోపాటు మరో సీనియర్ ఎమ్మెల్యే కూడా ఈ కబురు కోసం ఎదురు చూస్తున్నారు. దీంతోపాటు ఎమ్మెల్సీ, మార్కెట్ కమిటీ చైర్మన్ వంటి నామినేటెడ్ పోస్టుల పందేరం అప్పుడే కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. పార్టీలో చేరిన ముఖ్య నేతలతోపాటు ఇన్నాళ్లు పార్టీకి సేవ చేసిన నాయకుల వివరాలని సమీక్షించి నామినేటెడ్ ఖాళీలు భర్తీ చేస్తారని పదవిపై కొండంత ఆశతో ఉన్న జిల్లా నాయకుడొకరు వివరించారు. సీఎం వచ్చాకే సంబరాలు ఉంటాయని గులాబీదళం భావిస్తోంది. తమ్ముళ్లకు బంపర్ ఆఫర్ తెలంగాణలో దాదాపు ప్రశ్నార్థకంగా మారిన టీడీపీ శ్రేణులను ఖుషీ చేసే ప్రక్రియకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఇటీవల జిల్లా బాధ్యులతోపాటు పలువురు నియోజకవర్గ ఇన్‌చార్జీలతో ఆయన సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పలు బోర్డుల్లో మెంబర్ అవకాశం కల్పిస్తామని వారికి బాబు భరోసా ఇచ్చారు. త్వరలో భర్తీ చేయబోయే తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుల నియామకంలో జిల్లాకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాకు చెందిన ఓ నాయకుడికి ఈ మేరకు గట్టి హామీ దొరికినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తెలంగాణ క్రెడిట్ దక్కించుకుందాం తెలంగాణ రాష్ట్రం కలను సాకారం చేసిన కాంగ్రెస్ పార్టీ ఆ ఫలాలను పొందేందుకు తాజా అవకాశానికి వ్యూహరచన చేస్తోంది. వచ్చేనెల 13న జరగనున్న మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికను ఇందుకు ఉపయోగించుకోవాలని భావిస్తోంది. సీఎం కేసీఆర్ రాజీనామాతో జరగనున్న ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఇటీవలి సమావేశంలో నేతలకు సూచించారు. జిల్లాలోని నాయకులు బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుందని ఆ సందర్భంగా లక్ష్మయ్య పేర్కొన్నారు. పార్టీకి కీలకమైన ఈ ఎన్నికకు పనిచేసే వారి వివరాలు ఇవ్వాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. కొత్త నాయకుడి భేటీకి సిద్ధం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియామకం అయిన అమిత్‌షా నేడు(గురువారం) హైదరాబాద్‌కు రానున్నారు. కార్యకర్తల సమావేశం తర్వాత రాష్ట్రాస్థాయి నేతలతో సమావేశం ఏర్పాటు చేసి పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం చేయనున్నారు. దీంతో పాటు మెదక్ పార్లమెంటు ఉప ఎన్నికలో విజయ సూత్రాలు బోధించే అవకాశం ఉంది. జాతీయస్థాయి కమలం వికసించేందుకు ముఖ్య కారకుడిగా భావిస్తున్న షా ఏం చెప్తారో అనే ఆసక్తి కాషాయదళంలో నెలకొంది. మొత్తంగా జిల్లాలో అన్నిపార్టీల్లోనూ సందడి నెలకొంది.