సెట్స్ కన్వీనర్లు ఖరారు
పకడ్బందీగా ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణ: పాపిరెడ్డి
ఆన్లైన్లో పీజీఈసెట్,ఈసెట్‌ల నిర్వహణ
ఒకే యూనివర్సిటీ ఆధ్వర్యంలో పీజీసెట్
డిగ్రీ ప్రవేశాల్లో లోపాలు,వాటి పరిష్కారంపై కమిటీ
కొత్త డిగ్రీ కాలేజీలకు అనుమతి ఇచ్చేది లేదని స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల కన్వీనర్లను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి శుక్రవారం ఖరారు చేసింది. ఈ ప్రవేశ పరీక్షల తేదీలను ఇప్పటికే ఖరారు చేసినా.. వాటిని నిర్వహించే సమయాన్ని తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి వివరాలను వెల్లడించారు. ఎంసెట్ కన్వీనర్‌గా ప్రొఫెసర్ యాదయ్య, ఈసెట్‌కు ప్రొఫెసర్ గోవర్దన్, పీఈసెట్‌కు ప్రొఫెసర్ వి.సత్యనారాయణ, ఐసెట్‌కు ప్రొఫెసర్ కె.ఓంప్రకాష్, లాసెట్, పీజీలాసెట్లకు ప్రొఫెసర్ ఎంవీ రంగారావు, పీజీఈసెట్ కన్వీనర్‌గా ప్రొఫెసర్ సయిదా సమీన్ ఫాతిమాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఇక 2016 ఎడ్‌సెట్ రెండో దశ కౌన్సెలింగ్ అంశంపై కోర్టులో కేసు ఉందని, అందువల్ల 2017 ఎడ్‌సెట్ కన్వీనర్‌పై ప్రభుత్వ స్థాయిలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఇక పీజీఈసెట్, ఈసెట్‌లను ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు చెప్పారు.
పీజీలో ప్రవేశాలకు కామన్ సెట్
పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు ఇప్పటివరకు ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలు వేర్వేరుగా ప్రవేశ పరీక్షలను (పీజీసెట్) నిర్వహిస్తున్నాయి. ఇకపై ఒక సబ్జెక్టుకు ప్రవేశపరీక్షను ఒక వర్సిటీ ఆధ్వర్యం లోనే నిర్వహించాలని నిర్ణయించామని పాపిరెడ్డి తెలిపారు. కొన్ని సబ్జెక్టులకు ఉస్మానియా వర్సిటీ, మరికొన్ని సబ్జెక్టులకు కాకతీయ వర్సిటీ పీజీసెట్ నిర్వహిస్తాయన్నారు. ఆయా వర్సిటీల ఆధ్వర్యంలోనే ఆన్లైన్ కౌన్సెలింగ్ ఉంటుందని చెప్పారు. విద్యార్థులు రాష్ట్రం లోని ఏ యూనివర్సిటీలోనైనా ప్రవేశం కోసం ప్రాధాన్య క్రమంలో ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుందని.. ఆప్షన్లు, ర్యాంకుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందని వెల్లడించారు.
కొత్త డిగ్రీ కాలేజీలు ఇచ్చేది లేదు
వచ్చే విద్యా సంవత్సరంలోనూ కొత్త ప్రైవేటు డిగ్రీ కాలేజీలను మంజూరు చేసేది లేదని పాపిరెడ్డి తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో లక్ష నుంచి లక్షన్నర వరకు సీట్లు మిగిలిపోతున్న నేపథ్యంలో కొత్త కాలేజీలకు అనుమతులు ఇవ్వవద్దని భావిస్తున్నామన్నారు. అయితే ఒకటీ రెండు కోర్సులు, బ్రాంచీలు మాత్రమే ఉన్న కాలేజీలు అదనపు బ్రాంచీల కోసం దరఖాస్తు చేసుకున్నాయని.. వాటిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల్లో లోపాలు, ఒక్కో కాలేజీలో ఒక్కో రకమైన ఫీజుల విధానంపైనా దృష్టి పెడతామని చెప్పారు. దీనిపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసి, ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలకు ఒకే చట్టం ఉండేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కేంద్రంలోనూ ప్రభుత్వం ఒకే యాక్ట్ ఉండేలా చర్యలు చేపట్టిందని, అది పూర్తయితే రాష్ట్రంలో తేవడం మరింత సులభం అవుతుందని పేర్కొన్నారు. ఉస్మానియా శతాబ్ధి ఉత్సవాల తరువాత వర్సిటీల్లోని ఖాళీల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు.