రాష్ట్ర కేబినెట్‌లో జిల్లా నుంచి ఒక్కరికే అవకాశం రావడంతో మంత్రి వర్గంలో చోటుదక్కుతుందని భావించిన ఆశావహులకు నిరాశే ఎదురైంది. ఉమ్మడి వరంగల్‌లో 12 నియోజకవర్గాలు ఉండగా పది స్థానాలను టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గెలుచుకున్నారు. గత ప్రభుత్వంలో స్పీకర్‌తోపాటు రెండు మంత్రి పదవులు జిల్లాను వరించాయి. ఈ సారి ఒక్క పదవి మాత్రమే దక్కడంతో మిగతా వారికి కార్పొరేషన్ల చైర్మన్, ప్రభుత్వ విప్, పార్లమెంటరీ కార్యదర్శి పదవుల్లో అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది.
సాక్షి, వరంగల్ రూరల్ : రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. అమాత్య పదవులు ఎవరిని వరించబోతున్నాయన్న ఊహగానాలకు ఎట్టకేలకు తెరపడింది. మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు కల్పించాలనే విషయమై పూర్తి స్థాయి కసరత్తు అనంతరం జాబితాను సిద్ధం చేశారు. అందులో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పాలకుర్తి శాసన సభ్యుడు ఎర్రబెల్లి దయాకర్‌రావుకు చోటు లభించినట్లు సీఎం కార్యాలయం నుంచి ఆయనకు ఫోన్ కాల్ వచ్చింది.
నేడు ప్రమాణ స్వీకారం
ఈనెల 19న మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్ ఈ విషయమై గవర్నర్ నరసింహన్‌కు తెలియజేశారు. ఉదయం 11:30 గంటలకు రాజ్ భవన్‌లో మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. మంత్రి వర్గ విస్తరణ చేపట్టనుండడంతో ఇప్పటి వరకు ఉత్కంఠగా ఎదురుచూసిన ఆశావహులు పదవి దక్కించుకోవడానికి, అందులోనూ అనుకున్న శాఖ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
గత కేబినెట్‌లో స్పీకర్, రెండు మంత్రి పదవులు..
తెలంగాణ రాష్ట్ర తొలి కేబినెట్‌లో జిల్లాకు స్పీకర్, రెండు మంత్రి పదవులు దక్కాయి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, స్పీకర్‌గా సిరికొండ మధుసూదనాచారికి అవకా శం దక్కింది. తర్వాత డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా రాజయ్య పదవి కోల్పోవడంతో ఆయన స్థానంలో కడియం శ్రీహరికి ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రిగా అవకాశం కల్పించారు. డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించగా రెండో సారి సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన సమయంలో మహమూద్ అలీతో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మం త్రి వర్గ విస్తరణ చేయలేదు. ప్రస్తుతం ముహూర్తం ఖరారు కావడంతో ఉత్కంఠకు తెరపడింది.
మంత్రిగా ‘ఎర్రబెల్లి’కి అవకాశం
పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుకు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు రావాల ని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ ద్వారా సమాచారం అందింది. తొలి సారిగా మం త్రి వర్గంలో దయాకర్‌రావుకు చోటు దక్కింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాలకు 10 స్థానాలను టీఆర్‌ఎస్ పార్టీ గెలుచుకుంది. అందులో వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా నన్నపునేని నరేందర్, పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, వర్ధన్నపేట అరూరి రమేష్, పాలకుర్తి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మహబూబాబాద్ శంకర్‌నాయక్, డోర్నకల్ రెడ్యానాయక్, నర్సంపేట పెద్ది సుదర్శన్‌రెడ్డి, పరకాల చల్లా ధర్మారెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్ డాక్టర్ రాజయ్య, జనగామ యాదగిరిరెడ్డి ఎన్నికయ్యారు. అయితే మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితోపాటు ఎమ్మెల్యేలు దయాకర్‌రావు, ధరంసోత్ రెడ్యానాయక్, వినయ్‌భాస్కర్, అరూరి రమేష్‌లకు మంత్రి వర్గంలో చోటు లభిస్తుందని ప్రచారం జరిగింది. తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఒక్క ఎర్రబెల్లి దయాకర్‌రావుకే మంత్రి పదవి దక్కడం చర్చనీయాంశంగా మారింది.
ఎమ్మెల్యేగా డబుల్ హ్యాట్రిక్..
వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరికి చెందిన ఎర్రబెల్లి దయాకర్‌రావు 1982లో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు. 1994లో జరిగిన సాధారణ ఎన్నికల్లో వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 1999లో రెండోసారి, 2004లో మూడో సారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1999లో నాటి చంద్రబాబు ప్రభుత్వంలో ప్రభుత్వ విప్‌గా పని చేశారు. ఆ తరువాత 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన తరువాత పాలకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. 2009 ఎన్నికల్లో పాలకుర్తి నుంచి నాలుగోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికలతోపాటు 2018లో జరిగిన ఎన్నికల్లో వరుసగా వరుసగా ఆరో సారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 ఎన్నికల తరువాత టీడీఎల్పీ నేతగా వ్యహరించారు. 2016లో టీడీపీని వీడి టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. 2018 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో 53,062 ఓట్ల భారీ మెజార్టీ విజయం సాధించారు.
హైదరాబాద్‌లోనే దయాకర్‌రావు
మంత్రివర్గ విస్తరణ మంగళవారం జరుగుతున్న నేపథ్యంలో పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు హైదరాబాద్‌లోనే ఉన్నారు. కశ్మీర్‌లో ఇటీవల ఉగ్రవాదులు జరిపిన దాడిలో వీరమరణం పొందిన సీఆర్‌పీఎఫ్ జవాన్లుకు తన సాయంగా రూ.2.50లక్షల చెక్‌ను టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సోమవారం అందించారు. ఇదే సందర్భంలో కేటీఆర్ ఎర్రబెల్లికి ముందస్తు అభినందలు తెలిపినట్లు సమాచారం. ఇది జరిగిన కొన్ని నిమిషాల తేడాతోనే ప్రగతి భవన్ నుంచి ఫోన్ రావడంతో ఆయన రాజధానిలోనే ఉన్నారు.
మండలి చైర్మన్‌గా కడియం?
గత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన కడియం శ్రీహరికి శాసన మండలి చైర్మన్‌గా అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత మండలి చైర్మన్ స్వామిగౌడ్ ఎమ్మెల్సీ పదవీ కాలం త్వరలో ముగియనుండడంతో ఆ స్థానం కడియంకు దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. డోర్నకల్ ఎమ్మెల్యే ధరంసోత్ రెడ్యానాయక్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌లకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవులు, ప్రభుత్వ విప్, పార్లమెంటరీ కార్యదర్శి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఎర్రబెల్లి దయాకర్‌రావు బయోడేటా..
పూర్తి పేరు: ఎర్రబెల్లి దయాకర్‌రావు
తండ్రి : ఎర్రబెల్లి జగన్నా«థరావు
తల్లి : ఎర్రబెల్లి ఆదిలక్ష్మి
భార్య : ఉషాదయాకర్‌రావు
కుమారులు: ఎర్రబెల్లి ప్రేమ్ చందర్‌రావు
స్వగ్రామం: గ్రామం, మండలం, పర్వతగిరి, జిల్లా వరంగల్ రూరల్
పుట్టిన తేది: 04–07–1956
విద్యార్హతలు: ఇంటర్మీడియట్
రాజకీయరంగ ప్రవేశం : 1982, తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రథమ కన్వీనర్‌గా నియామకం, 1994లో వర్ధన్నపేట ఎమ్మెల్యేగా ఎన్నిక,1997లో టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక, 1999లో ప్రభుత్వ విప్‌గా ఎన్నిక,2008లో ఎంపీగా గెలుపు. 2009, 2014, 2018లో పాలకుర్తి ఎమ్మెల్యేగా ఎన్నిక.
Comments
Please login to add a commentAdd a comment