state litigation policy
-
కేసుల సత్వర పరిష్కారానికి రాష్ట్ర వ్యాజ్య విధానం
సాక్షి, అమరావతి: నూతనంగా తీసుకురానున్న రాష్ట్ర వ్యాజ్య విధానాన్ని (స్టేట్ లిటిగేషన్ పాలసీ) సమర్థవంతంగా అమలు చేస్తే కేసులు సత్వర పరిష్కారానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పేర్కొన్నారు. శనివారం సచివాలయంలో వ్యాజ్యాల అంశంపై న్యాయాధికారులు, కార్యదర్శులతో సమావేశం జరిగింది. సీఎస్ మాట్లాడుతూ స్టేట్ లిటిగేషన్ పాలసీని నిరంతరం పర్యవేక్షిస్తూ పటిష్టంగా అమలు చేస్తే కేసుల్లో జాప్యాన్ని నివారించవచ్చన్నారు. ఈ విధానం వల్ల కేసుల వివరాలు ప్రభుత్వ న్యాయవాదులకు, ప్రభుత్వ శాఖల అధికారులకు ఎప్పటికప్పుడు తెలుస్తాయని, తద్వారా సకాలంలో కౌంటర్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉం టుందని చెప్పారు. తద్వారా కోర్టులపై ప్రభుత్వ వ్యాజ్యాల భారాన్ని కూడా తగ్గించవచ్చన్నా రు. అదేవిధంగా రాష్ట్ర విచారణ సేవల (స్టేట్ ప్రాసిక్యూషన్ సర్వీస్)ను మరింత బలోపేతం చేసేందుకు వ్యాజ్య విధానం దోహదం చేస్తుం దని చెప్పారు. అందుకే ఏపీ ఆన్లైన్ లీగల్ కేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రవేశ పెట్టనున్నట్టు తెలి పారు. దీనివల్ల జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టులకు సంబంధించిన వివిధ వ్యాజ్యాల సమగ్ర డేటాబేస్ అందుబాటులో ఉంటుందన్నారు. సమన్వయంతోనే సత్వర పరిష్కారం సమావేశంలో రాష్ట్ర అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ మాట్లాడుతూ ప్రభుత్వ న్యాయవాదులు, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తే కేసుల సత్వర పరిష్కారానికి అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాజ్య విధానం, ప్రభుత్వ శాఖల విధానాలు, నిబంధనల ఫ్రేమ్‌వర్క్, వ్యాజ్యాల దాఖలు స్థాయిలోనే సవాల్ చేసేలా తీసుకోవాల్సిన చర్యలు, వ్యాజ్యాలపై నిర్ణీత కాల వ్యవధిలో సమీక్ష, వైఫల్యాలపై జవాబుదారీతనం తదితర అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది. ఆన్లైన్ కేస్ లోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అమలు సమీక్షించారు. ప్రతి ప్రభుత్వ శాఖలో లైజన్ అధికారులు, లీగల్ ఆడ్వైజర్లను నియమించుకునే అంశంపై చర్చించారు. రాష్ట్ర ఆదనపు అడ్వకేట్ జనరల్ పి.సుధాకర్‌రెడ్డి, న్యాయ శాఖ కార్యదర్శి వి.సునీత, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, న్యాయాధికారులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి ‘లిటిగేషన్ పాలసీ’ని రూపొందించండి
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం పాలసీ రూపకల్పనకు ఆరు నెలలు గడువు సాక్షి, హైదరాబాద్: న్యాయస్థానాల్లో ఉన్న పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో రూపొందించిన విధంగానే రాష్ట్రంలో కూడా ‘స్టేట్ లిటిగేషన్ పాలసీ’ని రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇందుకు ఆరు నెలలు గడువిచ్చింది. వివిధ న్యాయస్థానాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న కేసుల్లో సత్వరమే స్పందించేందుకు ఆయా విభాగాల్లో సీనియర్ అధికారులను ‘లైజన్ ఆఫీసర్లు’గా నియమించాలని, ఈమేరకు ఆయా శాఖాధిపతులకు ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)కి స్పష్టం చేసింది. కోర్టులో ఉన్న కేసుల వివరాలను కంప్యూటరీకరించి, వాటిని ఎప్పటికిప్పుడు పర్యవేక్షించేందుకు ఓ విధానాన్ని కూడా రూపొందించాలని ఆదేశించింది. పెండింగ్ కేసుల్లో పురోగతిని సమీక్షించేందుకు ఏడాదికి ఒకసారి అడ్వొకేట్ జనరల్, న్యాయ శాఖ కార్యదర్శులతో సమావేశం నిర్వహించాలని కూడా సీఎస్‌ను ఆదేశిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.రామలింగేశ్వరరావు ఇటీవల తీర్పునిచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)కు సంబంధించి వివిధ న్యాయస్థానాల్లో ఉన్న కేసులను మూడు నెలలకొకసారి సమీక్షించాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌ను ఆదేశించారు. జూబ్లీహిల్స్ ప్రాంతంలో వి.వసుంధర, మరో ఐదుగురు నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారని, దీనిపై ఫిర్యాదు చేసినా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోలేదంటూ డాక్టర్ జె.మధుసూదన్‌రెడ్డి, మరో నలుగురు 2004లో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ రామలింగేశ్వరరావు ఇటీవల తీర్పును వెలువరించారు. ఈ సందర్భంగానే స్టేట్ లిటిగేషన్ పాలసీని రూపొందించాలని ఆదేశించారు. వసుంధర తదితరులు వారి నిర్మాణాల విషయంలో జోక్యం చేసుకోకుండా కింది కోర్టు నుంచి తెచ్చుకున్న ఉత్తర్వులను ఎత్తివేసేందుకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడాన్ని న్యాయమూర్తి తప్పుపట్టారు. ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించాలని, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు సాగుతుంటే చర్యలు తీసుకోవాలని 2004 ఏప్రిల్ 13న అప్పటి న్యాయమూర్తి ఆదేశించినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడాన్ని సైతం జస్టిస్ రామలింగేశ్వరరావు ప్రముఖంగా ప్రస్తావించారు. కేసు దాఖలై పదేళ్లయినా జీహెచ్ఎంసీ కమిషనర్ ఎటువంటి కౌంటర్ దాఖలు చేయకపోవడాన్ని తప్పుపట్టారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ, జీహెచ్ఎంసీ న్యాయవాదుల తీరును కూడా తప్పుపట్టారు. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల న్యాయవాదులు కోర్టులపట్ల చాలా తేలిక భావనతో వ్యవహరిస్తున్నట్లు గమనించామని ఆయన పేర్కొన్నారు. అధికారులు సమాచారం పంపినా న్యాయవాదులు కౌంటర్లు దాఖలు చేయడంలేదని అన్నారు. అసెంబ్లీ జరుగుతున్న సమయంలో, ఎన్నికల సమయాల్లో అధికారులు వాయిదా కోరడం సహజమని, కోర్టులు సైతం ఆ సమయాల్లో వాయిదాలు వేస్తుంటాయని, అయితే తాజాగా రాష్ట్ర విభజన పేరుతో అధికారులు కోర్టులకు సహకరించడం మానేశారని వ్యాఖ్యానించారు. ఇటువంటి వైఖరిని తాము ఆమోదించేది లేదని తేల్చి చెప్పారు. ప్రజల కోసం పనిచేస్తున్నామన్న విషయాన్ని ప్రభుత్వ న్యాయవాదులు మరచిపోకూడదని హితవు పలికారు. 2004, ఏప్రిల్ 14న ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించింది ఎవరో గుర్తించి, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన జీహెచ్ఎంసీ కమిషనర్‌ను ఆదేశించారు.