సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పటికే విచ్చలవిడిగా పెద్ద సంఖ్యలో ప్రైవేటు డిగ్రీ కాలేజీలు పుట్టుకొచ్చాయని... దీంతో ఈ ఏడాది కొత్త డిగ్రీ కాలేజీలకు అనుమతులు ఇవ్వవద్దని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. ఎలాగూ ‘ఫీజు రీయింబర్స్‌మెంట్’ వస్తుందని ఇష్టమొచ్చినట్లుగా కాలేజీలు ఏర్పాటు చేశారని, అందువల్ల ఇప్పట్లో కొత్త డిగ్రీ కాలేజీల ఏర్పాటు అనవసరమని అభిప్రాయపడుతోంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అవసరమున్నా, లేకున్నా రాజకీయ పలుకుబడి, పైరవీలతో పెద్ద సంఖ్యలో కొత్త డిగ్రీ కాలేజీలు పుట్టుకువచ్చాయి.
వీటిల్లో చాలా కాలేజీలు విచారణకు వెళ్లిన అధికారులను ప్రలోభపెట్టి అనుమతులు పొందినట్లు ఆరోపణలున్నాయి. అసలు గత ఇరవయ్యేళ్లుగా ఏటా పదిలోపే కొత్త ప్రైవేటు డిగ్రీ కాలేజీలకు అనుమతులివ్వగా... గత రెండేళ్లలో మాత్రం ఏకంగా 296 డిగ్రీ కాలేజీల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వడం గమనార్హం. దీంతో ప్రైవేటు డిగ్రీ కాలేజీల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది.
ఎలాగూ ‘ఫీజు రీయింబర్స్‌మెంట్’ వస్తుందని అవసరం లేనిచోట కూడా కాలేజీలను ఏర్పాటు చేశారని, కనీస వసతులు, అర్హులైన అధ్యాపకులు లేరని ఉన్నత విద్యా మండలికి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు కూడా అందాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కొత్తగా ప్రైవేటు డిగ్రీ కాలేజీలకు అనుమతులు ఇవ్వకూడదని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. అవసరాన్ని బట్టి భవిష్యత్‌లో కొత్త కాలేజీల ఏర్పాటును పరిశీలించాలని యోచిస్తోంది.
కొత్త డిగ్రీ కాలేజీల అనుమతికి నో!
Published Wed, Feb 11 2015 4:20 AM | Last Updated on Wed, Sep 5 2018 9:00 PM
Advertisement
Advertisement