State Minorities Commission
-
మీ రాజకీయం మరణ శాసనం.. టీడీపీకి గుడ్‌బై
సాక్షి, అమరావతి/గుంటూరు: దివంగత లాల్‌జాన్‌బాషా సోదరుడు, ఏపీ స్టేట్ మైనారిటీస్ కమిషన్ ఛైర్మన్ ఎండీ జియాఉద్దీన్ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. కుల, మత, ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే మీ రాజకీయం టీడీపీకి మరణ శాసనంగా మారిందంటూ తన రాజీనామా కారణాలు వివరిస్తూ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు బహిరంగలేఖ రాశారు. తమ కుటుంబం అంతా పార్టీకి అంకితభావంతో పనిచేసినట్లు తెలిపారు. ‘మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారం కోల్పోయినప్పుడు మరొక రకంగా ప్రవర్తించడం మాతో సహా వ్యక్తిత్వం కలిగిన ప్రతి ఒక్కరికీ ఇబ్బందికరంగా ఉంది. మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా హిందూ దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసాన్ని వివాదం చేశారు. ఇప్పుడు కులాల మధ్య చిచ్చుపెట్టేలా మీ స్వీయ దర్శకత్వంలో వైఎస్సార్సీపీ ఎంపీ రఘురామకృష్ణరాజును పావులా వాడుకుంటూ మీ అనుకూల మీడియాతో రాష్ట్రంలో అశాంతిని సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నారు. మతాలు, కులాలు, ప్రాంతాల మధ్య విభజన చేసే మీ రాజకీయం టీడీపీకి మరణ శాసనంగా మారింది. మీరు మాత్రం మారలేదు. రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు రఘురామను సీఐడీ అధికారులు అరెస్టు చేస్తే దీన్ని నిరసిస్తూ మీరు రాస్తున్న ఉత్తరాలు, పడుతున్న తపన చూస్తుంటే అధికారం కోసం ఎంతకైనా తెగించే మీ మనస్తత్వం అందరికీ అర్థమవుతోంది. ఆయన తరఫున ఢిల్లీలోను లాబీయింగ్ ఎందుకు నడుపుతున్నారో మీకే తెలియాలి. ఇంతటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్న మీ నాయకత్వంలో పనిచేయడం ఇక ఆత్మహత్యా సదృశమే అవుతుంది. ఇక ఈ జన్మలో మీరు మారరనేది స్పష్టమైపోయింది. కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్లే పునాదిగా సాగే మీ పార్టీలో ఇంకా కొనసాగడానికి నా మనస్సాక్షి అంగీకరించడంలేదు. అందుకే రాజీనామా చేస్తున్నా’ అని జియాఉద్దీన్ ఆ లేఖలో పేర్కొన్నారు. -
నాన్నకు ప్రేమతో టీంకు నోటీసులు
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో చిత్ర బృందానికి రాష్ట్ర మైనారిటీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని పోస్టర్లు తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని కొందరు మైనారిటీ కమ్యూనిటీ వ్యక్తులు కమిషన్ ను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో దానిని పరిశీలించిన కమిషన్ నోటీసులు పంపించింది. చిత్ర నిర్మాతలకు, చిత్ర నటీనటులకు పంపించింది. అంతకుముందు ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలంటూ రెండు తెలుగు రాష్ట్రాల పోలీసు కమిషనర్లకు, సెన్సార్ బోర్డు ప్రాంతీయ అధికారికి నోటీసులు పంపించింది. ఎందుకు మీపై ఈ ఫిర్యాదులకు సంబంధించి చర్యలు తీసుకోకూడదో వివరించాలని పేర్కొటూ ఈ నెల 18కి వాయిదా వేసింది. అంతకుముందు కూడా జూనియర్ ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో సినిమా పోస్టర్ ముస్లింల మనోభావాలు దెబ్బతీసేలా ప్రచురించారని మైనార్టీ యువజన సంఘాల నాయకులు వరంగల్ జిల్లా జనగామ కోర్టులో కొందరు ప్రైవేటు కేసు వేశారు. సినిమా దర్శకుడు సుకుమార్, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్, హీరో జూనియర్ ఎన్టీఆర్, హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్, ఆటోగ్రఫీ విజయ్ చక్రవర్తిపై మైనార్టీ యువజన సంఘాల నాయకులు ఫిర్యాదులో పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే, దీనిపై చిత్ర నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ క్షమాపణలు కూడా చెప్పారు. -
బ్యాంక్ గ్యారంటీ లేకుండా మైనార్టీలకు రుణాలు
సాక్షి,హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకం కింద నిరుద్యోగ మైనార్టీలకు ఎలాంటి బ్యాంక్ గ్యారంటీ (పూచీకత్తు)లు లేకుండా రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకర్లు రాష్ట్ర మైనార్టీ కమిషన్‌కు హమీ ఇచ్చారు. శుక్రవారం రాజ్‌భవన్ రోడ్‌లోని రాష్ట్ర మైనార్టీస్ కమిషన్ కార్యాలయంలో మైనార్టీ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు తీరుతెన్నులపై బ్యాంకర్లతో సమీక్షా సమావేశం జరిగింది. మైనార్టీ వర్గాలకు కేంద్ర శిశు పథకం కింద చిన్నతరహా వ్యాపారానికి రూ.50 వేల వరకు, కిశోర పథకం కింద మధ్యతరహా వ్యాపారానికి రూ.50 వేల నుంచి ఐదు లక్షల వరకు, తరుణ్ పథకం కింద పెద్ద పరిశ్రమల స్థాపన కోసం రూ.ఐదులక్షల నుంచి పది లక్షల వరకు రుణాలు అందించేందుకు బ్యాంకులు అంగీకరించాయి. అదేవిధంగా విదేశీ విద్యాభాసం కోసం ఎలాంటి బ్యాంకు గ్యారంటీ లేకుండా రూ.4 లక్షల వరకు ఇవ్వనున్నాయి. ఇద్దరి పూచీకత్తులపై రూ. 4 లక్షల నుంచి రూ.7లక్షల వరకు ఇస్తాయి. రూ.7 లక్షలపైగా రుణాల కోసం మాత్రం తగిన గ్యారంటీ అవసరమని స్పష్టం చేశాయి. విద్యార్థుల కోసం జీరో ఖాతాల నిర్వహణకు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జిల్లా స్థాయిలో కార్యక్రమాలు రాష్ట్రంలో మైనార్టీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పథకాల్లో ప్రోత్సహించేందుకు సెప్టెంబరులో జిల్లా స్థాయిలో కార్యక్రమాలు, రుణ మేళాలు నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. బ్యాంకింగ్ రుణాలపై ప్రత్యేక బుక్ లెట్ రూపొందించి విస్తృతంగా ప్రచారం కల్పించాలని తీర్మానించారు. అదేవిధంగా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాలని, లీడ్ బ్యాంక్‌లో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాని నిర్ణయించారు.రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ అబీద్ రసూల్ ఖాన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కమిషన్ సభ్యులు గౌతమ్ జైన్, సర్దార్ సుర్జీత్ సింగ్, ఇటాలియా, వివిధ జాతీయ బ్యాంకుల డీజీఎం, ఏజీఎం, సీనియర్ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.