
సాక్షి, హైదరాబాద్: మంత్రివర్గ విస్తరణకు పంచాయతీ ఎన్నికల నియమావళి అడ్డుగా మారింది. గ్రామపంచాయతీ ఎన్నికల నియమావళి అమలులో ఉన్న సమయంలో విస్తరణకు అవకాశం ఉండదని రాష్ట్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. దీంతో పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాతే మంత్రివర్గ విస్తరణ జరిగే పరిస్థితి నెలకొంది. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ ప్రకటించింది. ఎన్నికల నియమావళి వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపింది. జనవరి 30న గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగియనున్నాయి. అనివార్య పరిస్థితుల్లో ఎక్కడైనా ఆ రోజు పోలింగ్ ఆగిపోతే మరుసటి రోజు నిర్వహిస్తారు.
పంచాయతీ ఎన్నికలు ముగిసే రోజు వరకు ఎన్నికల నియమావళి అమల్లో ఉంటుంది. ఇలా జనవరి ఆఖరు వరకు మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఉండదు. ఫిబ్రవరిలోనే మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ భారీ మెజారిటీ సాధించింది. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ డిసెంబర్ 13న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఆయనతోపాటు మహమూద్ అలీ ఒక్కరే మంత్రిగా ప్రమాణం చేశారు. మరో 16 మందిని మంత్రులుగా నియమించుకునే అవకాశం ఉంది. డిసెంబర్ చివరి వారంలోనే మంత్రివర్గ విస్తరణ చేయాలని కేసీఆర్ భావించారు.
అయితే ఫెడరల్ ఫ్రంట్ వ్యవహారాలతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. దీంతో సంక్రాంతి తర్వాత మంత్రివర్గ విస్తరణ జరపాలని భావించారు. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలతో ఈ ప్రక్రియ మరో రెండుమూడు వారాలు వాయిదా పడింది. ముహూర్తాల ప్రకారం ఫిబ్రవరి 7 వరకు మంచి రోజులు లేవని పండితులు చెబుతున్నారు. జనవరి 31 వరకు పంచాయతీ ఎన్నికల నియమావళి అమల్లో ఉంటుంది. ముహూర్తాల ప్రకారం చూస్తే మరో వారం వరకు అంటే.. ఫిబ్రవరి ఏడు తర్వాతే మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఉండనుంది.
అసెంబ్లీ అలాగే...
కొత్త ఎమ్మెల్యేల ప్రమాణం కోసం నిర్వహించే అసెంబ్లీ సమావేశాల పరిస్థితి ఇలాగే ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికల నియమావళి అమలులో ఉన్నప్పుడు అసెంబ్లీ నిర్వహణకు వీలు ఉండదు. తప్పనిసరి పరిస్థితుల్లో నిర్వహించాలని భావిస్తే తమ అనుమతి తీసుకోవాలని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల తర్వాతే అసెంబ్లీ సమావేశాలు జరిగే పరిస్థితి ఉంది. ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాల్సిన అనివార్యత ఉంటుంది.
ఎమ్మెల్యేల ప్రమాణ కార్యక్రమంతోనే ఈ సమావేశాలు మొదలయ్యే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత 53 రోజుల వరకు ఎమ్మెల్యేల ప్రమాణం కార్యక్రమం జరగలేదని, 2014 ఎన్నికల తర్వాత సైతం 29 రోజుల తర్వాతే జరిగిందని కేసీఆర్ ఇటీవల తెలిపారు. ఇన్ని రోజుల్లోనే ఎమ్మెల్యేల ప్రమాణం కార్యక్రమం నిర్వహించాలని నిబంధనలలోనే ఎక్కడా లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ సమయంలోనే ఎమ్మెల్యేల ప్రమాణం కోసం అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం కనిపిస్తోంది.
దశల వారీగా...
మంత్రివర్గ విస్తరణ విషయంలో సీఎం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. త్వరలో నిర్వహించే విస్తరణలో ఎనిమిది లేదా పది మందిని మంత్రులుగా తీసుకోవాలని భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత మిగిలిన ఖాళీలను భర్తీ చేయాలని యోచిస్తున్నారు. తొలిదశలో చేపట్టే మంత్రివర్గ విస్తరణతోపాటు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికలను నిర్వహించనున్నారు. ఆ వెంటనే చీఫ్ విప్, విప్‌లతోపాలు పార్లమెంటరీ కార్యదర్శులు, కీలకమైన కార్పొరేషన్ చైర్మన్ పదవుల నియామకం పూర్తి చేయనున్నారు. వీటిని కూడా సంక్రాంతి తర్వాత పూర్తి చేయాలని కేసీఆర్ భావించినా పంచాయతీ ఎన్నికల నియమావళితో ఆలస్యమయ్యే పరిస్థితి నెలకొంది.