కాలినడకన విచారణకు..
సీఐడీ డీజీపీ ఎదుట హాజరైన ఏడీజీపీ రవీంద్రనాథ్
తనను అరెస్ట్ చేయాలని విజ్ఞప్తి
కుదరదన్న సీఐడీ డీజీపీ బిపిన్ గోపాలకృష్ణ
రవీంద్రకు మద్దతుగా దళిత సంఘాల ధర్నా
బెంగళూరు, న్యూస్‌లైన్ : కర్ణాటకలో ఐపీఎస్ అధికారుల మధ్య చిచ్చురేపిన ఏడీజీపీ డాక్టర్ రవీంద్రనాథ్ కేసు రోజుకోమలుపు తిరుగుతోంది. శనివారం ఆయన ఇక్కడి హెచ్ఎస్ఆర్ లేఔట్‌లోని ఇంటి నుంచి కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటు నేరుగా చాలుక్య సర్కిల్ సమీపంలోని సీఐడీ కార్యాలయం చేరుకున్నారు. సీఐడీ డీజీపీ బిపిన్ గోపాలకృష్ణ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు.
తనను అరెస్టు చేసి స్టేట్మెంట్ రికార్డు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం పరిస్థితుల్లో అరెస్ట్ చెయ్యడం కుదరదని బిపిన్ గోపాలకృష్ణ స్పష్టం చేయడంతో రవీంద్ర బయటకు వచ్చారు. అక్కడి నుంచి సీఐడీ విభాగం ఏడీజీపీ గర్గ్ ఎదుట హాజరై తనను అరెస్ట్ చేయాలని కోరారు. ఆయన కూడా అరెస్ట్ కుదరదని చెప్పడంతో, కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్పీ రాజప్ప ఎదుట హాజరయ్యారు.
ఆయన కూడా అరెస్ట్ చెయ్యాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అన ంతరం బయటకు వచ్చిన రవీంద్రను మీడియా ప్రతినిధులు చుట్టుముట్టారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ తనను కేఎస్ఆర్పీ నుంచి బదిలీ చేశారని, ఎక్కడ పోస్టింగ్ ఇవ్వలేదని అన్నారు. ప్రస్తుతం తనకు వాహనం కూడా లేదని, సంఘటన రోజు హైగ్రౌండ్ పోలీసులు తనను లాకప్‌లో వేశారు, అంటే అరెస్ట్ చేసినట్లేనని, తన స్టేట్మెంట్ తీసుకుని దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తన స్టేట్మెంట్ రికార్డు చేస్తే కేసు పెట్టిన యువతులకు కూడా న్యాయం జరుగుతుందని రవీంద్ర గుర్తు చేశారు. తనను అరెస్ట్ చేయ్యకుంటే కోర్టును ఆశ్రయిస్తానని అన్నారు. ఇప్పటికే బెంగళూరు నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్, డీసీపీ రవికాంత్‌గౌడ, హైగ్రౌండ్స్ ఎస్ఐ రవిలపై కబ్బన్‌పార్క్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు రవీంద్ర అన్నారు. హోం మంత్రి జార్జ్‌పై తనకు పూర్తి నమ్మకుందని, ఈ కేసు దర్యాప్తునకు రెండు మూడు రోజులు చాలని ఎందుకు జాప్యం చేస్తున్నారో అర్థం కావడం లేదని ఏడీజీపీ డాక్టర్ రవీంద్రనాథ్ వాపోయారు.
దద్దరిల్లిన టౌన్‌హాల్
తక్కువ కులానికి చెందిన వాడని ఏడీజీపీ డాక్టర్ రవీంద్రనాథ్‌పై కక్ష సాధిస్తున్నారని ఆరోపిస్తూ పలు సంఘాలు శనివారం టౌన్‌హాల్ ఎదుట ధర్నా నిర్వహించి నిరసనలు వ్యక్తం చేశారు. శనివారం ఉదయం ప్రజా పరివర్తన వేదిక, దళిత సంఘర్షణ సమితి, సమతా సైనికదళ, కర్ణాటక జనాందోళన సంఘటన తదితర సంఘాల ఆధ్వర్యంలో వందలాది మంది పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.
దళితుడు అనే భావనతో ఏడీజీపీ డాక్టర్ రవీంద్రనాథ్‌పై కక్ష సాధిస్తున్న బెంగళూరు నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్, డీసీపీ రవికాంత్‌గౌడ, ఎస్ఐ రవిలను వెంటనే సస్పెండ్ చెయ్యాలని డిమాండ్ చేశారు. రవీంద్రనాథ్‌కు న్యాయం జరిగే వరకు తాము పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు.