సోమేశ్.. టీఆర్ఎస్ ఏజెంట్!
జీహెచ్ఎంసీ కమిషనర్‌పై కాంగ్రెస్ మండిపాటు
* భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: ‘‘జీహెచ్ఎంసీ కమిషనర్ టీఆర్ఎస్ పార్టీకి ఏజెంట్ మాదిరిగా పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఇతర పార్టీలకు చెందిన, టీఆర్ఎస్కు ఓటేసేందుకు ఇష్టపడని వారి ఓట్లను నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తున్నారు. గ్రేటర్‌లోని 42 లక్షల ఓటర్లలో ఇప్పటికే 17 లక్షలకు పైగా ఓట్లను తొలగించారు’’ అంటూ రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌కు టీ కాంగ్రెస్ నేతలు శుక్రవారం ఫిర్యాదు చేశారు.
ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలనికోరారు. అన్యాయంగా ఎవరి ఓట్లనైనా అధికారులు తొలగించినట్టతే వాటిని తిరిగి జాబితాలో చేరుస్తామని వారికి భన్వర్‌లాల్ హామీ ఇచ్చారు. అనంతరం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. గ్రేటర్‌లోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ 30 నుంచి 40 శాతం ఓట్లను తొలగిస్తూ తద్వారా ఇతర పార్టీల ఉనికిని ప్రశ్నార్థకం చేసేందుకు అధికార టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సనత్‌నగర్‌లో 1.4 లక్షలు, ఎల్బీనగర్లో 1.38 లక్షల ఓట్లు తీసేశారని సుధీర్‌రెడ్డి చెప్పారు.
ఎన్నికల అధికారిగా సోమేశ్ ఉంటే గ్రేటర్ ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరగబోవని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ అన్నారు. ఆయన్ను ఏపీ క్యాడర్‌కు కేటాయించినందున తక్షణం పంపేయాలని, దీనిపై లోకాయుక్తకు ఫిర్యాదు చే స్తామని చెప్పారు. ఈ అంశంపై టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గాంధీభవన్‌లో నేతల తో భేటీ అయ్యారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్ధి కోసం సెటిలర్ల ఓట్లను తొలగించేందుకు టీఆర్ఎస్ కుట్ర పన్నుతోందని మండిపడ్డారు. తాము చెప్పిన మేరకు ఓట్లు తొలగించాలంటూ ఎన్నికల సంఘంపై కూడాఒత్తిడి తె స్తున్నారన్నారు. దీనిపై భన్వర్‌లాల్ రెండు మూడు రోజుల్లో స్పందించకుంటే ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలసి ఫిర్యాదు చేస్తామన్నారు. అప్పటికీ న్యాయం జగరకపోతే కోర్టును ఆశ్రయిస్తామన్నారు.
స్మారక స్టాంపుల రద్దు కుటల రాజకీయం...
మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ స్మారక తపాల బిళ్లలను కేంద్రం కుటిల రాజకీయాలతో రద్దు చేయడం క్షమార్హం కాదని ఉత్తమ్, భట్టి ధ్వజమెత్తారు. కేంద్రం తీరుకు నిరసనగా ఈ నెల 22న అన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తమ పార్టీ పోరాటాల ఫలితంగా భూ సేకరణ ఆర్డినెన్స్ సవరణ చట్టాన్ని కేంద్రం వెనక్కు తీసుకున్న నేపథ్యంలో 20న ఏఐసీసీ ఆధ్వర్యంలో ఢిల్లీలో కిసాన్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.