పాలమూరుః 10
తెలంగాణ రాష్ట్రంలో వాహనాల గుర్తింపునకు ఇక నుంచి ‘టీఎస్’ సీరిస్ రానుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్నాళ్లూ రవాణాశాఖ ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీజినల్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ(ఏపీఎస్ ఆర్టీఏ) పేర సేవలందించింది. ఇక కొత్త రాష్ట్రం ఆవిర్భావంతో ఈనెల 2 నుంచి తెలంగాణ స్టేట్ రీజినల్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ(టీఎస్ ఆర్టీఏ)పేరిట సేవలు అందించనుంది. ఈ మేరకు మరో నాలుగురోజుల్లో జీఓ రానున్నట్లు సమాచారం. మహబూబ్‌నగర్ జిల్లాకు ‘టీఎస్ 10’ నెంబర్ కేటాయించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మహబూబ్‌నగర్ క్రైం: జిల్లా వాహన గుర్తింపు నెంబర్ ఇక మారనుంది. గతంలో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వాహనాలకు సంబంధించి ఏపీ 22వ సీరిస్ నెంబర్ ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతో జిల్లాకు ‘టీఎస్ 10’ నెంబర్ కేటాయించే అవకాశం ఉందని ఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో మోటర్‌సైకిల్ నుంచి లారీ వరకు అన్ని కలిపి 2.20లక్షల వాహనాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన జూన్ 2 నుంచి జిల్లావ్యాప్తంగా సుమారు రెండువేల వాహనాలు షోరూంల నుంచి ఆన్‌రోడ్డు పైకి వచ్చాయి. జూన్ నుంచి రూ.1.08 కోట్లు వివిధ పన్నులు, రిజిస్ట్రేషన్ ఫీజులు, త్రైమాసిక పన్నులు, ట్యాక్సీలు, అపరాధ రుసుములు వసూలయ్యాయి. జిల్లాలో విద్యాసంస్థలకు చెందిన 749 బస్సుల్లో ఇప్పటివరకు 350 వరకు ఫిట్నెస్ను పరీక్షించినట్లు ఆర్టీఓ కిష్టయ్య తెలిపారు. గత పాతవిధానంలోనే జిల్లాలకు టీఎస్ నెంబర్లు కేటాయిస్తారని, తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాలకు కూడా అక్షరక్రమం మాదిరే నెంబర్లు కేటాయించొచ్చని ఆయన పేర్కొన్నారు
ఫిట్నెస్ మాటేంటి?
విద్యాసంస్థలకు చెందిన బస్సులను ఆర్టీఎ అధికారులు ఫిట్నెస్ పరీక్షించడంలో చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.ఆర్టీఏ నిబంధనలు ఉల్లంఘించి విద్యాసంస్థల యాజమానులు ఫిట్నెస్ లేని బస్సులను నడిపిస్తూ విద్యార్థుల జీవితాలతో చెల గాటమాడుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలోనే హడావిడి తనిఖీలు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 800వరకు వివిధ విద్యాసంస్థలకు చెందిన బస్సులు ఉన్నట్లు సమాచారం. ఇందులో 70శాతం బస్సులు మాత్రమే ఫిట్నెస్ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. వాటిపట్ల అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. కొత్త రాష్ట్రంలోనైనా రోడ్డు భద్రతాచర్యలను పకడ్బందీగా చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
నిబంధనలు పాటించాలి
విద్యాసంస్థలకు చెందిన వాహనాలకు ఫిట్నెస్ పరీక్ష చేయించాలి. వాహనాల రికార్డులను ‘ఆన్లైన్’తో పాటు రిజిస్టర్లో రాయాలని ఎంవీఐలను ఆదేశించాం. ఇప్పటివరకు 10 బస్సుల ఫిట్నెస్ పూర్తయింది. ఫిట్నెస్ చూపించకుండా.. నిబంధనలు పాటించని వాహనాలను నడిపితే కఠినచర్యలు తీసుకుంటాం.
-కిష్టయ్య, ఆర్టీఓ