state government T
-
6 లక్షల మంది రైతులకు రుణమాఫీ
సాక్షి, హైదరాబాద్: ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,850 కోట్ల మేర పంట రుణమాఫీ డబ్బులను జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రూ.25వేల నుంచి రూ.50 వేల లోపు పంట రుణాలున్న రైతుల రుణాలను మాఫీ చేస్తూ శుక్రవారం వ్యవసాయ శాఖ రెండు ఉత్తర్వులు జారీ చేసింది. రూ.50 వేల లోపు రుణాలన్నీ మాఫీ చేయాలని, బ్యాంకులు ఈ మొత్తాన్ని ఏ ఇతర బాకీ కింద జమ చేసుకోవద్దని ఆదేశించింది. ఆ సొమ్మును పూర్తిగా పంట రుణమాఫీ కిందే జమ చేయాలని స్పష్టం చేసింది. రుణమాఫీ జరిగిన రైతుల ఖాతాలను జీరో చేసి, కొత్తగా పంట రుణాలు ఇవ్వాలని సూచించింది. అంతకు ముందు ఇదే అంశంపై 42 బ్యాంకుల ప్రతినిధులతో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి బీఆర్కే భవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ, రూ.50 వేలలోపు రైతు రుణమాఫీకి సంబంధించి తగిన ఏర్పాట్లు చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు. ఈ నెల 15వ తేదీన సీఎం కేసీఆర్ లాంఛనంగా రూ. 50 వేలలోపు రైతు రుణమాఫీని ప్రకటిస్తారన్నారు. అదే రోజు నుంచి ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,850 కోట్లు జమ అవుతాయన్నారు. రుణమాఫీ సొమ్ము జమ కాగానే ముఖ్యమంత్రి పేరుతో రైతు రుణం మాఫీ అయినట్లు లబ్ధిదారుల ఫోన్లకు ఎస్ఎంఎస్ వెళ్లాలని ఆదేశించారు. రైతు రుణమాఫీతో పాటు కొత్త పంట రుణానికి మీరు అర్హులని.. ఆ సందేశంలో తప్పకుండా పేర్కొనా లని సూచించారు. బ్యాంకులు సైతం రైతులకు రుణమాఫీ అయినట్లు స్పష్టమైన సందేశం పంపాలన్నారు. మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వానికి అన్ని బ్యాంకులు సహకరించాలన్నారు. ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా రైతులకు రుణ మాఫీ మొత్తం చేరవేయాలని కోరారు. -
తెలంగాణ: ఆగస్టులో 15 కిలోల రేషన్ బియ్యం
సాక్షి, హైదరాబాద్: రేషన్ దుకాణాల ద్వారా ఆగస్టు నెలలో పదిహేను కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర నిర్ణయం మేరకు జూలై నుంచి నవంబర్ వరకు నెలకు పది కిలోల ఉచిత బియ్యం పంపిణీ చేయాల్సి ఉన్నా, వివిధ కారణాలతో జూలైలో 5 కిలోలే పంపిణీ చేశారు. ఈ నెలలో జూలై కోటా కలుపుకొని 15 కిలోల బియ్యాన్ని పాత కార్డుదారులందరికీ పంపిణీ చేయనుంది. ఈ నేపథ్యంలో అన్ని రకాల ఆహార భద్రతా కార్డులు కలిగిన వారికి ఒక్కొక్కరికి 15 కిలోలు, కొత్తగా ఈ కార్డులు పొందిన వారికి ఒక్కొక్కరికి 10 కిలోలు, అంత్యోదయ కార్డుదారులకు 35 కిలోలు, అన్నపూర్ణ కార్డుదారులకు 10 కిలోలు ఉచితంగా ఇవ్వాలని పౌర సరఫరాల కమిషనర్ అనిల్‌కుమార్ శుక్రవారం అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటే అంత్యోదయ కార్డుదారులకు కుటుంబానికి కిలో చక్కెరను రూ.13.50కి, గోధుమలు జీహెచ్ఎంసీ పరిధిలో 3 కిలోలు, మునిసిపల్‌లో 2 కిలోలు, కార్పొరేషన్లో ఒక కిలో చొప్పున కిలో రూ.7కు ఇవ్వాలని ఆదేశించారు. -
రోబో 4.O
సాక్షి, హైదరాబాద్: తుంటి, మోకాలు వంటి కీళ్లమార్పిడి శస్త్రచికిత్సల్లో గుర్తింపు పొందిన సన్‌షైన్ ఆస్పత్రి యాజమాన్యం తాజాగా మరో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. కీళ్లమార్పిడి శస్త్రచికిత్సల్లో దేశంలోనే తొలిసారిగా రూ.12 కోట్ల విలువ చేసే ఆధునిక ‘నాలుగో తరం’ రోబోను ప్రవేశపెట్టింది. శనివారం సైబర్ కన్వెన్షన్ సెంటర్లో మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్‌గౌడ్, పద్మశ్రీ అవార్డు గ్రహీత పీవీ సింధు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, సన్‌షైన్ ఆస్పత్రి ఆర్థోపెడిక్ విభాగాధిపతి డాక్టర్ గురువారెడ్డిలు రోబోను ఆవిష్కరించారు. మోకాలి చిప్ప, తుంటి ఎముక అరుగుదల భాగాన్ని కచ్చితంగా గుర్తించి, ఆ మేరకు కంప్యూటర్ నావిగేషన్ సాయంతో సరైన ప్రమాణం నిర్ధారించుకుని, శస్త్రచికిత్స సమయంలో ఒక్క అంగుళం కూడా తేడా రాకుండా ఇంప్లాంట్‌ను విజయవంతంగా అమర్చే ప్రక్రియలో ఈ రోబో సాయపడుతుందని, దీంతో రోగికి తక్కువ రక్తస్రావం, నొప్పితోపాటు ఎలాంటి ఇన్ఫెక్షన్ల బెడద లేకుండా త్వరగా కోలుకునేందుకు సహకరిస్తుందని గురువారెడ్డి తెలి పారు. కార్యక్రమంలో డాక్టర్ ఆదర్శ్ అన్నపరెడ్డి, డాక్టర్ కుషాల్ హిప్పల్‌గావన్‌కర్, డాక్టర్ సుహాన్‌తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ ‘శాస్త్ర విజ్ఞాన ఫలాలను కింది స్థాయి ప్రజలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఖరీదైన చికిత్సలను తక్కువ ధరలకే అందిస్తూ గురవారెడ్డి ఎంతోమంది వైద్యులు నగరానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారు. ఏ వ్యక్తి రాణించాలన్నా కష్టపడకుండా, ఇష్టపడకుండా సాధ్యం కాదు, గురవారెడ్డి 30 ఏళ్లు కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారు. వేలాది మందికి విశ్వాసాన్ని కల్పించడంలో ఆయన సక్సెస్ అయ్యారు’ అని అన్నారు. -
అప్పు.. సంపదకే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం వివిధ రూపాల్లో తెచ్చిన అప్పులను మూలధన వ్యయం కింద సంపద సృష్టి కోసం ఖర్చు చేస్తోందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) కితాబు ఇచ్చింది. సమీకరించిన రుణాలేగాకుండా.. కొంత రెవెన్యూ ఆదాయాన్ని కూడా పెట్టుబడి వ్యయం కింద వెచ్చించిందని తేల్చింది. ఈ మేరకు 2017–18 ఆర్థిక సంవత్సరానికిగాను ఆదివారం శాసనసభ ముందుంచిన కాగ్ నివేదికలో ప్రభుత్వ అప్పులను ఖర్చు చేసే విధానం ఉపయుక్తంగానే ఉందని అభిప్రాయపడింది. అప్పులను సంపద సృష్టి కోసం వెచ్చించడ వివేకంతో కూడిన ఆర్థిక నిర్వహణ కిందకు వస్తుందని వ్యాఖ్యానించింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కింద రూ.26,231 కోట్లు తీసుకొచ్చిందని కాగ్ తన లెక్కల్లో తేల్చింది. ఈ అప్పుల కింద తెచ్చినవాటికి అదనంగా మరో రూ.3,880 కోట్లు కలిపి మొత్తం రూ.30,111 కోట్లు మూలధన వ్యయం కింద ఖర్చు పెట్టిందని వెల్లడించింది. 2017–18 ఆర్థిక సంవత్సరమేగాక అంతకుముందు మూడేళ్లు కూడా రుణాలను ఇదేరీతిలో ఖర్చు పెట్టినట్లు కాగ్ గణాంకాలు చెబుతున్నాయి. -
చెక్‌పవర్‌పై వెంటనే జీవో ఇవ్వాలి: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: సర్పంచ్‌తో పాటు చెక్‌పవర్ ఇచ్చే వారెవరో నిర్ణయించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దానికనుగుణం గా జీవో జారీచేయాలని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. గ్రామాల్లో కొత్త పాలకమండళ్లు ఏర్పడి మూడు నెలలు దాటుతున్నా నేటికీ పంచాయతీలకు చెక్‌పవర్ లేకపోవడం, గ్రామాల్లో మంచినీటి సమస్యతో పాటు, కనీస అవసరాలు తీర డం లేదన్నారు. సిబ్బందికి చెల్లించే అరకొర జీతభత్యాలు కూడా లేక పారిశుధ్య పనులు చాలా చోట్ల నిలిచిపోయాయని ఒక ప్రకటనలో తెలి పా రు. పంచాయతీరాజ్ కొత్త చట్టంలో సర్పంచ్, ఉపసర్పంచ్ చెక్‌పవర్ నిబంధన ఉన్నప్పటికీ, సర్పంచ్‌తో పాటు గ్రామ కార్యదర్శికి చెక్‌పవర్ ఇస్తామని ఇటీవలే సీఎం ప్రకటించారన్నారు. జాయింట్ చెక్‌పవర్ ఎవరికిస్తారనే దానిపై నేటికీ స్పష్టత లేదని, ఎన్నికల కోడ్‌కు, చెక్‌పవర్‌కు సం బంధం లేకపోయినా ప్రభుత్వం దాన్ని సాకుగా చూపుతోందన్నారు. 14వ ఫైనాన్స్ కమిషన్ నిధులు, ఇతర గ్రాంట్స్ ఖర్చు చేసేందుకు ప్రభుత్వానికి చట్టబద్ధ ఆటంకమేమీ లేదన్నారు. -
అభినందనల అధినేత
కేసీఆర్ ఇంటి వద్ద సందడే సందడి క్యూ కడుతున్న నాయకులు, అధికారులు, కార్యకర్తలు సాక్షి,సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, కాబోయే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు(కేసీఆర్)కు అభినందనల వెల్లువ సాగుతోంది. గురువారం బంజారాహిల్స్‌లోని ఆయన నివాసానికి ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ అభిమానులు తరలివచ్చి బోకేలతో అధినేతను అభినందించారు. నూతనంగా ఏర్పడబోయే తెలంగాణ రాష్ట్రంలో తాము అనుకున్నవన్నీ జరుగుతాయని ఉత్సాహంతో పుష్పగుచ్ఛాలందించి కాబోయే ముఖ్యమంత్రిని అభినందించారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, నాయకులతోపాటు పలుశాఖల కార్యదర్శులు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, పలు జిల్లాల కలెక్టర్లు, తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు, తెలంగాణ ముస్లిం న్యాయవాదుల సంఘం నాయకులు, పలు వ్యాపారసంస్థల అధిపతులు, పలువురు పారిశ్రామివేత్తలు, ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమల ఉద్యోగ సంఘాల నాయకులు, తెలంగాణ వైద్యుల సంఘం నాయకులు,తెలంగాణ ట్రెజరి ఉద్యోగులు, తెలంగాణ కళాకారుల సంఘం నాయకులు, తెలంగాణ పోలీసు అధికారుల సంఘం నాయకులు, తెలంగాణ చిన్నపరిశ్రమల సంఘం నాయకులు, పలు ధార్మిక సంఘాల నాయకులు, పలు గ్రామాల సర్పంచులు, పార్టీ తరఫున గెలిచిన జడ్పీటీసీలు, తెలంగాణ గౌడ సంఘం నాయకులు అభిమానులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కల్లు దుకాణాలు తెరిపించేందుకు హామీ బంజారాహిల్స్: గ్రేటర్ పరిధిలోని కల్లు దుకాణాలను త్వరలో తెరిపించేలా చర్యలు తీసుకుంటానని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం నాయకులకు హామీఇచ్చారు. ఈనెల 2న తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్న సందర్భంగా కేసీఆర్‌ను అభినందించేందుకు వచ్చిన తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సదానందంగౌడ్తోపాటు తెలంగాణ గౌడ జేఏసీ కన్వీనర్ వెంకన్నగౌడ్, కోకన్వీనర్లు నారాయణగౌడ్, వేణుగోపాల్‌గౌడ్‌లతో ఆయన మాట్లాడారు. గత కాంగ్రెస్ సర్కారు లిక్కర్ మాఫియాతో కుమ్మకై జీవో 767 ద్వారా తెలంగాణవ్యాప్తంగా 1600 కల్లు గీత సొసైటీలను రద్దు చేసిందని, దీనివల్ల కేవలం ఒక్క గ్రేటర్ పరిధిలోనే లక్షా 50వేల మంది ఉపాధి కోల్పోయారని వారు కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. ఇంకా కలిసిన వారిలో శ్రీనివాస్‌గౌడ్, బాలరాజ్, అనిల్గౌడ్లతోపాటు సుమారు 100 మంది ఉన్నారు. ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకుంటాం.. కాచిగూడ: దళితుడినే ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించిన కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని, ఈనెల 2న జరిగే ఆయన ప్రమాణ స్వీకారోత్సవాన్ని అడ్డుకుంటామని మాదిగ స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఎంఎస్ఎఫ్) హెచ్చరించింది. గురువారం కాచిగూడ నింబోలిఅడ్డాలోని ఎస్సీ హాస్టల్లో బోయిని శ్రీనివాస్ మాదిగ విలేకరులతో మాట్లాడుతూ 2న తెలంగాణ విజయోత్సవ దినం పాటిస్తే, దళితులకు మాత్రం విద్రోహదినమే అవుతుందని అన్నారు. కేసీఆర్‌కు రక్షణ కవచంగా ఉంటామని కొంతమంది దళిత నాయకులు అనడం సిగ్గుచేటన్నారు.